రియో.. వెలుగుల్లో చీకట్లు | Rio Olympics kicks off with glittery opening ceremony | Sakshi
Sakshi News home page

రియో.. వెలుగుల్లో చీకట్లు

Published Sun, Aug 7 2016 2:53 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

రియో.. వెలుగుల్లో చీకట్లు - Sakshi

రియో.. వెలుగుల్లో చీకట్లు

ఆటపాటలతో ఎల్లప్పుడూ కళకళలాడుతుంటుంది. హింసా నేరాలు అధికమే అయినా సాంబా కార్నివాల్‌తో ప్రపంచాన్ని మంత్రముగ్ధం చేస్తుంది. అక్కడి జనం తమకు ఆర్థిక ఇబ్బందులున్నా ఆత్మీయ ఆతిథ్యంతో మనసులు కొల్లగొడతారు. ప్రపంచ క్రీడా సంరంభం నిర్వహణ అవకాశం దక్కించుకుని ఆనందంతో కేరింతలు కొట్టారు. కానీ.. రియో ఒలింపిక్ జ్యోతి వెలుగుల చుట్టూ చీకట్లు ముసురుకున్నాయి. ప్రపంచ జనం బ్రెజిల్ వైపు భయంభయంగా చూస్తున్నారు. అక్కడ ఏ దోమ కుడుతుందో.. ఎక్కడ జికా వైరస్ బారిన పడతామో అన్న ఆందోళన. ఆ దేశంలో ఏ దారిలో ఎలా దోపిడీకి గురవుతామోనన్న భయం.

దేశాధ్యక్షురాలిని అవిశ్వాసం పెట్టి పదవీచ్యుతురాలిని చేయటం.. మరొక మాజీ అధ్యక్షుడిపై అవినీతి ఆరోపణలతో విచారణ! ఈ రాజకీయ సంక్షోభంతో రగులుతున్న దేశాన్ని.. అంతకన్నా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కుదేలు చేస్తోంది! ప్రజలకు ఉపాధి, ఉద్యోగాలు క్షీణిస్తున్నాయి.. నిత్యావసరాల ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న రియో నగరమే ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించిన దుస్థితి!! ఈ పరిస్థితుల్లో అసలు మా దేశంలో ఈ ఆటలేం వద్దని బ్రెజిల్ వాసులే మండిపడుతున్నారు.

ఆటల కోసం తమ దేశానికి రావద్దని ప్రజలే పోపొమ్మంటున్నారు. వచ్చిన క్రీడాకారులపై రాళ్లూ విసురుతున్న ఘటనలూ కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఈ క్రీడల నిర్వహణకు పెడుతున్న వ్యయంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని.. కోలుకోవటం చాలా కష్టమని అక్కడి ప్రజల భయాందోళన!! అయినా.. కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులతో ఒలింపిక్స్ మొదలయ్యాయి. ఆ రియో ఒలింపిక్స్ వెలుగుల చుట్టూ కమ్ముకున్న చీకట్లపై
 
సాక్షి’ ఫోకస్...     - సెంట్రల్ డెస్క్

 
ఆర్థిక, రాజకీయ సంక్షోభాల నడుమ బ్రెజిల్ ఒలింపిక్స్
ఒలింపిక్స్‌కు వ్యతిరేకంగా దేశ ప్రజల ఆందోళనలు   
ఆర్థిక పరిస్థితి బాగున్నపుడు ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్
ఐదేళ్లుగా ఆర్థిక దుస్థితి.. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం  
ఆపై గుదిబండగా మారిన ఒలింపిక్స్ ఏర్పాట్ల వ్యయం
మరోవైపు రాజకీయ అనిశ్చితి.. దేశాధ్యక్షురాలిపై అభిశంసన  
మరో మాజీ దేశాధ్యక్షుడిపై అవినీతి ఆరోపణలతో విచారణ
ఒలింపిక్స్ వల్ల కీడే ఎక్కువని 63 శాతం ప్రజల వ్యతిరేకత
అయినా.. ఘనంగా ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తున్న బ్రెజిల్

