మత సదస్సులో అర్ధనగ్న నిరసన
ఫ్రాన్సు రాజధాని ప్యారిస్ నగరంలో మహిళలు - ఇస్లాం అనే అంశంపై సదస్సు జరుగుతుండగా.. ఇద్దరు మహిళలు అర్ధనగ్నంగా వచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. దాంతో వాళ్లిద్దరినీ బలవంతంగా లాగి కిందకు ఈడ్చేశారు. ఇద్దరు ఇమాంలు వేదికమీద ప్రసంగిస్తుండగా, వీళ్లిద్దరూ ఉన్నట్టుండి అర్ధనగ్నంగా మారి వేదికమీదకు దూసుకెళ్లారు. వీరిలో ఒకరు అల్జీరియా, మరొకరు ట్యునీషియా జాతీయులు. 'నాకెవరూ ఆదేశాలు ఇవ్వలేరు, నాకు నేనే ప్రవక్తని' అని నినాదాలు తమ శరీరాల మీద రాసుకుని వచ్చారు. అవే పదాలను నినాదాలుగా కూడా వినిపించారు.
దాంతో సుమారు 15 మంది కింద నుంచి పైకి వచ్చి, ముందు ఇమాంలను వాళ్ల నుంచి దూరంగా తీసుకెళ్లారు. తర్వాత ఆ మహిళలను బలవంతంగా కిందకు లాగేశారు. కొంతమంది వాళ్లను కొడుతుండగా పోలీసులు జోక్యం చేసుకుని అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. దీనిపై నిరసనకారుల స్వరం వేరేలా ఉంది. మీరు మీ భార్యలను కొట్టాలా వద్దా అనే అంశంపై ఆ ఇద్దరు ఇమాంలు చర్చిస్తున్నారని తెలిపారు. అందుకే అక్కడ తమవాళ్లు అలా నిరసన తెలపాల్సి వచ్చిందన్నారు.