తెలంగాణ వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ | social activist Bhagya Reddy varma 128th birth anniversary | Sakshi
Sakshi News home page

తెలంగాణ వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ

Published Sun, May 22 2016 2:12 AM | Last Updated on Mon, Sep 4 2017 12:37 AM

తెలంగాణ వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ

తెలంగాణ వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ

సందర్భం


శతాబ్దాల పర్యంతం చావు డప్పుల వెనుక, శవాల మోతల ముందు నడుస్తూ వచ్చిన దళితుల గమనాన్ని, గమ్యాన్ని మార్చిన ఘనత అతనిది. 1913లోనే మన్య సంఘాన్ని స్థాపించి ‘అంటరాని’ కులాల ఆడబిడ్డలను దేవత పేరుతో గ్రామ పెద్దలకు బలి ఇచ్చే దురాచారాన్ని ధిక్కరించిన ధీరత్వం ఆయ నది. ఇప్పటికి సరిగ్గా 90 ఏళ్ల క్రితం 1925లో ప్లేగు, కలరా వంటి భయంకర అంటువ్యాధులతో భాగ్యనగర ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే స్వస్తి సేవాదళ్ సంస్థను ఏర్పాటు చేసి ప్రాణాలకు తెగించి అంటువ్యాధిగ్రస్తుల ప్రాణాలను కాపాడేందుకు వైద్యసే వలందించిన సాహస ప్రవృత్తి ఆయనది. అంటువ్యాధులతో ఊరూ పేరూ లేకుండా పోయిన అనాథ శవాలను గుర్తించి దహన సంస్కారాలు చేసిన మూర్తిమత్వం ఆయనది.

ఆయనే భాగ్యరెడ్డి వర్మ. ఒకప్పుడు ఈ పేరు దళిత చైతన్యానికి ప్రతీక. దళిత సామాజిక వర్గం అభ్యున్నతికి అలుపెరుగని పోరాటం చేసిన కార్యశీలి. ఒక దళితుడి పేరులో మూడు సామాజిక వర్గాల పేర్లుండటం ఆశ్చర్యమే. ఆయన అసలు పేరు బాగయ్య. కుటుంబ గురువు అతడి పేరును భాగ్యరెడ్డిగా మార్చారు. హైదరాబాద్ నగర ప్రజల ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డుపెట్టి సేవచేసినందుకు అప్పటి జైన సేవా సంఘం ఆయనకు వర్మ అనే బిరుదు ఇచ్చింది. అంతకు మించి.. దళిత జాతి చైతన్యానికి, దళిత వికాసానికి అలుపెరుగని పోరాటం చేసిన వ్యక్తి ఆయన. హైదరాబాద్‌కు చెందిన మాదరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు రెండవ సంతానంగా 1888 మే 22న జన్మించారు.

అంటరాని కులాలు అని ముద్రపడిన వారే ఈ దేశ మూలవాసులని చాటి చెప్పి, పంచములు అనే పేరును వ్యతిరేకించి వారిని ఆది హిందువులుగా నిలిపిన వ్యక్తి భాగ్యరెడ్డివర్మ. దళితులకు విద్య ప్రాధాన్య తను వివరించి వారికి ప్రత్యేక పాఠశాల లను ఏర్పాటు చేశారు. దేవదాసి, బసివి, జోగిని వ్యవస్థ లాంటి దురాచారాలను ఎండగట్టారు. ఆయన కృషి ఫలితంగా ఇలాంటి దురాచారాలను ఆనాడే నిజాం ప్రభుత్వం నిషేధించింది. దక్షిణ భారత దేశమంతా పర్యటించి దళితులను కూడగట్టడంలో ఆయన పట్టుదల అనిర్వచనీయం. దేవాలయ ప్రవేశం వృథా ప్రయాసగా భావించి, సమానత్వాన్ని కాంక్షించిన బుద్ధుని జయంతిని ప్రతియేటా జరపడం ద్వారా బౌద్ధం ప్రాధాన్యతను ఆనాడే గుర్తించారాయన.

