శభాష్..! హర్నామ్
సాక్షి, స్కూల్ ఎడిషన్
దువ్విన తలనే దువ్వడం,
అద్దిన పౌడరు అద్దడం,
అద్దం వదలక పోవడం,
అందానికి మెరుగులు దిద్దడం..
ప్రపంచంలో ప్రతీ పదహారేళ్ల అమ్మాయికి ఇలాంటి అలవాట్లే ఉంటాయి. ఆ అమ్మాయిలు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా దాదాపుగా అంతా ఒకేలా ప్రవర్తిస్తారు. కానీ, ఓ అమ్మాయికి మీసాలుంటే.. మగవారిలా గడ్డం పెరిగితే! ఆ పదం వినడమే కష్టంగా ఉంది కదూ! ఒకవేళ నిజమైతే.. అంతకన్నా శాపం ఇంకేముంటుంది? ఇలాంటి ప్రకృతి విరుద్ధమైన పరిస్థితుల్లో ఎవరు ఉన్నా.. కుమిలి పోతారు. బయటికి రాకుండా, లోకాన్ని చూడకుండా బతుకుతారు. కానీ, హర్నామ్ కౌర్ మనస్తత్వం అలాంటిది కాదు. తన శరీరంలో వచ్చిన మార్పునకు తాను కారణం కాదు. కాబట్టి ఎవరి ముందు సిగ్గుపడకుండా తన పనులు తాను చేసుకుంటుంది. శరీరంలో అవలక్షణం గురించి లోకమేమనుకున్నా.. తనకేమంటూ కెరీర్‌పై దృష్టి పెట్టి ముందుకు పోతోంది. తనలాంటి వారు కుమిలిపోకుండా జీవితాన్ని పాడుచేసుకోకండి అనే సందేశమిస్తూ.. ఉద్యమాన్నే ప్రారంభించింది. హర్మన్ కౌర్ మనోధైర్యానికి, సంకల్పానికి నిజంగా మనమంతా మనస్ఫూర్తిగా సెల్యూట్ చేసి తీరాలి.
హర్నామ్‌కు ఏమైంది?
హర్నామ్‌కౌర్ (25) కుటుంబం భారత్ నుంచి వలస వెళ్లి బ్రిటన్‌లోని బెర్క్‌షైర్ ప్రాంతంలో స్థిరపడింది. పుట్టినప్పటి నుంచి హర్నామ్‌ను ఇంట్లో వారంతా ఎంతో గారాబంగా చూసుకున్నారు. ముద్దుగా, బొద్దుగా, తెల్లగా ఉండే ఆమెను అపురూపంగా చూసుకునేవారు. 11 ఏళ్లు వచ్చేసరికి హర్నామ్ శరీరంలో మార్పులు మొదలయ్యాయి. అందరిలా కాకుండా ముఖంపై దట్టమైన రోమాలు రావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. మొదట్లో ఇది సాధారణమైందనే అనుకున్నారు వారంతా. రానురాను ఎక్కువవసాగింది. దీంతో ఫేషియల్, వాక్స్ సాయంతో ప్రతిరోజూ రోమాలను తొలగించే వారు. 16 ఏళ్లు వచ్చాక ఈ సమస్య తీవ్రమైంది. అవి రోమాలు కావని, గడ్డం, మీసాలు అని నిర్ణయించుకున్నారు.
ఆత్మహత్యాయత్నం..!
ప్రతిరోజు ఫేషియల్ చేసుకోవాలంటే కుదిరేది కాదు. హైస్కూల్‌లో చేరాక హర్నామ్‌కు ఇబ్బందులు పెరగసాగాయి. తోటి విద్యార్థులు హర్నామ్‌ను ఎగతాళి చేసేవారు. నీకు మగవారిలా గడ్డం, మీసాలు వస్తున్నాయని ఏడిపించేవారు. దీంతో తనలో తాను కుమిలిపోయేది హర్నామ్. తోటి విద్యార్థుల కామెంట్లు భరించలేకపోయింది. ఒకరోజు ఇంట్లో చేతికి దొరికిన టాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకోవాలని ప్రయత్నించింది. కానీ, ఇంట్లో వారు సకాలంలో గుర్తించడంతో బతికింది.
ఏంటి సమస్య?
హర్నామ్‌కౌర్ కూడా అందరిలాంటి అమ్మాయే. కానీ, ఆమెకు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓ) అనే రుగ్మత వచ్చింది. ఇది ఆడవారిలో రుతుచక్రంపై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల అండాల విడుదల సక్రమంగా జరగదు. ఫలితంగా శరీరంలో హోర్మోన్ల స్థాయిలో హెచ్చుతగ్గులు నమోదవుతాయి. మగవారిలో ఉత్పత్తి అయ్యే ‘ఆండ్రోజెన్స్’ హర్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని ఫలితంగా ఆడవారి శరీరంలో ముఖ్యంగా మొహంపై మీసాలు, గడ్డాలు పెరుగుతాయి.
ఆలోచన మారింది..!
బతికి బయటపడ్డ హర్నామ్‌కౌర్ తన ఆలోచన తీరు మార్చుకుంది. తన శరీరంలో ఏర్పడ్డ హార్మోన్ల లోపానికి తాను ఎలా కారణమవుతానని ప్రశ్నించుకుంది. అంతే.. హర్మామ్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. తన మొహంపై ఉన్న గడ్డాలు, మీసాలు తీయకూడదని నిర్ణయించుకుంది. తనలా ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నవరు కుంగిపోకుండా వారిలో స్ఫూర్తిని నింపాలనుంది. ఆమె సంకల్పానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు మద్దతు పలికారు. అప్పటి నుంచి సిక్కు యువకుడిలా నెత్తిన తలపాగా, మీసాలు, గడ్డంతో స్కూలు, కాలేజీలకు వెళ్లి రావడం మొదలుపెట్టింది. ఎవరేమనుకున్నా పట్టించుకునేది కాదు. శరీర అవలక్షణాలతో ఇబ్బంది పడుతున్న వారిని హేళన చేయడాన్ని తప్పుబట్టింది. అలాంటి వారిలో మానసికస్థైర్యం నింపడానికి నడుం బిగించింది. ప్రస్తుతం టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూనే మరోవైపు ‘ఆంటీ బుల్లీయింగ్’ చారిటీ పేరిట ఉద్యమాన్ని నడుపుతోంది. తనలాంటి వారు మనోనిబ్బరం కోల్పోకూడదంటూ టీవీల ద్వారా సందేశాలను ఇస్తోంది. సోదరుడి సాయంతో తన జీవితాన్నే లఘుచిత్రంగా తీసి ప్రచారం చేస్తోంది. ఈ ఉద్యమానికి హర్నామ్‌కు బ్రిటన్ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ, మద్దతు లభించడం విశేషం.