female activists
-
రంగస్థలం..శ్రీ మహాలక్ష్మీ లేడీస్ డ్రామా గ్రూప్
ఫ్లాష్‌బ్యాక్‌లు సినిమాల్లోనే కాదు నాటకాల్లో కూడా ఉంటాయి. నాటకాల్లోనే కాదు నాటకరంగ సంస్థలకు కూడా ఉంటాయి. ఒక తమిళపత్రికలో నాటకరంగానికి సంబంధించిన వ్యాసం ఒకటి చదివింది జ్ఞానం బాలసుబ్రమణియన్. ఒకాయన తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు: ‘తమిళ నాటకరంగంలో రాసే మహిళలు, నటించే మహిళలు లేరు. ఎంతో సామర్థ్యం ఉంటేగానీ ఇది సాధ్యం కాదు అనుకోండి’ ఆయన మాటలను సవాలుగా తీసుకుంది జ్ఞానం. వరకట్న రక్కసిపై నాటిక రాసింది. నిజానికి అంతవరకు తనకు రచన, నాటకరంగంలో ఎలాంటి అనుభవం లేదు. తాను రాసిన నాటికను ఆకాశవాణికి పంపించింది. వారు తిరస్కరించారు. చిన్న నిరాశ! జ్ఞానం భర్త పెద్ద అధికారి. ఆయన బాంబేకు బదిలీ అయ్యాడు. భర్తతో పాటు బాంబేకు వెళ్లింది జ్ఞానం. ఒకానొక రోజు వరకట్న సమస్యపై తాను రాసిన నాటికను బాంబేలో ప్రదర్శించారు. అనూహ్యమైన స్పందన వచ్చింది. తన మీద తనకు నమ్మకం ఏర్పడడానికి ఆ స్పందనే కారణం అయింది. ఈ నమ్మకమే ‘మహాలక్ష్మీ లేడిస్ డ్రామా గ్రూప్’ శ్రీకారం చుట్టడానికి నాంది అయింది. నాటకరంగంలో స్త్రీ ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ఏర్పాటయిందే ఈ డ్రామా గ్రూప్. అయితే...రకరకాల భయాల వల్ల ఈ డ్రామా గ్రూప్‌లో చేరడానికి మహిళలు సంకోచించేవారు. ‘ప్రయత్నిస్తే ఫలించనిదేముంది’ అనే నానుడిని మరింత గట్టిగా నమ్మింది జ్ఞానం. ఒకటికి పదిసార్లు వారితో మాట్లాడి ఒప్పించింది. మొదట్లో ఇద్దరు చేరారు. ఆ ఇద్దరు ఆరుగురు ఆయ్యారు... అలా పెరుగుతూ పోయారు. అలా చేరిన వాళ్లు గతంలో ఎన్నడూ నాటకాల్లో నటించలేదు. నటన మీద ప్రేమ తప్ప నటనలో ఓనమాలు తెలియని వాళ్లే. సాధారణంగా నాటకాల్లో స్త్రీ పాత్రలను పురుషులు ధరిస్తారు. కానీ ‘మహాలక్ష్మీ లేడీస్ డ్రామా గ్రూప్’లో పురుష పాత్రలను స్త్రీలే ధరిస్తారు. మొదట్లో ఇది చాలామందికి వింతగా అనిపించేది. ఇది ఆ నాటక సంస్థకు చెందిన ‘ప్రత్యేకత’గా కూడా మారింది. ఈ ఆల్–వుమెన్ డ్రామా గ్రూప్ నుంచి కాలక్షేప నాటకాలు రాలేదు. కనువిప్పు కలిగించే నాటకాలు వచ్చాయి. వర్నకట్నం, వర్కింగ్ ఉమెన్స్ ఎదుర్కొనే సమస్యలు, బాల్యవివాహాలు...మొదలైన వాటితో పాట ఆధ్యాత్మిక విషయాలను కూడా ఇతివృత్తాలుగా ఎంచుకుంది ఈ నాటకసమాజం. స్టేజీ ఎక్కడానికి ముందు ఒక్కో నాటకాన్ని ఇంచుమించు 30 సార్లు రిహార్సల్స్ చేస్తారు. కట్ చేస్తే....ఇది సోషల్ మీడియా కాలం. ఒక ఊళ్లో నాటకం వేస్తే ఆ ఊరే చూస్తుంది. అదే నాటకం డిజిటల్ స్పేస్‌లోకి వస్తే ఊరూ, వాడ ఏమీ ఖర్మ...ప్రపంచమే చూస్తుంది. అలా అని.. రంగస్థలాన్ని తోసిరాజనాలనేది వారి ఉద్దేశం కాదు. ఒకవైపు రంగస్థలానికి ప్రాధాన్యం ఇస్తూనే అదనపు వేదికను కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలనేది వారి నిర్ణయం వెనక కారణం. తొలిసారిగా ‘ఎందరో మహానుభావులు’ యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని మూడు లక్షల మందికి పైగా వ్యూయర్స్ చూడడం నాటక సంస్థకు ఎంతో ఉత్సాహం, ధైర్యాన్ని ఇచ్చింది. ‘మహాలక్ష్మీ...ఎందరో మహిళల కలలకు రెక్కలు ఇచ్చింది’ అంటోంది సుదీర్ఘ కాలంగా ఈ నాటకరంగ సంస్థతో అనుబంధం ఉన్న కమల ఈశ్వరీ. నాటక సంస్థ మొదలైనప్పుడు...సమస్యలు కొన్నే ఉండవచ్చు. ఇప్పుడు ఎటు చూసినా ఏదో ఒక సమస్య. మాధ్యమాలు కూడా పెరిగాయి. ఆ మాధ్యమాల వేదికగా, రకరకాల ఆధునిక సమస్యలపై పోరాడడమే ‘మహాలక్ష్మీ లేడిస్ డ్రామా గ్రూప్’ లక్ష్యం. -
తప్పుడు పేర్లు చెప్పిన వారిపై మరో కేసు!
సాక్షి, అమరావతి బ్యూరో: అనుమతి లేకుండా ర్యాలీ చేయడమే కాకుండా పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు పేర్లు, చిరునామాలు ఇచ్చిన వారిని గుర్తించే పనిలో విజయవాడ పోలీసులు పడ్డారు. వారిపై సెక్షన్ 42 సీఆర్పీసీ ప్రకారం మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి గత శుక్రవారం అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో టీడీపీ మహిళా కార్యకర్తలు విజయవాడ బందరు రోడ్డులో పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. నగరంలో 144 సీఆర్పీసీ, సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉందని చెప్పినా వినకుండా గుంపులుగుంపులుగా కలసి వచ్చారు. చట్టాలను ఉల్లంఘించారు. ట్రాఫిక్‌కు అవాంతరం కలిగించారు. పోలీసులపై దౌర్జన్యం చేశారు. అయినప్పటికీ పోలీసులు సంయమనం పాటించారు. చివరకు వారి వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తడంతో రోడ్డుపై బైఠాయించిన మహిళల్ని అరెస్టు చేసి వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. ఐపీసీ 143, 188, 341, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అందరి వివరాలు అడగ్గానే ఆక్రోశంతో ఊగిపోయారు. కొందరు మహిళలు తమ పేర్లు, చిరునామాలు చెప్పేందుకు నిరాకరించారు. మరికొందరు నాపేరు జయసుధ, జయప్రద అంటూ.. చివరకు సీఎం వైఎస్ జగన్ తల్లి, సోదరి, సతీమణి పేర్లు సైతం చెప్పారు. అలాగే తప్పుడు చిరునామాలు ఇచ్చారు. ఇలా చేసిన వారిని గుర్తించి మరో కేసు నమోదు చేయాలని నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు పోలీసులను ఆదేశించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం. ర్యాలీకి అనుమతి లేదన్నా వినకుండా గత శుక్రవారం మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడం నేరం. అందుకే 479 మందిపై కేసు నమోదు చేసి వారినందరినీ పోలీసుస్టేషన్లకు తరలించాం. సెక్షన్ 42 సీఆర్పీసీ ప్రకారం పోలీసు అధికారులు అడిగినప్పుడు ఎవరైనా తమ పేర్లు, చిరునామాలు పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనకు ఎవరూ అతీతులు కారు. కాదని మొండికేస్తే కోర్టులో ప్రవేశపెడతాం. – ద్వారకా తిరుమలరావు, సీపీ, విజయవాడ -
మహిళపై సిద్దరామయ్య ఫైర్
మైసూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మహిళా కార్యకర్తతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ కార్యకర్తపై సిద్ధరామయ్య గట్టిగా కేకలు వేయడం, మైక్‌ను లాగినపుడు ఆమె చేతిలోని మైక్‌తోపాటు దుపటా ఆయనచేతిలోకి రావడం వివాదమైంది. మైసూరులోని గర్గేశ్వర గ్రామంలో సిద్దరామయ్య అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో సిద్దరామయ్య కొడుకు, స్థానిక ఎమ్మెల్యే యతీంద్రతోపాటు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాలూకా పంచాయతీ ఉపాధ్యక్షురాలు జమలాల్ లేచి.. తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే యతీంద్ర గెలిచాక మళ్లీ రానేలేదని చెప్పారు. ‘యతీంద్రను ఎన్నికల తర్వాత మళ్లీ ఈ రోజే చూస్తున్నా’ అని అన్నారు. దీంతో సిద్దరామయ్య ఆగ్రహంతో ఊగిపోయారు. నియోజకవర్గానికి యతీంద్ర వస్తూనే ఉన్నారని సిద్ధరామయ్య చెప్పినా జమలాల్ బల్లగుద్ది మరీ వాదించారు.. దీంతో సిద్దరామయ్య ‘నా ముందే టేబుల్‌పై కొట్టి మాట్లాడతావా? ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో, లేదా నోరు మూసుకుని కూర్చో’అని పరుషంగా ఆదేశించారు. అయినా సరే జమలాల్ మరోసారి బల్లగుద్ది మాట్లాడారు. దీంతో సిద్ధరామయ్య అరుస్తూ ఆమె చేతిలో ఉన్న మైకును లాగేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె ధరించిన దుపట్టా జారింది. ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటనను సుమోటొగా నమోదు చేస్తున్నట్లు జాతీయ మహిళా హక్కుల కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ రేఖా శర్మ తెలిపారు. మహిళా కార్యకర్తతో సిద్దరామయ్య అనుచిత ప్రవర్తనపై విచారణ జరిపి, చర్య తీసుకోవాలని కర్ణాటక పోలీసులను కోరనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కౌరవుల ప్రభుత్వం నడుస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. -
మత సదస్సులో అర్ధనగ్న నిరసన
ఫ్రాన్సు రాజధాని ప్యారిస్ నగరంలో మహిళలు - ఇస్లాం అనే అంశంపై సదస్సు జరుగుతుండగా.. ఇద్దరు మహిళలు అర్ధనగ్నంగా వచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. దాంతో వాళ్లిద్దరినీ బలవంతంగా లాగి కిందకు ఈడ్చేశారు. ఇద్దరు ఇమాంలు వేదికమీద ప్రసంగిస్తుండగా, వీళ్లిద్దరూ ఉన్నట్టుండి అర్ధనగ్నంగా మారి వేదికమీదకు దూసుకెళ్లారు. వీరిలో ఒకరు అల్జీరియా, మరొకరు ట్యునీషియా జాతీయులు. 'నాకెవరూ ఆదేశాలు ఇవ్వలేరు, నాకు నేనే ప్రవక్తని' అని నినాదాలు తమ శరీరాల మీద రాసుకుని వచ్చారు. అవే పదాలను నినాదాలుగా కూడా వినిపించారు. దాంతో సుమారు 15 మంది కింద నుంచి పైకి వచ్చి, ముందు ఇమాంలను వాళ్ల నుంచి దూరంగా తీసుకెళ్లారు. తర్వాత ఆ మహిళలను బలవంతంగా కిందకు లాగేశారు. కొంతమంది వాళ్లను కొడుతుండగా పోలీసులు జోక్యం చేసుకుని అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. దీనిపై నిరసనకారుల స్వరం వేరేలా ఉంది. మీరు మీ భార్యలను కొట్టాలా వద్దా అనే అంశంపై ఆ ఇద్దరు ఇమాంలు చర్చిస్తున్నారని తెలిపారు. అందుకే అక్కడ తమవాళ్లు అలా నిరసన తెలపాల్సి వచ్చిందన్నారు.