DMK chief Karunanidhi
-
ఎన్డీయే ప్రభుత్వానికి రాహుల్ గాంధీ హెచ్చరిక..
సాక్షి, చెన్నై: ఎన్డీయే ప్రభుత్వం స్వతంత్ర వ్యవస్థలపై దాడి చేస్తోందని, ఆ ధోరణిని దేశం అనుమతించదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఒకరి సిద్ధాంతాలే(ఆరెస్సెస్‌ను ఉద్దేశించి) దేశాన్ని పాలించాలని బీజేపీ కోరుకుంటోందని ఆరోపించారు. ఆదివారం చెన్నైలో దివంగత డీఎంకే నాయకుడు కరుణానిధి నిలువెత్తు విగ్రహావిష్కరణ వేడుక జరిగింది. తేనాంపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం ఆవరణలో ప్రతిష్టించిన కరుణానిధి కంచు విగ్రహాన్ని యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ..మోదీ సర్కారు రాజ్యాంగబద్ధ సంస్థల స్వయంప్రతిపత్తి, దేశ సంస్కృతిని నాశనం చేస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్ని వర్గాలు, గొంతుకలు కలసి రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దివంగత నాయకుడు కరుణానిధి తమిళ ప్రజల గొంతుకగా నిలిచారని రాహుల్ ప్రశంసలు కురిపించారు. భావి ప్రధానిగా రాహుల్ పేరును ప్రతిపాదిస్తున్నట్లు ఈ సందర్భంగా స్టాలిన్ అనూహ్య ప్రకటన చేశారు. కేరళ,పుదుచ్చేరి, ఏపీ సీఎంలు పి.విజయన్, నారాయణస్వామి, చంద్రబాబు నాయుడు, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం, సినీ నటుడు రజనీకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భావి ప్రధాని రాహులే!: స్టాలిన్ దేశానికి ప్రధాని అయ్యే అన్ని అర్హతలు రాహుల్ గాంధీకి ఉన్నాయని, తమిళనాడు నుంచి ఆ పదవికి ఆయన పేరును దివంగత కరుణానిధి వారసుడిగా ప్రతిపాదిస్తున్నట్టు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రకటించారు. జాతీయ స్థాయిలో తన తండ్రి కరుణానిధి పోషించిన పాత్రను గుర్తు చేశారు. 2004లో ఐల్యాండ్ గ్రౌండ్లో జరిగిన సభలో సోనియా గాంధీని ఉద్దేశించి తొలిసారిగా కరుణానిధి ప్రసంగించారన్నారు. ఇందిరావిన్ మరుమగలే వరుగ.. ఇండియావిన్ తిరుమగలే వెల్గ (ఇందిర కోడలా రావమ్మా.. భారత నారీ జయం నీకే) అని ఆహ్వానించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆయన వారసుడిగా తమిళనాడు నుంచి ప్రధాని పదవికి రాహుల్ పేరును ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. ‘రాహుల్ రావాలి.. దేశంలో సుపరిపాలన రావాలి’ అన్న నినాదంతో ప్రతిజ్ఞ చేశారు. అలాగే, మోదీ పాలనకు చరమ గీతం పాడేలా అందరం రాహుల్‌కు మద్దతుగా నిలుద్దామని పిలుపునిచ్చారు. విగ్రహావిష్కరణ అనంతరం మెరీనా తీరంలో అన్నాదురై, కరుణానిధి సమా«ధుల వద్ద సోనియా, రాహుల్ నివాళులర్పించారు. -
నిలకడగా కరుణ ఆరోగ్యం
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉంది. చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆదివారం రాత్రి కరుణానిధి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులు, అభిమానుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. వైద్యుల చికిత్సతో ఆయన ఆరోగ్యం మెరుగైందని ఆ కాసేపటికి ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించడంతో కొంతవరకు ఆందోళనలు తగ్గాయి. ప్రస్తుతం కరుణ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుమారుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. సోమవారం రాత్రి ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్న రాత్రి ఆసుపత్రి యాజమాన్యం నాన్న ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేసినప్పటి పరిస్థితే ఇప్పటికీ కొనసాగుతోంది. డాక్టర్లు ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స అందిస్తున్నారు’ అని తెలిపారు. కరుణానిధి ఆరోగ్యం ఒక్కసారిగా విషమించిందని, అయితే, వెంటనే తక్షణ చికిత్స అందించడంతో సాధారణ స్థాయికి వచ్చిందని ఆదివారం అర్ధరాత్రి కావేరీ ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేయడం తెలిసిందే. సీఎం పరామర్శ మూడురోజుల పర్యటన నిమిత్తం సేలం జిల్లాకు వెళ్లిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి అర్ధాంతరంగా పర్యటన ముగించుకుని హడావుడిగా చెన్నైకి చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మరికొందరు మంత్రులు వెంటరాగా సోమవారం ఉదయం కావేరి ఆస్పత్రికి వెళ్లి స్టాలిన్‌ను కలుసుకుని కరుణ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఎడపాడి మీడియాతో మాట్లాడుతూ, కరుణకు చికిత్స జరుగుతోందని, కోలుకుంటున్నారని చెప్పారు. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ సోమవారం చెన్నైకి వచ్చి కరుణను చూసి స్టాలిన్‌ను కలుసుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాని తరఫున నలుగురు ప్రతినిధులు కావేరి ఆస్పత్రికి వచ్చారు. ఆగిన అభిమానుల గుండెలు తమ అభిమాన నేత కరుణానిధిని తలచుకుంటూ ఆవేదనకు గురై 8 మంది అభిమానుల గుండెలు ఆగిపోయాయి. ఓ అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో వ్యక్తి బలవన్మరణానికి ప్రయత్నించాడు. కొందరు డీఎంకే కార్యకర్తలు కరుణ కోలుకోవాలంటూ కావేరి ఆస్పత్రి ముందు గుండు కొట్టించుకుని దేవుళ్లకు మొక్కుకున్నారు. అనేకచోట్ల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
