నేను అడ్రినల్ గ్రంథిని!
నా ప్రతి గ్రాములోనూ ఒక డైనమైట్ అంతటి శక్తి ఉంది. నేను కావాలనుకుంటే నా యజమానిని పిచ్చాసుపత్రికి పంపించే శక్తి ఉంది. కానీ అలా పంపించకూడని వివేచన కూడా ఉంది. అసలు నేనున్నాననే ఉనికి కూడా తెలియకుండా పనిచేస్తుంటాను. నేను ఆనంద్ అడ్రినల్ గ్రంథిని.
అతడి కుడి మూత్రపిండం మీద నేనూ, మరో కిడ్నీ మీద నా సహచరుడు ఇద్దరం నిశ్శబ్దంగా రాజ్యమేలుతుంటాం. నా సైజు వేలికొన కంటే తక్కువ. నా బరువు ఒక నాణెం కంటే తక్కువ. కానీ దాదాపు 50 కి పైగా హార్మోన్లు, హార్మోన్ల లాంటి స్రావాలను తయారు చేస్తుంటాను. 28 గ్రాములను వెయ్యి భాగాలు చేస్తే అందులో ఒక వంతు ఎంత ఉంటుందో నేను స్రవించే స్రావాలూ అంతే ఉంటాయి. నా స్రావాలు చాలా తక్కువ... కానీ ఆనంద్ రోజులో చేసే చాలా పనులకు అవసరమైన హార్మోన్లు నాలోంచి విడుదల అవుతుంటాయి.
నిర్మాణపరంగా నేనొక అద్భుతాన్ని...
ఎందుకంటే ప్రతి నిమిషానికీ... నా బరువుకంటే ఆరురెట్లుకు మించి నాలో రక్తం ప్రవహించేలా నా నిర్మాణం ఉంటుంది. అంత ఎక్కువగా నాలో రక్తప్రవాహం కొనసాగుతుంటుంది. అంత పెద్దమొత్తంలో రక్తం ప్రవహించేందుకు వీలుగా, అతి సంక్లిష్టంగా నాలో రక్తనాళాలు అల్లుకుపోయి ఉంటాయి. ఆనంద్ దేహం పనిచేయడానికి, అతడి అవసరాలు తీరడానికి నాలో పదోవంతు చాలు. కానీ ఎంతో రిజర్వ్ ఉండేలా ప్రకృతి నన్ను నిర్మించింది. అలాగని ఏ కారణం వల్లనో లేదా ఏ శస్త్రచికిత్స వల్లనో నేను పదోవంతుకు తగ్గిపోతే ఆనంద్ చనిపోతాడు.
అంతర్భాగం నుంచి ఒకటీ... బయటిపొర నుంచి మరొకటి
నాలో కొన్ని రకాల హార్మోన్లు విడుదల అవుతాయి. కొన్ని నాలోని అంతర్భాగం నుంచి. మరికొన్ని నాలోని బయటి పొర నుంచి. నాలోని అంతర్భాగం నుంచి స్రవించాల్సిన స్రావం కోసం మెదడు నుంచి నేరుగా సంకేతాలు అందుతాయి. ఆనంద్కి ఏదైనా ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు, తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యే సమయంలో, క్లిష్టమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, కోపం; ఆవేశం వచ్చే సందర్భాల్లో ఇవి విడుదల అవుతాయి. అప్పుడు అతడు తీవ్రమైన ఉద్విగ్నతకు లోనవుతాడు. తీవ్రమైన భావోద్వేగానికీ, ఒత్తిడికీ గురవుతాడు. వీలైతే పోరాటానికి లేదా తప్పించుకోడానికి సిద్ధపడేలా ఉద్విగ్నుడవుతాడు. ఫైట్ లేదా ఫ్లైట్ ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసేంతగా అతడి శరీరం ఉద్రేకపూరితమవుతుంది. నా అంతర్భాగం నుంచి వచ్చే కార్టిసాల్స్, అడ్రినలీన్, నార్-అడ్రినలిన్ అనే హార్మోన్లు అతడి రక్తప్రవాహంలోకి స్రవించడమే ఇందుకు కారణం. ఈ చర్యకు ప్రతిస్పందనగా అతడి కాలేయం రెడీ అవుతుంది. పోరాటానికో లేదా తప్పించుకుపోవడానికో అవసరమైన శక్తి అందించడానికి కాలేయం నుంచి చక్కెర స్రవిస్తుంది. ఆలా స్రవించిన చక్కెర వల్ల శరీరంలో శక్తి వెల్లువెత్తుంది.
