కలాం శాట్‌ | TN CM announces Rs 10 lakh for Rifath Sharook, team | Sakshi
Sakshi News home page

కలాం శాట్‌

Published Sun, Jun 25 2017 2:41 AM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM

కలాం శాట్‌

కలాం శాట్‌

నాసాలో తమిళ కెరటం
నింగిలోకి 64 గ్రాముల శాటిలైట్‌
రూ. 10 లక్షలు ప్రకటించిన సీఎం
ఆనందంలో షారూక్‌ కుటుంబం


సాక్షి, చెన్నై : తమిళుడిగా భారత దేశ ఖ్యాతిని 18 ఏళ్ల యువకుడు నాసా వేదికగా ఎలుగెత్తి చాటాడు. ప్రపంచ దేశాల నుంచి తరలివచ్చిన యువ శాస్త్ర వేత్తల మధ్య మొదటి స్థానాన్ని అధిరోహించాడు. తమ వాడు  64 గ్రాములతో రూపొందించిన శాటి లైట్‌ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లడంతో కరూర్‌ పల్లం పట్టి ఆనంద తాండవం చేస్తున్నది. తండ్రి బాటలో శాస్త్ర వేత్తగా ఎదగాలని కాంక్షిస్తున్న ఆ యువకుడికి తమిళ ప్రభుత్వం రూ. పది లక్షలు సాయం ప్రకటించింది.కలలు కనండి...దానిని సాకారం చేసుకోండి అని దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఇచ్చిన సందేశం కరూర్‌ జిల్లా పల్లపట్టికి చెందిన రిఫాత్‌ షారూక్‌ను కదిలించింది.

  శాస్త్ర వేత్తగా పనిచేసి అందని దూరాలకు వెళ్లిన తన తండ్రి మహ్మద్‌ బాటలో నడిచి, కలాం ఆదర్శంగా షారూక్‌ అతి చిన్న శాటిలైట్‌ను రూపొందించారు. ఇందుకు స్పేస్‌ కిడ్జ్‌ సహకారంగా నిలిచింది. పర్యావరణ, వాతావరణ మార్పులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించే రీతిలో అతి తక్కువ బరువుతో షారూక్‌ ఈ శాటిలైట్‌ రూపొందించి ప్రపంచ స్థాయిలో తమిళుడిగా, భారత దేశ ఖ్యాతిని చాటారు. నాసా క్యూబ్స్‌ ఇన్‌ స్పెస్‌ పోటీల్లో  షారూక్‌ ప్రతిభను చాటుతూ ఆ శాటి లైట్‌ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లడం విశేషం.

కలాం శాటిలైట్‌ : కలాం సందేశానుగుణంగా తానూ ఓ శాస్త్ర వేత్త కావాలన్న తొలి ప్రయత్నంలో షారూక్‌ విజయ కేతనం ఎగుర వేశాడు. అర చేతిలో ఇమిడే రీతిలో 64 గ్రాములతో రూపొందించిన ఈ శాటిలైట్‌కు ‘కలాం శాట్‌’ అని నామకరణం చేయడం విశేషం. షారూక్‌కు సహకారంగా స్పేస్‌ కిడ్జ్‌ సంస్థతో పాటు మరో ఆరుగురు నిలిచారు. కలాం శాట్‌ రూపకల్పన ఐడీయా షారూక్‌ ఇచ్చినదే కావడంతో ఇప్పుడు అతడ్ని ప్రశంసలతో ముంచెత్తే వాళ్లు పెరిగారు. పేదరికంతో కొట్టు మిట్టాడుతున్న కుటుంబం నుంచి వచ్చిన షారూక్‌ రూపొందించిన ఈ శాట్‌ ఈనెల 22వ తేదీన అమెరికాలోని ‘నాసా’ నుంచి నింగిలోకి ప్రయోగించారు. ఈ విజయ సమాచారం అమెరికా నుంచి రావడంతో షారూక్‌ తమిళనాట హీరో అయ్యాడు. భారీ ఆకారంతో కనిపించే అతడిని ఒకప్పుడు హేళన చేసిన వాళ్లు కూడా ఇప్పుడు అభినందించే పనిలో పడ్డారు.  