కరుణకు బ్రహ్మరథం
92వ వసంతంలోకి కలైంజర్ వాడవాడలా బర్త్‌డే వేడుకలు అరివాళయంకు తరలిన కార్యకర్తలు కానుకలు, ఎన్నికల నిధి సేకరణ డీఎంకే అధినేత ఎం కరుణానిధి బుధవారం 92వ వసంతంలోకి అడుగు పెట్టారు. తమ అధినేత జన్మదినోత్సవాన్ని డీఎంకే శ్రేణులు వాడవాడలా కోలాహలంగా జరుపుకున్నారు. కరుణానిధికి స్వయంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి పెద్ద ఎత్తున అన్నా అరివాలయానికి తరలివచ్చారు. - సాక్షి, చెన్నై తమ అధినేత కరుణానిధి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే వర్గాలు భారీ ఏర్పాట్లు చేశాయి. పండుగ తరహాలో వేడుకల్ని జరుపుకున్నాయి. వాడవాడల్లో పార్టీ పతాకాల్ని ఉదయాన్నే ఎగుర వేశారు. కరుణానిధిని ప్రసంగాలను లౌడ్ స్పీకర్ల ద్వారా మార్మోగించారు. స్వీట్లు పంచి పెట్టారు. అన్నదానం, రక్తదానం వంటి కార్యక్రమాల్ని చేపట్టారు. పేదలకు సంక్షేమ పథకాల్ని పంపిణీ చేశారు. జన్మదినం : తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఉదయాన్నే 4.45 నిమిషాలకు సీఐటీ కాలనీలోని ఇంట్లో సతీమణి రాజాత్తి అమ్మాల్, కుమార్తె కనిమొళితో కలసి ఓ మొక్కను కరుణానిధి నాటారు. అక్కడి నుంచి గోపాలపురం చేరుకున్న కరుణానిధికి పార్టీ వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. మేళతాళాల మధ్య ఆయనకు ఆహ్వానం పలికారు. తన తల్లిదండ్రుల చిత్ర పటాల వద్ద కరుణానిధి నివాళులర్పించారు. మరో సతీమని దయాళు అమ్మాల్, పెద్ద చిన్న కుమారుడు, పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్, ఆయన భార్య దుర్గా స్టాలిన్, కుటుంబీకులు ముత్తా తమిళరసన్, మురసోలి సెల్వం, సెల్వి, దయానిధి మారన్‌తో కలసి కరుణానిధి కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు కుమరి ఆనందన్, తిరునావుక్కరసు, తమిళ మానిల కాంగ్రెస్ నాయకుడు పీటర్ అల్ఫోన్స్, పెరుంతలైవర్ మక్కల్ కట్టి నేత ఎన్ఆర్ ధనపాలన్, ద్రవిడ కళగం నేత కీ వీరమణి, డీఎంకే వర్గాలు దురై మురుగన్, ఆర్కాడు వీరాస్వామి కరుణకు శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడి నుంచి మెరీనా తీరంలోని అన్నా సమాధి, వెప్పేరిలోని పెరియార్ స్మా రక మందిరాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. తరలి వచ్చిన సేన : సరిగ్గా పద కొండు గంటల సమయంలో రాష్ట్ర పార్టీ కార్యాలయం అన్నా అరివాళయంకు కరుణానిధి వచ్చారు. అక్కడి కలైంజర్ అరంగంలో ఏర్పాటు చేసిన ఎన్నికల నిధి హుండీల్లో నగదు వేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తల నుంచి శుభాకాంక్షల్ని అందుకున్నారు. అన్నా అరివాళయం పరిసరాలు కార్యకర్తలు, నాయకుల కోలాహలంతో నిండింది. కళా ప్రదర్శనలు, డప్పు వాయిద్యాలతో ఆ పరిసరాలు మార్మోగాయి. రాష్ర్టంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు తరలి వచ్చి కరుణానిధికి కానుకల్ని సమర్పించుకున్నారు. కొందరు అయితే, బంగారం, వెండి వంటి వస్తువుల్ని కానుకగా సమర్పించగా, మరి కొందరు రూ. ఐదు వందలు, రూ. వెయ్యి నోట్లతో సిద్ధం చేసిన మాలలు, కిరీటాలు, శాలువల్ని కప్పి మరీ తమ అభిమానాన్ని చాటుకోవడం విశేషం. గంటన్నర పాటుగా పార్టీ కార్యకర్తల ఆశీస్సుల్ని అందుకున్న కరుణానిధి అక్కడి నుంచి నేరుగా గోపాలపురం ఇంటికి వెళ్లారు. కరుణకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో డీఎంకే నాయకులు ఎ రాజ, జగత్ రక్షకన్, ఆర్కాడు వీరా స్వామి, ఏవి వేలు, టి అన్భరసు, ఐ పెరియ స్వామి, కేఎన్ నెహ్రూ, ఉన్నారు. శుభాకాంక్షలు : కరుణానిధికి రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య శుభాకాంక్షల లేఖ పంపించారు. దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీ కాంత్, తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్, పీఎంకే అధినేత రాందాసు, కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్, బీజేపీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ ఫోన్ ద్వారా, పుష్పగుచ్ఛాలను పంపించి శుభాకాంక్షలు తెలిపారు.