క్రమంగా నార్మల్స్థితి కోసం...
అయితే అదే ఉద్విగ్న పరిస్థితి అదేపనిగా కొనసాగదు. ఇదే జరిగితే ఆనంద్ తన మృత్యువు వైపునకు పరుగుపెడతాడు. నాలోని అడ్రినల్ స్రావాలను ప్రేరేపించిన అంశమే అతడి మెదడులోని హైపోథలామస్నూ ప్రేరేపిస్తుంది. దాని నుంచి పిట్యుటరీ గ్రంథికీ, అక్కడి నుంచి మళ్లీ నాకు ఒక సందేశం అందుతుంది. పరిస్థితిని తన నియంత్రణలోకి తెచ్చుకొని క్రమంగా పరిస్థితులు మామూలు స్థితికి వచ్చేలా చేస్తాయి కొన్ని హార్మోన్లు.
సక్రమమైన పనికి సమతౌల్యమే ప్రధానం
నాలోని స్రావాలన్నీ అత్యంత సమతౌల్యంతో జరగాల్సిన అవసరం ఉంది. అలా సమతౌల్యంతో జరగకపోతే అది చాలా ప్రమాదం. నా అంతర్భాగం గాయపడి, అక్కడ ఉద్భవించాల్సిన హార్మోన్లు ప్రవించకపోతే ఆనంద్‌కు దాదాపు డజన్ వ్యాధులు ఒకేసారి వచ్చేస్తాయి. అతడిలో చర్మం నల్లబడుతుంది. కండరాలు చచ్చుబడిపోతుంటాయి. ఆకలి మందగిస్తుంది. వికారంగా ఉంటుంది. వాంతులూ అవుతాయి. నీళ్ల విరేచనాలు వస్తాయి. క్రమంగా ఆనంద్ నీరసించిపోయి మృత్యువాతపడతాడు. అయితే అదృష్టవశాత్తు ప్రస్తుతం అతడి పరిస్థితికేమీ ఢోకా లేదు. అతడిలోని అంతర్భాగం నశించిపోయినప్పుడూ... ఆ టైమ్‌లో బయటి నుంచి కూడా అవసరమైన హార్లోన్లు అందనప్పుడు మాత్రమే ఈ పరిస్థితి వస్తుంది.
నాలోంచి అవసరమైన స్రావాలు తగ్గినప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో... నాలోంచి పరిమితికి మించి హార్మోన్ స్రవించినా ఆనంద్‌కు అంతే హాని కలుగుతుంది. ఉదాహరణకు నాలోని అంతర్భాగం నుంచి స్రవించే కార్టిసాల్ అనే హార్మోన్ సూదిమొనంతటి పరిమాణంలో ఎక్కువైనా దేహంలో చక్కెర పాళ్లు ఎక్కువగా పెరిగిపోతాయి. ఆ పరిస్థితి ఆనంద్ కండరాలు చచ్చుబడిపోయేలా కూడా చేయవచ్చు. రక్తపోటు పెరుగుతుంది. శరీరంలోని కండరాలు నీరసించి పోతాయి. ఎముకల శక్తి సన్నగిల్లుతుంది. అదే అల్డోస్టెరాన్ అనే మరో హార్మోన్ ఎక్కువైతే ఒంట్లోంచి పొటాషియమ్ ఎక్కువగా బయటకు పోయి... సోడియమ్ (ఉప్పు) దేహంలో ఎక్కువగా మిగిలిపోతుంది. దాని వల్ల రక్తపోటు (బీపీ) పెరగడం జరుగుతుంది. ఎన్ని మందులు వాడినా ఆ రక్తపోటు తగ్గదు. అలాగే నార్-ఎడ్రినలీన్, ఎడ్రినల్ హార్మోన్లు ఎక్కువైతే తీవ్రమైన రక్తపోటు, తలనొప్పి, రక్తపోటు వల్ల మెదడులో, పొట్టలో రక్తస్రావం జరగవచ్చు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్తపోటు తీవ్రంగా పెరుగుతుంది. అతడి చేతులు, వేళ్లు వణుకుతాయి. వేలిచివర్లు మొద్దుబారిపోతాయి. తలనొప్పి వదలకుండా వస్తుంది. సాధారణంగా దేహంలో ట్యూమర్లు పెరిగినప్పుడు కూడా ఈ స్థితి వస్తుంది. అలాంటి స్థితి రాకుండా ఆనంద్ చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి.
