కమలాపురం పీఠాధిపతి కన్నుమూత
కమలాపురంలోని హజరత్ అబ్దుల్ గప్ఫార్ షా ఖాద్రి దర్గా పీఠాధిపతి హజ రత్ హాజీ జహీరుద్దీన్ షా ఖాద్రి(69) కన్నుమూశారు. కొంతకాలంగా మల్టీపుల్ ఆర్గాన్స ఫెయిల్యూర్తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరకు గురువారం ఉదయం 11 గంటలకు తుది శ్వాస వది లారు. హైపర్ టెన్షన్, న్యూమోనియో, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నా ఆయన ఈ నెల 14న ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
ఆయనకు డాక్టర్ నాగేశ్వరరెడ్డి నేతృత్వంలో చికిత్సలు అందించారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు పీఠాధిపతి లోకం నుంచి నిష్ర్కమించారు. విషయం తెలిసిన వెంటనే ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు. రాష్ర్ట నలుమూలలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలోని ఆయన శిష్యులు విషాద వదనంతో ఉండిపోయారు. ఇప్పటికే ఆయన శిష్యులు ఒక్కొక్కరుగా దర్గా చేరుకుంటున్నారు.
మహిమలతో పెరిగిన శిష్యరికం
పెద్ద దర్గా పీఠాధిపతి హాజీ హజరత్ జహీరుద్దీన్ షా ఖాద్రి తన దివ్య మహిమలతో రాష్ట్రం నలుమూలలే గాక తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల్లోనూ అధిక సంఖ్యలో శిష్యగణాన్ని ఏర్పరచుకున్నారు. తన తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఖిలాఫత్ చేయడం ప్రారంభించారు. పదహారో ఏట తండ్రి మరణంతో 1960 నుంచి ఇప్పటి వరకు ఆయన దర్గాకు పీఠాధిపతిగా కొనసాగారు. ఏటా ఏప్రిల్లో ఆయన ఆధ్వర్యంలో ఉరుసు ఉత్సవాలను నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేవారు.
భౌతికకాయాన్ని సందర్శించిన వైఎస్ జగన్
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించిన పీఠాధిపతి జహీరుద్దీన్ షా ఖాద్రీ భౌతికకాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించారు. హైదరాబాద్లోని ఆయన భౌతికకాయాన్ని మధ్యాహ్నం ఒంటిగంటకు సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చారు.
పెద్ద దర్గా పీఠాధిపతి హాజీ హజరత్ జహీరుద్దీన్ షా ఖాద్రి అంత్యక్రియలు శుక్రవారం జుమ్మా నమాజ్ అనంతరం నిర్వహించనున్నట్లు స్వామి కుటుంబ సభ్యులు తెలిపారు. భక్తులు, శిష్యులు హాజరు కావాలని వారు కోరారు.
స్వామి ఆశీస్సుల కోసం
అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఇక్కడి దర్గా పీఠాధిపతి జహీరుద్దీన్ షా ఖాద్రి వద్దకు వచ్చి ఆశీర్వాదం పొందేవారు. ప్రతి ఎన్నికల్లోనూ నామినేషన్ల ప్రక్రియకు ముందు అభ్యర్థులు స్వామి ఆశీర్వాదం పొందిన తర్వాతనే తమ పనులు మొదలుపెట్టేవారు. తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరినీ పీఠాధిపతి ఎంతో అభిమానంగా మాట్లాడేవారు. చిన్న పిల్లలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా తల్లిదండ్రులు వెంటనే ఇక్కడికి వచ్చి స్వామి వారు ఇచ్చే తాయొత్తులను కట్టించుకునేవారు. ఇప్పుడు ఆ స్వామి లేరని తెలసి భక్తులు కన్నీరుమున్నీరయ్యారు. దర్గా ప్రాంగాణానికి చేరుకుని గురువుతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.