అందరూ వందేళ్లు బతకొచ్చు.. ఎలాగో తెలుసా
వర్తమానానికి కొనసాగింపే భవిష్యత్ అని అందరికీ తెలుసు. మరి వర్తమానంలోని వాస్తవాలు ఎంత మందికి తెలుసు? ఒక పచ్చివాస్తవం(ప్రస్తుతం అందరికీ అనుభవంలో ఉన్నదే) మీ భవిష్యత్తును మార్చబోతోంది. నచ్చినా నచ్చకున్నా మున్ముందు మన జీవితాలు ఇలానే ఉంటాయి. మనం చేయాల్సిందల్లా కేవలం సంసిద్ధులై ఉండటమే!
ఈ కథనంలోని కొన్ని గణాంకాలను చూసి ఇది ఆయుఃప్రమాణానికి మాత్రమే సంబంధించిందనుకుంటే పొరపాటు. పలు సందర్భాల్లో పెద్దవాళ్లు చిన్నవాళ్లని 'నిండు నూరేళ్లూ చల్లగా ఉండు'అని దీవిస్తారు. అలా దీవించినవారూ, దీవెనలు అందుకున్నవారూ మహా అయితే 60 ఏళ్లకు మించి బతకరు. అసలా దీవెనలోని పరమార్థమే వేరు. వైద్యశాస్త్రం అంతగా అభివృద్ధి చెందని నాటి రోజుల్లో పిల్లలు కొద్దిగా ఎక్కువ కాలం బతకాలని పెద్దలు అలా దీవించేవారు. నమ్మబుద్ధి కాకపోతే పశ్చిమదేశాల్లో నమోదయిన ఈ లెక్కల్ని ఓ సారి చూడండి..
ఆ దేశాల్లో ప్రస్తుత సగటు ఆయుఃప్రమాణం 80 ఏళ్లు. మూడు దశాబ్ధాల కిందట 74 ఏళ్లుగా ఉండేది. అదే 60 ఏళ్ల క్రితం 66 ఏళ్లు. వందేళ్ల కిందట (అరౌండ్ 1916) ప్రజలు సరాసరి 54 ఏళ్లకే చనిపోయేవారు. అంటే గతం నుంచి వర్తమానానానికి వచ్చే సరికి మనిషి ఆయుఃప్రమాణం 30 ఏళ్లు పెరిగిందన్నమాట. ఇప్పటి నుంచి మరో 30 ఏళ్లు ముందుకు వెళితే మనందరం కచ్చితంగా 100 ఏళ్లకుపైగా జీవిస్తామన్నమాట! ఒక్క నిమిషం చదవడం ఆపి.. పక్కనున్నవాళ్లను '100 ఏళ్లు బతకడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?' అని అడిగి చూడండి.. తమాషా సమాధానాలు వినిపిస్తాయి.
చచ్చినట్లు 100 ఏళ్లు బతకాల్సిందే!
కలరా(గత్తర), టీబీ, ప్లేగ్, క్యాన్సర్ ఇంకా మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీలు తదితర అవయవాలకు సోకే వ్యాధుల వల్ల మరణాల రేటు గతంలో ఎక్కువగా ఉండేది. 19వ శతాబ్ధం చివరి నుంచి వైద్యశాస్త్రం క్రమంగా అభివృద్ధి చెందడం చాలా ఏళ్ల కిందటే పలు దేశాలు టీబీ, ప్లేగ్, కలరా, పోలియో వంటి వ్యాధులనుంచి బయటపడటం మనం చూస్తూనేఉన్నాం. క్యాన్సర్ వస్తే ఒకప్పుడు చావుతప్పేదికాదు. మరి ఇప్పుడో? బతకగలమన్న నమ్మకం పెరిగింది. భవిష్యత్తులో క్యాన్సర్ ను తప్పక జయిస్తాం. ఇదేకాదు ఇలాంటి ఎన్నివ్యాధులు పుట్టుకొచ్చినా ఎదుర్కొనేస్థాయికి చేరుకుంటాం. చచ్చినట్లు 100 ఏళ్లకంటే ఎక్కువే జీవిస్తాం. లండన్ బిజినెస్ స్కూల్ రీసెర్చర్లు ఆండ్రూ స్కాట్, లిండా గ్రాటన్ అనేక అధ్యయనాలు, పరిశీలనలు చేసి రాసిన 'ది 100 ఇయర్స్ లైఫ్' పుస్తకంలో ఇదే విషయాన్ని ఘంటాపథంగా చెప్పారు.
ఏం చెయ్యాలిప్పుడు?
అన్నింటికంటే ముందు మనం ఎక్కువకాలం బతకబోతున్నామనే వాస్తవాన్ని అంగీకరించాలి. ఆమేరకు అవసరమయ్యే ఆర్థిక స్వావలంబనను సమకూర్చుకోవాలి. 60 ఏళ్లకే రిటైరై పోకుండా 80 ఏళ్ల వరకు పనిచేయాల్సి ఉంటుందని ఫిక్స్ అయిపోవాలి. పొదుపు తప్పనిసరి. సుదీర్ఘ జీవనయానంలో మనం వాళ్లతోపాటే నడుస్తాం కాబట్టి.. లాస్ట్ అండ్ నాట్ లీస్ట్.. మన బంధువులు, పొరుగువాళ్లతో సఖ్యంగా ఉండాలి. 'ది 100 ఇయర్స్ లైఫ్' పుస్తకం ఇటీవలే విడుదలైంది. దాంన్లో వర్తమానానికి సంబంధించిన ఎన్నో వాస్తవాలతోపాటు భవిష్యత్తునూ, మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలనూ పొందుపర్చారు. గెట్ రెడీ టు లివ్ లాంగ్ లైఫ్..