అంబులెన్సులో అత్యాచారయత్నం..
బెంగళూరు: ఐటీ రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించే సమయంలో ఆమెపై అత్యాచారానికి యత్నించాడు ఓ కామాంధుడు. నగరంలోని బనశంకరి పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస‍్యంగా వెలుగుచూసింది.
బనశంకరి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు జబ్బు చేయగా, ఆస్పత్రికి తరలించేందుకు ఆమె భర్త ప్రైవేటు అంబులెన్స్‌ను పిలిపించాడు. ఆమెను ఆంబులెన్స్‌లోకి ఎక్కించి బాధిత మహిళ భర్త డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. అంబులెన్స్‌లో ఉన్న ఉద్యోగి సిద్ధరాజు బాధిత మహిళపై అత్యాచారానికి యత్నించగా, అంబులెన్సు ఆస్పత్రికి చేరుకోవడంతో అతని పన్నాగం ఫలించలేదు.
రెండు రోజుల అనంతరం అనారోగ్యం నుంచి కోలుకున్న ఆమె ఈ ఘటనను కుటుంబసభ్యులకు వివరించింది. దీంతో వారు బనశంకరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సిద్ధరాజును అదుపులోకి తీసుకున్నారు. నగరంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని నిందితుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.