- రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల సర్టిఫికెట్లు ఉండాలని నిబంధన
- ఆందోళనలో బీపీఈడీ అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) పోస్టులకు టీఎస్‌పీఎస్సీ విధించిన నిబంధన బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) అభ్యర్థులకు లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టింది. బీపీఈడీతో పాటు ఇంటర్ కాలేజీ, రాష్ట్ర, జాతీయ స్థాయి స్పోర్ట్స్‌లో పాల్గొన్నట్లు ఏదేని సర్టిఫికెట్ ఉంటేనే పీఈటీ పోస్టులకు అర్హులంటూ గురుకులాల్లో పీఈటీ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నిబంధన కారణంగానే.. బీపీఈడీ చేసినా పీఈటీ పోస్టులకు అనర్హులు అవుతున్నామని అభ్యర్థులు ఆందోళనలో పడ్డారు.
ఇంటర్మీడియెట్‌లో 45% మార్కులు ఉండి, అండర్ గ్రాడ్యుయేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (యూజీపీడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) చేసిన వారు కూడా ఈ పీఈటీ పోస్టులకు అర్హులే. అయితే వారికి పోటీల్లో పాల్గొన్న సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధన మాత్రం లేదు. కేవలం బీపీఈడీ చేసిన వారికి మాత్రమే పోటీల్లో పాల్గొన్న పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉండాలని నిబంధన విధించడం ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం పీఈటీ పోస్టులకు యూజీపీడీ, డీపీఈడీ చేసిన వారు మాత్రమే అర్హులు.
అయితే అంతకంటే ఎక్కువ అర్హతలైన డిగ్రీ, బీపీఈడీ ఉన్న వారికి కూడా పీఈటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని సంక్షేమ శాఖలు నిర్ణయం తీసుకున్నాయి. వారికి అవకాశం కల్పిస్తూనే స్పోర్ట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధన విధించడంతో ప్రయోజనం లేకుండాపోయింది. రాష్ట్రంలో యూజీపీడీ, డీపీఈడీ కాలేజీలకంటే బీపీఈడీ కాలేజీలే అధికంగా ఉన్నాయి. సాధారణ డిగ్రీ చదువుకున్న వారు కూడా బీపీఈడీ చేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో అనేక మంది బీపీఈడీ చేశారు. వారెవరికీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు లేవు. టీఎస్‌పీఎస్సీ విధించిన నిబంధనతో బీపీఈడీ అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో తీవ్ర ఆవేదనలో పడ్డారు.
స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉంటేనే పీఈటీ పోస్టుల్లో అవకాశం!
Published Wed, Apr 26 2017 12:49 AM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM
Advertisement
Advertisement