గుడుంబాకు చెక్!
* కొత్త మద్యం పాలసీపై ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ నివేదిక
* వారంలోగా నూతన విధానం ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా నూతన మద్యం విధానంపై ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. మద్యం దుకాణాలను క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల ప్రాణాలకు హానిగా మారిన నాటుసారా(గుడుంబా)ను నిరోధించేందుకు తక్కువ ధర మద్యాన్ని (అఫర్డబుల్ లిక్కర్) ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి సూచించింది.
ఈ మేరకు తాజాగా ఎక్సైజ్ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్ సీఎంన కలసి నివేదిక అందజేశారు. వివిధ రాష్ట్రాల్లో మద్యం విధానంపై ఎక్సైజ్ అధికారులు అధ్యయనం చేసి ఇచ్చిన నివేదికల ఆధారంగా కొత్త మద్యం విధానం ప్రతిపాదనలు తయారు చేశారు. దీనిపై సమగ్ర రిపోర్టును సీఎంకు ఆయన అందజేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు ఆమోదయోగ్యమైన మద్యం విధానాన్ని తీసుకొస్తామని సీఎం కేసీఆర్ కూడా ప్రకటించారు.
దుకాణాల పెంపు యోచనలో ఎక్సైజ్ శాఖ
రాష్ట్రంలో ప్రస్తుతం 2,216 మద్యం దుకాణాలు (ఎ4 షాపులు) ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్, కార్పొరేషన్, మునిసిపాలిటీ, మండల కేంద్రం, గ్రామాల సమాహారం ప్రాతిపదికన ఆరు స్లాబుల్లో మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో వ్యాపారులకు లెసైన్స్‌లు అందిస్తున్నారు. అయితే ఒక ైవె న్షాపు పరిధిలో ఉన్న గ్రామాలు, బస్తీల్లో బెల్టుషాపులు విచ్చలవిడిగా వెలిసి, ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఈ నేపథ్యంలో 10 వేల జనాభాకు ఒక వైన్‌షాపు ప్రాతిపదికన ఈసారి మద్యం దుకాణాలను పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం.ఈ లెక్కన రాష్ట్రంలో దాదాపు 3,500 మద్యం దుకాణాలు తెరవాలన్నది ఎక్సైజ్ శాఖ ప్రణాళిక. లెసైన్స్ ఫీజు అధికంగా ఉన్నందున గ్రేటర్ పరిధిలోని 103 షాపులను వ్యాపారులెవరూ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో దుకాణాలను పెంచి లెసైన్స్ ఫీజును రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రత్యామ్నాయంగా చీపెస్ట్ లిక్కర్
ప్రస్తుతం వైన్‌షాపుల్లో కారు చౌక మద్యం పేరుతో రిటైలర్‌కు విక్రయిస్తున్న 180 మి.లీ. మద్యం కనీస ధర రూ.60, 90 మి.లీ. ధర రూ. 35గా ఉంది. ఇంత మొత్తాన్ని వెచ్చించలేని వారు రూ.20 లోపే లభించే గుడుంబా పాకెట్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో పర్యటించిన కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ అక్కడ లభ్యమవుతున్న దేశీ దారూ మద్యంపై అద్యయనం చేసి, 20 రూపాయలకే 90 మి.లీ. చీపెస్ట్ లిక్కర్‌ను అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన అంగీకరించినట్లు సమాచారం. ఈ మేరకు వారం రోజుల్లో కొత్త మద్యం విధానాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం.