జుట్టు కత్తిరించమంటే.. చెవి కోశాడు
ముంబై: నితిన్ కాగ్జి టైం బాలేదు! జుట్టును కట్ చేయించుకుందామని ముంబైలోని ఖరీదైన హెయిర్ సెలూన్‌కు వెళ్లిన ఈ ప్రముఖ వ్యాపారికి చేదు అనుభవం ఎదుయింది. లోయర్ పరేల్‌లో ఉన్న ఈ సెలూన్ హెయిర్‌స్టైలిస్టు ఆదివారం సాయంత్రం పొరపాటుగా ఆయన చెవిని కొంతమేర కత్తిరించాడు. బాగా నొప్పిరావడంతో అనుమానం వచ్చి కాగ్జి భార్యకు ఫోన్ చేశారు. ఆమె వచ్చి చూస్తే చెవి కాస్త తెగిపోయి కనిపించింది. దీంతో సెలూన్ యాజమాన్యం సదరు హెయిర్ స్టైలిస్ట్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది.
కాగ్జి మాత్రం ఈ సంస్థపై కోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ‘ఆయన చెవి తెగిందని తెలిసి వాళ్లు దానికి బ్యాండేజ్ వేశారు. తీసి చూస్తే విషయం తెలిసింది. రక్తం కారడంతో ఆస్పత్రికి వెళ్లాం. చిన్న ఆపరేషన్ చేశారు. రూ.10 వేలు ఖర్చయ్యాయి. ’అని కాగ్జి భార్య ప్రాచీ వివరించారు. ఈ సెలూన్‌లో హెయిర్ కటింగ్ కోసం కాగ్జి ఏటా రూ.25 వేలు చెల్లిస్తున్నారు. జరిగిన విషయాన్ని వివరిస్తూ కాగ్జి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో జీన్ క్లాడ్ బిగిన్ సెలూన్ సంస్థ సీఈఓ స్పందించి ఆయనకు క్షమాపణ చెప్పారు.