 
అభివృద్ధి వెలిగిపోయిన దశ...
ఆర్థికంగా చూస్తే.. పోర్చుగీసు వలస పాలనలో చెరకును వాణిజ్య పంటగా భారీ ఎత్తున సాగుచేశారు. పంచదారను యూరప్‌కు ఎగుమతి చేసేవారు. అనంతరం 18వ శతాబ్దం చివరికి కాఫీ సాగు, ఎగుమతులతో మళ్లీ నిలదొక్కుకుంది. అనేక ఎత్తుపల్లాల్లో పయనిస్తూ.. సంస్కరణలు, ప్రణాళికలతో 20వ శతాబ్దం ఆరంభంలో గణనీయమైన ఆర్థికవృద్ధిని సాధించింది. రియో తీరంలో చమురు వెలికి తీయటం దీనికి తోడ్పాటునిచ్చింది. నిజానికి 2001లో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నాలుగు దేశాలుగా.. ఇండియా, రష్యా, చైనాలతో పాటు బ్రెజిల్ కూడా గుర్తింపు పొందాయి.

ఈ నాలుగు దేశాలూ బ్రిక్ కూటమిగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత వీటికి దక్షిణాఫ్రికా కూడా జతకలవటంతో కూటమి పేరు బ్రిక్స్‌గా మారింది. అమెరికా వంటి అగ్రరాజ్యాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకుని కుంటి నడక నడుస్తుండగా.. బ్రెజిల్ స్థిరమైన ఆర్థికవృద్ధి రేటును కొనసాగించింది. ఆ క్రమంలోనే.. ప్రపంచ ఫుట్ బాల్ క్రీడలకు, ప్రపంచ ఒలింపిక్స్‌కు తాము ఆతిథ్యమిస్తామని ముందుకొచ్చింది.వరుసగా రెండు భారీ కార్యక్రమాలు.. 2014లో ఫుట్‌బాల్ క్రీడల నిర్వహణకు, 2016లో ఒలింపిక్స్ నిర్వహణకు పలు ఇతర దేశాలతో పోటీ పడి అవకాశం దక్కించుకుంది.

దక్షిణ అమెరికా ఖండంలో ఒలింపిక్స్ నిర్వహణకు అవకాశం లభించిన తొలి దేశంగా నిలిచింది. 2009లో ఆ అవకాశం లభించిన రోజు.. బ్రెజిల్ ప్రజలు ప్రత్యేకించి రియో డీ జెనీరియో నగర వాసులు ఆనందోత్సాహాల్లో తేలిపోయారు. ఆ క్రీడల నిర్వహణ.. దేశానికి కీర్తిప్రతిష్టలు తేవటమే కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి కూడా దోహదపడతాయని.. పర్యాటకం పెరుగుతుందని, ఉద్యోగాలు పెరుగుతాయని అంతా భావించారు.
 
ఆర్థిక సంక్షోభం.. ఆపై పెను భారం..!  
అయితే.. గత దశాబ్దంలో ప్రపంచాన్ని ఆవరించిన ఆర్థిక మాంద్యం ప్రభావం బ్రెజిల్‌పై కూడా పడింది. 2011 ఆరంభంలో బ్రెజిల్ ఆర్థికవృద్ధి మందగించటం మొదలైంది. ప్రధాన ఎగుమతులైన సోయా, చమురు, పంచదారల ధరలు పడిపోయాయి. అదే సమయంలో బ్రెజిల్ ప్రభుత్వ చమురు సంస్థ పెట్రోబ్రాస్‌పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దేశ జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి)లో ఒక్క పెట్రోబ్రాస్ వాటానే 5 శాతం ఉంటుంది. ఆ సంస్థ భారీ స్థాయిలో అప్పుల ఊబిలో కూరుకుపోయింది. లక్షల కోట్ల డాలర్లు బకాయిపడింది. దీంతో అమెరికాలో ఈ సంస్థ షేర్ హోల్డర్లు సంస్థపై కేసు వేశారు.