ఏ విషయానికీ ఎక్కువగా దుఃఖించకూడదు. ఎవరిపట్లా తీవ్రమైన ద్వేషం కూడదు. ఎవరినీ అసహ్యించుకోవడం సరికాదు. మరీ పట్టరానంత అంటేంత కోపం వద్దు. మరీ స్థితప్రజ్ఞతతో కాకపోయినా కాస్త స్థిమితంగా ఉండాలి.
యాభై ఫ్యాక్టరీలకు సరిసమానం
చాలా కాలం క్రితం వరకూ నేనొక రహస్యాన్ని. నా గురించి పెద్దగా లోకానికి తెలియదు. అప్పటికి వాళ్లకు తెలిసన విషయం ఒక్కటే. నేను చాలా కీలకమైన గ్రంథిని. నన్నూ, నా పార్ట్నర్ను తొలగిస్తే రోజుల వ్యవధిలోనే ఆనంద్ చనిపోతాడు. నేను ఉత్పత్తి చేసే హార్మోన్లను బయటి నుంచి ఇస్తుంటే కొంతకాలం మాత్రం బతుకుతాడేమో! అదీ చాలా నీరసంగా... నిస్సత్తువగా. ఆ తర్వాత మెల్లగా నా గుట్టు మట్లు తెలుసుకోవడం ప్రారంభించారు. నా సైజ్‌కు నేను ఉత్పత్తి చేసే దాదాపు 50కి పైగా హార్మోన్లు స్రవించాలంటే అన్నే సంఖ్యలో కెమికల్ ఫ్యాక్టరీలు పెట్టాలి. వాళ్లకు నా గురించి తెలిశాక వాళ్లు గ్రహించిన విషయం ఏమిటంటే... నేను ఉత్పత్తి చేసే కార్టికో స్టెరాయిడ్ లాంటి స్రావాన్నే దాదాపు 100 కు పైగా వ్యాధుల్లో మందుగా ఇస్తారు. గౌట్ నుంచి మొదలుకొని ఆస్తమా వరకు అనేక వ్యాధులకు అదే మందు.
మరీ ముఖ్యమైన మూడు అంశాలు
నా బయటి పొర నుంచి స్రవించే హార్మోన్లను మూడు విభాగాలుగా చేయవచ్చు. మొదటి విభాగానికి చెందిన హార్మోన్లు కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లకు సంబంధించిన జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తాయి. రెండోవి ఆనంద్ దేహంలోని నీటి పాళ్లు, మినరల్స్ సమతౌల్యంగా ఉండేందుకు దోహదపడతాయి. ఇక మూడో విభాగానికి చెందినవి కీలకమైన సెక్స్ సంబంధించిన కార్యకలాపాలు కొనసాగేలా చూస్తాయి. ఇవన్నీ నిల్వ ఉంచేందుకు వీలుగాని హార్మోన్లు. అలా నిరంతరం పనిచేస్తుంటాయి. అంటే రెండు గంటల క్రితం నాలోంచి వెలువడ్డ స్రావాలు తొలగిపోయి ఇప్పటికప్పుడు తాజా (ఫ్రెష్) స్రావాలు వచ్చి చేరుతుంటాయి.
డాక్టర్ శ్రీదేవి కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదర్‌గూడ, హైదరాబాద్