తల్లి కల్లల్లో ఆనందం : పల్లపట్టి గ్రామం షారూక్‌ రూపంలో వార్తల్లోకి ఎక్కింది. ఆ గ్రామాన్ని మీడియా చుట్టుముట్టింది. ఎవర్ని కదిలించినా.. మా షారూక్‌ అని పలికే వారే. ఇప్పుడు సెలబ్రిటీగా మారిన ఈ షారూక్‌ జీవితంలో ఎన్నో ఒడిదొడుగులు ఉన్నాయి. అందులో ప్రధానం. కొన్నేళ్ల క్రితం తండ్రి మహ్మద్‌ ‘అల్లా’ వద్దకు చేరడమే. ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో శాస్త్ర వేత్తగా మహ్మద్‌ పనిచేసినట్టుగా ఆ గ్రామస్తులు చెబుతున్నారు. తండ్రి బాటలోనే షారూక్‌ నేడు శాస్త్రవేత్తగా తొలి అడుగులో విజయ కేతనం ఎగుర వేసినట్టు పేర్కొంటున్నారు. అయితే, షారూక్‌ తల్లి షకీలా భాను కల్లల్లో ఆనందం తాండవం చేస్తున్నది.

రంజాన్‌ మాసంలో తన బిడ్డకు ‘అల్లా’ అనుగ్రహం దక్కిందన్న ఆనందాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. తన భర్త మరణించినప్పుడు సర్వం కోల్పోయినంతగా వేదన కల్గిందని కన్నీటి పర్యంతం అయ్యారు. ఒక్కగానొక్క కొడుకుని చదివించి ప్రయోజకుడ్ని చేయాలన్న కాంక్షతో ముందుకు సాగినట్టు వివరించారు. చదువు ధ్యాస కన్నా, పరిశోధనల మీద షారూక్‌కు మక్కువ ఉండడంతో పలు మార్లు వారించినా వినలేదని ఆమె పేర్కొన్నారు. చేతికి ఏ వస్తువు చిక్కినా, దానిని చిన్నాభిన్నం చేయడం, మళ్లీ కొత్త రూపు తీసుకు రావడం చేసే వాడని, దీనిని చూసి అనేక మంది హేళన కూడా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

 ప్లస్‌టూలో 1200కు గాను కేవలం 750  మార్కులు మాత్రమే సాధించాడని, ఆ సమయంలో తనకు ఎంతో కోపం బాధ కల్గినట్టు పేర్కొన్నారు. ఇంజినీరింగ్‌ చేయమని తాను ఒత్తిడి తెస్తే, బీఎస్‌ఈ ఫిజిక్స్‌ కోర్సులో చేరాడంటూ, ఇప్పుడు అతడిలో ఉన్న ప్రతిభ బయట పడిందని, ఆ ఆనందం ...అంటూ ఆనంద భాష్పాలతో తనయుడ్ని అభినందించారు. ఇక, తనకు సహకారం అందించి, నాసా స్థాయికి తీసుకెళ్లిన స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా శ్రీమది కేశన్‌ మ్యామ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు షారూక్‌ పేర్కొన్నారు.

రూ. 10 లక్షలు సాయం:  తమిళ ఖ్యాతిని నాసా స్థాయిలో చాటిని షారూక్‌ను అభినందిస్తూ సీఎం పళని స్వామి రూ.10 లక్షలు సాయం ప్రకటించారు. ఇది కూడా అసెంబ్లీ వేదికగా శనివారం 110 నిబంధనల మేరకు ప్రత్యేక తీర్మానం రూపంలో ప్రకటించడం విశేషం. షారూక్‌ ప్రతిభను కొనియాడుతూ, చెన్నై స్పెస్‌కిడ్జ్‌ను అభినందించారు.

Advertisement
Advertisement