ఈ పరిణామాలతో ఆర్థిక స్థితి మరింత క్లిష్టం కావటంతో పాటు రాజకీయ సంక్షోభమూ రాజుకుంది. రెండూ కలగలసి పరిస్థితి మరింత దిగజారింది. వేతనాలు పడిపోయాయి. నిరుద్యోగం పెరిగింది. ఆర్థికవృద్ధి ఉజ్వలంగా ఉన్నపుడు తీసుకున్న గృహ రుణాలను చెల్లించలేక బ్రెజిల్ మధ్యతరగతి సతమతవుతోంది. ఈ పరిస్థితుల్లో 2016 ఒలింపిక్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేయటం కోసం భారీ ఎత్తున నిధులు వెచ్చించటం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లయింది. ఇతర ముఖ్యమైన అవసరాలకు నిధులను కత్తిరించి మరీ క్రీడా మైదానాలు, రహదారుల వంటి మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం కేటాయించాల్సి వచ్చింది.

అది కూడా అంతంత మాత్రం నిధులే సమకూరాయి. ఉదాహరణకు.. కొన్ని క్రీడా పోటీలను నిర్వహించే గ్వానాబారా బేను శుభ్రం చేయటానికి 400 కోట్ల డాలర్లు వెచ్చించాలని తొలుత రియో డి జెనీరియో నగరం నిర్ణయించింది. కానీ.. చివరికి కేవలం 1.7 కోట్ల డాలర్లు మాత్రమే ఖర్చుపెట్టగలిగింది. ఈ నేపథ్యంలో.. ఒలింపిక్స్ ఏర్పాట్లు సకాలంలో పూర్తికావటం లేదని, నాణ్యత లోపించిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే.. ఈ ఏడాది జూన్‌లో రియోలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి 9 కోట్ల డాలర్ల సాయం అడిగారు. మొత్తం మీద బ్రెజిల్.. గత 80 ఏళ్లలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఇప్పుడు ఎదుర్కొంటోంది. ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో వినియోగదారుల్లో విశ్వాసం సడలిపోయి పరిస్థితి మరింతగా క్షీణించింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో 2014 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీల నిర్వహణ సమయంలోనే నిరసనలు వెల్లువెత్తాయి. నిజానికి స్థానిక ప్రయాణ చార్జీల పెంపుపై మొదలైన ఆందోళనలు.. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలతో ముదిరిపోయాయి. అదే సమయంలో ఫుట్‌బాల్ క్రీడా ఏర్పాట్లకు నిధులు వ్యయం చేయటంపైనా నిరసనలు పెల్లుబికాయి.

ఇప్పుడు ఒలింపిక్స్ ఏర్పాట్ల కోసం ప్రజావసరాలకు నిధులు కోతపెట్టి అటు మళ్లించటంతో జనంలో ఆగ్రహం పెల్లుబికింది. పైగా.. ఈ ప్రపంచ క్రీడల నిర్వహణ కోసం తొలుత వేసిన అంచనా కన్నా దాదాపు రెట్టింపు ఎక్కువగా మొత్తం 1,200 కోట్ల డాలర్ల వ్యయం అవుతుందని లెక్కగట్టారు. ఇన్ని నిధులను వెచ్చించినా ఒలింపిక్స్ వల్ల తమకు ఒరిగేది ఏమీ ఉండకపోగా.. ఈ ఊబి నుంచి బయటపడటానికి ఎంత కాలం పడుతుందో.. పరిస్థితి ఇంకెంత దిగజారుతుందో అన్న ఆందోళన ప్రజలను పీడిస్తోంది.

గతంలో లండన్‌లో ఒలింపిక్ క్రీడలకు 1,500 కోట్ల డాలర్లు వ్యయం చేసినా.. ఆశించిన అభివృద్ధి దక్కలేదని, ఆ క్రీడా మైదానాలన్నీ ఇప్పుడు నిరుపయోగంగా పడి ఉన్నాయని ఉదహరిస్తున్నారు. అలాగే.. గ్రీస్ కూడా ఒలింపిక్స్ నిర్వహించిన తర్వాత ఆ వ్యయ భారంతో ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిందన్న విషయాన్నీ గుర్తుచేస్తున్నారు. ఇలాంటపుడు ఒలింపిక్స్ నిర్వహించవద్దని.. ఆ నిధులను దేశంలో పాఠశాలలు, ఆస్పత్రుల కోసం వెచ్చించవచ్చని సామాన్య పౌరుల మనోగతం. ఇలా దేశ వ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒలింపిక్స్ నిర్వహణపై ఇటీవల ఒక అభిప్రాయ సర్వే నిర్వహించగా.. దానివల్ల జరిగే మేలు కంటే హానే ఎక్కువగా ఉంటుందని 63 శాతం మంది బ్రెజిల్ పౌరులు ఆందోళన వ్యక్తంచేశారు.
 
