కరుణకు బ్రహ్మరథం
92వ వసంతంలోకి కలైంజర్
వాడవాడలా బర్త్‌డే వేడుకలు
అరివాళయంకు తరలిన కార్యకర్తలు
కానుకలు, ఎన్నికల నిధి సేకరణ
డీఎంకే అధినేత ఎం కరుణానిధి బుధవారం 92వ వసంతంలోకి అడుగు పెట్టారు. తమ అధినేత జన్మదినోత్సవాన్ని డీఎంకే శ్రేణులు వాడవాడలా కోలాహలంగా జరుపుకున్నారు. కరుణానిధికి స్వయంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి పెద్ద ఎత్తున అన్నా అరివాలయానికి తరలివచ్చారు.
- సాక్షి, చెన్నై
తమ అధినేత కరుణానిధి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే వర్గాలు భారీ ఏర్పాట్లు చేశాయి. పండుగ తరహాలో వేడుకల్ని జరుపుకున్నాయి. వాడవాడల్లో పార్టీ పతాకాల్ని ఉదయాన్నే ఎగుర వేశారు. కరుణానిధిని ప్రసంగాలను లౌడ్ స్పీకర్ల ద్వారా మార్మోగించారు. స్వీట్లు పంచి పెట్టారు. అన్నదానం, రక్తదానం వంటి కార్యక్రమాల్ని చేపట్టారు. పేదలకు సంక్షేమ పథకాల్ని పంపిణీ చేశారు.
జన్మదినం : తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఉదయాన్నే 4.45 నిమిషాలకు సీఐటీ కాలనీలోని ఇంట్లో సతీమణి రాజాత్తి అమ్మాల్, కుమార్తె కనిమొళితో కలసి ఓ మొక్కను కరుణానిధి నాటారు. అక్కడి నుంచి గోపాలపురం చేరుకున్న కరుణానిధికి పార్టీ వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. మేళతాళాల మధ్య ఆయనకు ఆహ్వానం పలికారు.
తన తల్లిదండ్రుల చిత్ర పటాల వద్ద కరుణానిధి నివాళులర్పించారు. మరో సతీమని దయాళు అమ్మాల్, పెద్ద చిన్న కుమారుడు, పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్, ఆయన భార్య దుర్గా స్టాలిన్, కుటుంబీకులు ముత్తా తమిళరసన్, మురసోలి సెల్వం, సెల్వి, దయానిధి మారన్‌తో కలసి కరుణానిధి కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు కుమరి ఆనందన్, తిరునావుక్కరసు, తమిళ మానిల కాంగ్రెస్ నాయకుడు పీటర్ అల్ఫోన్స్, పెరుంతలైవర్ మక్కల్ కట్టి నేత ఎన్‌ఆర్ ధనపాలన్, ద్రవిడ కళగం నేత కీ వీరమణి, డీఎంకే వర్గాలు దురై మురుగన్, ఆర్కాడు వీరాస్వామి కరుణకు శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడి నుంచి మెరీనా తీరంలోని అన్నా సమాధి, వెప్పేరిలోని పెరియార్ స్మా రక మందిరాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు.
తరలి వచ్చిన సేన :
సరిగ్గా పద కొండు గంటల సమయంలో రాష్ట్ర పార్టీ కార్యాలయం అన్నా అరివాళయంకు కరుణానిధి వచ్చారు. అక్కడి కలైంజర్ అరంగంలో ఏర్పాటు చేసిన ఎన్నికల నిధి హుండీల్లో నగదు వేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తల నుంచి శుభాకాంక్షల్ని అందుకున్నారు. అన్నా అరివాళయం పరిసరాలు కార్యకర్తలు, నాయకుల కోలాహలంతో నిండింది. కళా ప్రదర్శనలు, డప్పు వాయిద్యాలతో ఆ పరిసరాలు మార్మోగాయి. రాష్ర్టంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు తరలి వచ్చి కరుణానిధికి కానుకల్ని సమర్పించుకున్నారు. కొందరు అయితే, బంగారం, వెండి వంటి వస్తువుల్ని కానుకగా సమర్పించగా, మరి కొందరు రూ. ఐదు వందలు, రూ. వెయ్యి నోట్లతో సిద్ధం చేసిన మాలలు, కిరీటాలు, శాలువల్ని కప్పి మరీ తమ అభిమానాన్ని చాటుకోవడం విశేషం. గంటన్నర పాటుగా పార్టీ కార్యకర్తల ఆశీస్సుల్ని అందుకున్న కరుణానిధి అక్కడి నుంచి నేరుగా గోపాలపురం ఇంటికి వెళ్లారు. కరుణకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో డీఎంకే నాయకులు ఎ రాజ, జగత్ రక్షకన్, ఆర్కాడు వీరా స్వామి, ఏవి వేలు, టి అన్భరసు, ఐ పెరియ స్వామి, కేఎన్ నెహ్రూ, ఉన్నారు.
శుభాకాంక్షలు :
కరుణానిధికి రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య శుభాకాంక్షల లేఖ పంపించారు. దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీ కాంత్, తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్, పీఎంకే అధినేత రాందాసు, కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్, బీజేపీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ ఫోన్ ద్వారా, పుష్పగుచ్ఛాలను పంపించి శుభాకాంక్షలు తెలిపారు.