ప్రాంతీయత ఆధారంగానే కేటాయించాలి | Telangana High Court Lawyers Association to Local basis | Sakshi
Sakshi News home page

ప్రాంతీయత ఆధారంగానే కేటాయించాలి

Published Fri, May 6 2016 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

Telangana High Court Lawyers Association to Local basis

* తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం డిమాండ్
* న్యాయాధికారుల కేటాయింపు జాబితాను ఉపసంహరించుకోవాలి
* కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన తర్వాతే హైకోర్టు జడ్జిల భర్తీ
* త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి

సాక్షి, హైదరాబాద్: కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజనకు సంబంధించి న్యాయాధికారులను కేటాయిస్తూ రూపొందించిన ప్రాథమిక జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదని తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు తేల్చి చెప్పా రు. తెలంగాణ న్యాయాధికారులకు అన్యా యం చేస్తూ రూపొందించిన ఆ జాబితాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

న్యాయాధికారుల సర్వీసు రికార్డులో పేర్కొన్న ప్రాంతం ఆధారంగా కేటాయింపులు చేయాలని కోరారు. హైకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రాథమిక జాబితా రూపొందిందని, అది తెలంగాణ న్యాయాధికారులకు అన్యాయం చేసే విధంగా ఉందని తెలంగాణ న్యాయవాదులు గళం విప్పిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అత్యవసర కార్యవర్గ సమావేశం జరిగింది. సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు అధ్యక్షతన హైకోర్టులో జరిగిన ఈ సమావేశంలో పెద్దసంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కొందరు న్యాయవాదులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసిన అనంతరం పలు తీర్మానాలు చేశారు. ఇక న్యాయవాదుల జేఏసీ, రాష్ట్రంలోని ఇతర న్యాయవాదుల సంఘాలతో చర్చించి తమ ఆందోళనకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని సంఘం అధ్యక్షుడు గండ్రమోహన్‌రావు తెలిపారు. సమావేశం అనంతరం కేటాయింపుల ప్రాథమిక జాబితా ప్రతులను న్యాయవాదులు హైకోర్టు బయట తగులబెట్టారు. మరోవైపు ప్రాథమిక జాబితాపై నిరసన వ్యక్తం చేస్తూ ఆదిలాబాద్‌లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య పాల్గొన్న సమావేశాన్ని అక్కడి న్యాయవాదులు బహిష్కరించారు.
 
న్యాయవాదుల సంఘం చేసిన తీర్మానాలు
* తక్షణమే హైకోర్టు విభజన చేపట్టి, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలి
న్యాయాధికారుల కేటాయింపు ప్రాథమిక జాబితాను వెంటనే ఉపసంహరించుకోవాలి
* సర్వీసు రికార్డుల్లోని ప్రాంతం ఆధారంగా న్యాయాధికారుల కేటాయింపు జరగాలి
* సెక్షన్-77 ప్రకారం కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఆమోదం తీసుకోవాలి
* కిందిస్థాయి న్యాయవ్యవస్థను విభజించాకే జడ్జిల నియామకాన్ని ప్రారంభించాలి
* ఈ డిమాండ్ల సాధనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయ, హోం, ఇతర శాఖల మంత్రులను కలసి వినతిపత్రాలు ఇవ్వాలి.

Advertisement
Advertisement