హక్కుల ఉద్యమ పతాక | Martin lutharking is rebal movement in Gerogia | Sakshi
Sakshi News home page

హక్కుల ఉద్యమ పతాక

Published Thu, Mar 31 2016 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM

హక్కుల ఉద్యమ పతాక

హక్కుల ఉద్యమ పతాక

‘‘ఈ దేశం ఉన్నతమైన విలువలతో తలెత్తుకొని నిలబడాలని నేను కలగంటున్నాను. మనుషులంతా ఒక్కటేననే సత్యాన్ని ఈ దేశం బలంగా నిరూ పిస్తుందని కలగంటున్నాను. జార్జియా ఎర్రకొండల్లో గతకాలపు బానిసల వారసులు, బానిస యజమానుల వారసులు సోదరభావంతో కలగలిసి సంభాషించుకునే వేదికను కలగంటున్నాను.’’ అమెరికా శ్వేత జాత్యహంకారంపై సింహగర్జన చేసిన మానవ హక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కంఠం నుంచి వెలువడిన మాటలివి. 1963లో వాషింగ్టన్‌లో రెండు లక్షల యాభై వేల మంది ప్రదర్శకులనుద్దేశించి ఆయన చేసిన సుప్రసిద్ధ ప్రసంగం ‘‘ఐ హేవ్ ఎ డ్రీమ్’లోని మాటలివి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల ప్రేమికులందరినీ ఆ ఉపన్యాసం అప్పుడూ, ఇప్పుడూ ఉత్తేజపరుస్తూనే ఉంది. శతాబ్దాల అణచివేతను ధిక్కరించి, అసమానతల నుంచి విముక్తిని కాంక్షిస్తూ సాగే ప్రతి మానవహక్కుల ఉద్యమమూ ఈ మాటలతో నిత్యం ఉత్తేజితమౌతూనే ఉంటుంది.
 
 వివక్ష వ్యతిరేక శస్త్రం
 మార్టిన్ లూథర్‌కింగ్ తరతరాల వివక్షకీ, అణచివేతకీ చిరునామాగా నిలిచిన నల్ల జాతిలో పుట్టిన శాంతికాముకుడు. శాంతియుత పోరాటాల ద్వారానే సామాజిక అసమానతలు తొలగిపోతాయని, మార్పు సంభవిస్తుందని విశ్వసించిన పోరాటయోధుడు. 1929, జనవరి 15న జార్జియాలోని అట్లాంటాలో జన్మించిన మార్టిన్ లూథర్‌కింగ్,  తాత తండ్రులు నిర్వహించిన క్రైస్తవ బోధనతోనే తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అయితే 1955 డిసెంబర్, 1న జరిగిన ఒక ఘటనతో ఆయన ఉద్యమ ప్రస్థానం మొదలైంది. మాంట్గొమెరి పట్టణంలో ఒక నల్ల జాతి మహిళను బస్సులో వెనుక కూర్చో వాలంటూ కొందరు శ్వేత జాతీయులు బలవంత పెట్టగా, ఆమె నిరాక రించడంతో ఆమెను అరెస్టు చేశారు. దానికి నిరసనగా మహిళా రాజకీయ సమితితో కలసి ఇతర ఆఫ్రికన్ నాయకులు మాంట్గొమెరి అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి కింగ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆ నగర మేయర్, కింగ్‌తో మాట్లాడడానికి నిరాకరించారు.

దీంతో నల్లజాతీయులు బస్సుల బహిష్కరణ ఉద్యమం చేపట్టారు. 382 రోజుల ఈ ఉద్యమం సాగుతుండగా కింగ్ నివాసంపై బాంబుల దాడి జరిగింది. అయినా, కింగ్ నాయకత్వంలో ఆ ఉద్యమం నిరాటంకంగా కొనసాగింది. చివరకు 1956, నవంబర్ 13న అమెరికన్ సుప్రీం కోర్టు బస్సుల్లో వర్ణ వివక్ష సరికాదని తీర్పునిచ్చింది. ఆ తీర్పు వెలువడిన మరుసటి రోజున జరిగిన వర్ణవివక్షను అధిగమించి తొలిసారిగా బస్సులో ప్రయాణించిన మొదటి నల్లజాతీయుడు కింగ్. నాటి నుంచి ఆయన జాతీయస్థాయి హక్కుల నేతగా గుర్తింపు పొందారు. ఫిబ్రవరి 14న ‘టైమ్’ పత్రిక ఆయన ముఖచిత్ర కథనాన్ని ప్రచురించింది. మే, 17న వాషింగ్టన్ నగరంలో ‘‘మాకు ఓటు ఇవ్వండి’’ అంటూ చేసిన మొదటి ప్రసంగంలోనే ఆయన అమెరికా దేశ ప్రజల మనసుల్ని దోచుకోగలిగారు.
 