బ్రెజిల్ చరిత్ర క్లుప్తంగా...
బ్రెజిల్... దక్షిణ అమెరికా ఖండంలోని ఈ దేశం విస్తీర్ణపరంగా ప్రపంచంలో ఐదో అతి పెద్ద దేశం. భారతదేశం కన్నా దాదాపు మూడు రెట్లు పెద్దది. అయినా జనాభా 20 కోట్ల పై చిలుకు మాత్రమే. దేశంలో అధికార భాష పోర్చుగీసు. జనాభాలో 99 శాతం మంది ఆ భాష మాట్లాడతారు. పదిహేనో శతాబ్దంలో యూరప్ వలసలు మొదలవటానికి ముందు.. ఇప్పటి బ్రెజిల్‌లో దాదాపు 2,000 వరకూ స్థానిక ఆదివాసీ జాతులు నివసించేవి. వారంతా పాక్షిక సంచార జాతులుగా ఉంటూ వేట, చేపలు పట్టడం, ఆహార సేకరణ, సంచార వ్యవసాయం ఆధారంగా జీవించేవారు.

యూరప్ నుంచి.. ప్రత్యేకించి పోర్చుగీస్ నుంచి వలసల వెల్లువ రాకముందు ఈ ఆదివాసీ జనాభా సుమారు 24 లక్షల మందిగా ఉన్నట్లు అంచనా. కానీ ఇప్పుడా సంఖ్య కేవలం ఎనిమిది లక్షల చిల్లరకు కుదించుకుపోయింది. జాతుల సంఖ్య కూడా సుమారు 200కు తగ్గిపోయింది. యూరప్ నుంచి వచ్చిన వ్యాధులు బారిన పడి లక్షలాది మంది చనిపోగా.. చాలా మంది ‘బ్రెజిల్ జనాభా’లో కలిసిపోయారు.

తొలుత పోర్చుగీస్ వలసదారులు, ఆఫ్రికా నుంచి బానిసలుగా తెచ్చిన నల్లవారు అధికంగా ఉండగా.. అనంతర కాలంలో యూరప్, అరబ్, జపాన్ దేశాల నుంచీ వలసలు వచ్చి స్థిరపడ్డారు. వీరందరి సమ్మేళనంతో బ్రెజిల్ విలక్షణ సాంస్కృతికతను, జాతీయతను సంతరించుకుంది. 1533 నుంచి పోర్చుగీసు సామ్రాజ్య వలస పాలనలో ఉన్న బ్రెజిల్ అనేక రాజకీయాల పరిణామాల అనంతరం 1889లో గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అనేక పరిణామాల అనంతరం గణతంత్రం నిలదొక్కుకుంది.
 
దేశంలో రాజకీయ అనిశ్చితి...
ఒకవైపు ఆర్థిక సంక్షోభం ముదురుతోంటే.. మరొక వైపు దానికి పెనవేసుకుని రాజకీయ సంక్షోభం కూడా తీవ్రమైపోయింది. దేశ తొలి మహిళా అధ్యక్షురాలైన దిల్మా రౌసెఫ్‌పై అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షం తీసుకొచ్చిన అభిశంసన తీర్మానాన్ని ఈ ఏడాది మే నెలలో దేశ సెనేట్ ఆమోదించింది. దీంతో ఆమెను అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేశారు. అభిశంసన విచారణ తుది ప్రక్రియ ఇంకా జరగాల్సి ఉంది. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితి బాగున్నట్లు చూపేందుకు అధికారిక బడ్జెట్ లెక్కలను తారుమారు చేశారని.. ప్రభుత్వ రంగ బ్యాంకుల నిధులను వినియోగించారని ఆమెపై ఉన్న ఆరోపణలు.