దళిత వర్గాల వికాసానికి 1906లో జగన్ మిత్ర మండలిని స్థాపించి, 1913 నాటికి దానిని మన్యం సంఘంగా 1922 నాటికి ఆది సోషల్ సర్వీస్ లీగ్‌గా భాగ్యరెడ్డి వర్మ మార్పు చేశారు. బాలికలకు పత్యేక పాఠశాలల ప్రాధాన్యతను గుర్తించి, నెలకొల్పారు. 1910లోనే మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారాయన. 1933 నాటికి ఆ సంఖ్య 26 పాఠశాల లకు పెరిగింది. నేటికీ చాదర్ ఘాట్ రోడ్డులోని ఆది హిందూ భవన్‌లో ఆయన నెలకొల్పిన బాలికల పాఠశాలను ఆయన వారసులు కొనసాగిస్తున్నారు. సికింద్రాబాద్ ఆదయ్య నగర్‌లో ఆదయ్య పేరుతో నేటికీ కొనసాగుతోన్న పాఠశాల భాగ్యరెడ్డి వర్మ స్థాపించినదే. నిజాం కాలంలో ఉర్దూ పాఠశాలలే తప్ప తెలుగు బోధన లేని సమయంలో నిజాంని ఒప్పించి ఈయన స్థాపించిన 26 పాఠశాలల్లో తెలుగు బోధనను ప్రవేశపెట్టించారు.

1917లో బెజవాడలో ఆంధ్రదేశ మొదటి పంచమ సదస్సు భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షతన జరిగింది. అదే సభలో పంచమ అనే శబ్దాన్ని భాగ్యరెడ్డి వర్మ ఖండించారు. వర్ణవ్యవస్థలో గానీ, వేదాల్లో, పురాణాల్లో గానీ పంచమ అనే పదం ఎక్కడా ప్రస్తావించలేదని సోదాహరణంగా వివరించారు. ఆ మరునాడే పంచమ సదస్సు పేరును ఆది ఆంధ్ర సదస్సుగా మార్చారు. పాఠశాలల్లో అందరితో సమానమైన ప్రవేశ అవకాశాలు దళితులకు ఉండాలని, బావుల్లో నీళ్లు తోడుకునే హక్కు ఆది ఆంధ్రులకివ్వాలని, వారికి బంజరు భూములు పంచాలని, మున్సిపాలిటీల్లో, శాసనమండలుల్లో జిల్లా, తాలూకా బోర్డులలో తమను సభ్యులుగా నియమించాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సమాన వాటా కల్పించాలని 18 డిమాండ్లను సదస్సు ఆమోదించింది.

దక్షిణ భారత దేశంలో నివసించే ప్రాచీన జాతుల్ని పంచమ, పరయలుగా అగౌరవంగా పిలిచే పద్ధతికి స్వస్తి పలకాలని భాగ్యరెడ్డి వర్మ చేసిన కృషి వల్ల 1922  మార్చి 25న నాటి మద్రాసు ప్రభుత్వం దీనికి సంబంధించి జీవో నం.817ను జారీ చేసింది. 1931లో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన జనాభా లెక్కల్లో వీరిని ఆది హిందువులుగా నమోదు చేశారు. జాతీయ స్థాయిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాగించిన ఉద్యమానికి ఆయన సంఘీభావం తెలిపారు. తెలంగాణ గడ్డపై పుట్టిన తొలి దళిత చైతన్య కరదీపిక భాగ్యరెడ్డి వర్మ జీవితం ఆద్యంతం ఉద్యమ ప్రస్థానమే. ఆ మహానేత కాంక్షించిన సమ సమాజ నిర్మాణానికి కంకణబద్ధులమవుదాం.

- పి. శంకర్
(నేడు భాగ్యరెడ్డి వర్మ 128వ జయంతి)
వ్యాసకర్త సామాజిక కార్యకర్త  మొబైల్ : 9441131181

Advertisement
Advertisement