 1959 ప్రారంభంలో కింగ్ భారతదేశంలో పర్యటించారు. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో పాటు, మహాత్మాగాంధీ అనుచరులను, ఇతర సామాజిక ఉద్యమ కార్యకర్తలను కలుసుకున్నారు. అమెరికా తిరిగి వెళ్లిన తర్వాత అమెరికాలోని వర్ణ వివక్షను, భారతదేశంలోని కుల వివక్షను పోల్చి చూసుకున్నారు. అందుకు తగ్గట్టుగా తన కార్యాచరణను రూపొందించు కున్నారు. 1957-1968ల మధ్య దాదాపు ఆరు లక్షల మైళ్ళు పర్యటించి, 25 వేల సభల్లో ప్రసంగించారు. 1963లో వాషింగ్టన్‌లో జరిగిన చారిత్రాత్మక సభలో కింగ్ ‘‘ఐ హేవ్ ఎ డ్రీమ్’’ అనే ఒక ఉత్తేజకర ప్రసంగం చేశారు. 1968 ఏప్రిల్ 4 సాయంత్రం టెనిసీ రాష్ట్రంలోని మెమ్‌ఫిస్ నగరంలోని ఒక హోటల్ గది బాల్కనీలో నిల్చొని ఉండగా, ప్రపంచ మానవ హక్కుల దిక్సూచి మార్టిన్ లూథర్ కింగ్‌ను కాల్చి చంపారు. 39 ఏళ్ళకే ముష్కరుల దాడిలో కింగ్ మరణించడం ప్రపంచ మానవహక్కుల ఉద్యమానికి తీరని లోటు. 35 ఏళ్ళకే కింగ్‌ను నోబెల్ శాంతి బహుమతి వరించడమే ఆయన విశిష్టతను తెలుపుతుంది. మానవ హక్కులకు మారు పేరుగా కింగ్ పేరు స్థిరపడి పోయింది.
 
 ట్రంప్ నీడ హక్కులకు పీడ
 కింగ్ అమరత్వం పొందిన 48 ఏళ్లకు అమెరికాలో మానవహక్కుల అస్తిత్వం మరోసారి ప్రమాదంలో పడిపోతున్నది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ముందున్న డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, అనూహ్యంగా ఆయనకు మద్దతు పెరుగుతుండటం మానవ హక్కుల, ప్రజాస్వామ్య హక్కుల ప్రియులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆయన ముస్లింలు, వర్ణ వివక్ష, వలస కార్మికులు, మహిళల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా ముస్లింల పట్ల ఆయన ప్రదర్శిస్తున్న తీవ్ర వ్యతిరేకత ఆయన పార్టీ నాయకులనే కలవరపరుస్తోంది. అయితే, ట్రంప్ లాంటి జాత్యహంకారులు అమెరికా చరిత్రను అర్థం చేసుకున్నట్టుగా కనిపించడం లేదు. నిజానికి ఈ రోజు అమెరికాలో ఉన్న 99 శాతం మంది అమెరికా సరిహద్దుల ఆవలకు వెళ్ళాల్సిన వాళ్ళే. అమెరికా తన సొంత దేశంగా విర్రవీగుతున్న డొనాల్డ్ ట్రంప్ పూర్వీకులు అక్కడికి బతుకుదెరువుకోసం వచ్చిన వాళ్ళే. అంతేకాదు వేల ఏళ్ళుగా ఇదే గడ్డమీద పుట్టి పెరిగిన భూమిపుత్రులైన రెడ్‌ఇండియన్స్‌ను  నామరూపాలు లేకుండా చేసినవారు. అమెరికాలో జరిగిన స్థానిక ఆదిమ తెగల నరమేధం మానవ నాగరికతే మచ్చగా నిలుస్తుంది.
 
 లింకన్, కింగ్‌ల స్ఫూరిని నిలపాలి  
 కానీ డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు ఆ చరిత్రను మరిచిపోయి శ్వేత జాత్యహంకారంతో, నియంతృత్వ పోకడలతో ఇతరులను ఎవ్వరినీ మను షులుగా గుర్తించలేని దుర్మార్గ స్వభావాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ అధ్యక్ష ఎన్ని కల్లో ట్రంప్ గెలిస్తే మానవహక్కులను, ప్రజాస్వామ్య హక్కులను పాతాళానికి తొక్కేస్తాడని, మైనారిటీ తెగల ప్రజలు, వారి జీవితాలు, వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచివున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే మళ్లీ అబ్రహం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్‌లు ఆ దేశానికి స్ఫూర్తి కావాలి.
 ఏప్రిల్ 4, మార్టిన్ లూథర్ కింగ్ వర్ధంతి
 వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు  మొబైల్: 97055 66213
 - మల్లెపల్లి లక్ష్మయ్య

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement