నరికిన తలతో.. కుర్రాడి ఫొటో పోజు!!
ఉగ్రవాదుల ఘాతుకాలు ఘోరాతి ఘోరంగా ఉంటున్నాయి. సిరియా సైనికుడి తల నరికేసి.. ఆ తలను ఓ కుర్రాడి చేతికి ఇచ్చి ఫొటో తీశారు. ఆ కుర్రాడు కూడా.. ఓ ఆస్ట్రేలియా ఉగ్రవాది కొడుకు కావడం గమనార్హం. ఈ ఫొటోను ఆస్ట్రేలియా దినపత్రిక ఒకటి ప్రచురించింది. దీన్ని బట్టే ఉగ్రవాదులు ఎంత అరాచకంగా ఉన్నారో అర్థమవుతుందని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ వ్యాఖ్యానించారు. ఖలీద్ షరౌఫ్ అనే ఉగ్రవాది కొడుకు ఈ తల పట్టుకున్నట్లుగా ఉన్న ఫొటోను ముందుగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా పత్రిక ప్రచురించింది. అతడు తన కొడుకేనని షరౌఫ్ కూడా గర్వంగా చెప్పాడు. సిరియా ఉత్తర భాగంలోని రక్కా ప్రాంతంలో ఆ ఫొటో తీశారు. దీన్ని ఇస్లామిక్ స్టేట్ రాజధానిగా ఇస్లామిక్ ఖలీఫా ప్రకటించుకున్నారు. పేరు బయటకు రాని ఆ కుర్రాడి వయసు పదేళ్లలోపే.
ఉగ్రవాది షరౌఫ్ తన సోదరుడి పాస్పోర్టు ఉపయోగించుకుని భార్య, ముగ్గురు కొడుకులతో కలిసి సిరియా, ఇరాక్ దేశాలకు గత సంవత్సరమే పారిపోయాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వం అతడిని దేశం వదిలి వెళ్లకూడదని నిషేధించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ అతడిపై ఆస్ట్రేలియన్ పోలీసులు అరెస్టు వారెంటు కూడా జారీ చేశారు.