దిల్మా గతంలో పెట్రోబ్రాస్ సంస్థకు అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఎంతో ప్రజాదరణ గల లులా డసిల్వా తర్వాత 2011లో బ్రెజిల్ అధ్యక్ష పదవిని చేపట్టిన దిల్మా అప్పుడు ఎన్నికల కోసం పెట్రోబ్రాస్ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలూ ఎదుర్కొన్నారు. మరోవైపు మాజీ అధ్యక్షుడైన లులాపైన కూడా పెట్రోబ్రాస్ నిధులను దుర్వినియోగం చేశారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో విచారణ ప్రారంభించారు. ఇంకా ప్రభుత్వంలోని మంత్రుల పైనా, పార్లమెంటు సభ్యులపైనా భారీ ఆరోపణలు, విచారణలు కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం ఉపాధ్యక్షుడు మైఖేల్ టైమర్ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నప్పటికీ.. రాజకీయ అస్థిరత తీవ్రమవుతూ ఆర్థిక సంక్షోభాన్ని మరింత ముదిరేలా చేస్తోంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా.. బ్రెజిల్ ఒలింపిక్స్‌ను నిర్వహిస్తోంది. ఒకవైపు నిరసనలు వెల్లువెత్తుతున్నా.. దేశంలోని క్రీడాభిమానులు కూడా ఆటల పోటీలను వీక్షించేందుకు పోటెత్తుతున్నారు.
 
వణికిస్తున్న జికా వైరస్...
ప్రపంచాన్ని వణికిస్తోన్న జికా వైరస్.. బ్రెజిల్‌లో, అందులోనూ రియో డీ జెనీరియోలో విస్తరించినంతగా ప్రపంచంలో మరెక్కడా విస్తరించలేదు. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్ కారణంగా పుట్టబోయే పిల్లల్లో అనేక అవయవ లోపాలు తలెత్తుతున్న పరిస్థితి ప్రపంచాన్ని కలవరపెడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే బ్రెజిల్‌లో 1.65 లక్షల జికా కేసులు నమోదయ్యాయి. అందులో నాలుగో వంతు కేసుల్లో రియో రాష్ట్రంలోనివే. ఈ అంశం ఒలింపిక్స్‌ను స్వయంగా వీక్షించాలనుకునే క్రీడాభిమానులనే కాదు.. ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులనూ భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ భయంతోనే కొంతమంది క్రీడాకారులు కూడా ఈసారి ఒలింపిక్స్‌కు దూరంగా ఉన్నారు.
 
బ్రెజిల్.. హత్యల రాజధాని!?
మామూలుగానే బ్రెజిల్‌లో హత్యలు, దోపిడీలు, హింస సంబంధిత నేరాలు ఎక్కువ. అసలు హత్యలు అధికంగా జరిగే దేశాల్లో ప్రపంచ రాజధానిగా బ్రెజిల్‌నే చెప్పవచ్చంటూ.. సెంటర్ ఫర్ పబ్లిక్ సేఫ్టీ అండ్ క్రిమినల్ జస్టిస్ అనే సంస్థ తాజా నివేదికలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే బ్రెజిల్ నగరాల్లో అత్యధిక హత్యలు జరుగుతాయని చెప్పింది. అయితే.. దేశంలోని నగరాలన్నిటిలో రియో భద్రమైన నగరమని కాస్త ఊరటనిచ్చింది. పైగా.. ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో ఇటీవల నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయి.

విదేశీ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు జరుగుతున్న ఘటనలూ వెలుగుచూస్తున్నాయి. రియో రాష్ట్రంలో పోలీసుశాఖ నిధుల్లో మూడో వంతు కోత పెట్టిన ఫలితంగా.. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో నేరాల సంఖ్య 15 శాతం పెరిగిపోయింది. పోలీసులు సమ్మెకు దిగారు. పోలీసు సిబ్బందే.. ‘నరకానికి స్వాగతం.. రియో డీ జెనీరోకు ఎవరు వచ్చినా క్షేమంగా ఉండరు’ అని రాసిన బ్యానర్లను పట్టుకుని అంతర్జాతీయ విమానాశ్రయం ఎదుట నిలబడ్డ దుస్థితి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement