‘బాపిరాజు వచ్చేసింది..
రియోద్‌లోని నరకకూపం నుంచి బయటపడింది
ఏఎస్పీ చొరవతో దుబాయ్ నుంచి అడ్డతీగల చేరుకున్న మహిళ
జీవనోపాధి కోసం సౌదీ అరేబియాలోని రియోద్ నగరానికి వెళ్లింది ఓ మహిళ. ఓ ట్రావెల్ ఏజెంట్ ద్వారా అక్కడ ఓ ఇంట్లో పనికి చేరింది. అయితే ఆ ఇంటి యజమానులు ఆమెకు తిండి పెట్టకపోవడమే కాక, గొడ్డుచాకిరీ చేయించుకునేవారు. ఇలా నాలుగు నెలలపాటు నరకయాతన అనుభవించిన ఆ మహిళ విషయాన్ని తన కుమారుడికి తెలిపింది. అతడు అడ్డతీగల పోలీస్ స్టేష¯Œæలో ఫిర్యాదు చేయడంతో రంపచోడవరం ఏఎస్పీ అడ్నాన్ నయీం హస్మీ స్పందించారు. నిర్బంధం చెర నుంచి ఆమెను విడిపించి ఆమె స్వస్థలానికి రప్పించారు. బాధితురాలిని మంగళవారం ఏఎస్పీ తన కార్యాలయంలో ఆమె బంధువులకు అప్పగించారు.
రంపచోడవరం :
‘‘బళ్ల బాపిరాజు అనే మహిళ జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లాలనుకుంది. అడ్డతీగల సమీపంలోని వేటమామిడి గ్రామానికి చెందిన సిద్ధూను సంప్రదించింది. అతడు ముంబయ్‌లో ఉంటున్న కాకినాడకు చెందిన లక్ష్మీ అనే ట్రావెల్ ఏజెంట్ ద్వారా బాపిరాజును రియోద్లో ఒకరి ఇంట్లో పనిచేసేందుకు పంపించారు. ఆ యాజమాని ఆమెకు సరైన వసతి, భోజనం కల్పించకుండా ఇంటి పనిచేయించుకునేవాడు. నాలుగు నెలలు పాటు పనిచేసింది. ఆరోగ్యం సరిగా లేకపోయినా నరకయాతన చూపిస్తూ ఒక స్టోర్ రూమ్‌లో నిర్బంధించారు. అక్కడ తాను పడుతున్న కష్టాలను ఫోన్ ద్వారా కుమారుడికి తెలిపింది. అతడి ఫిర్యాదు మేరకు అడ్డతీగల స్టేషన్లో కేసు నమోదు చేశాం’’ అని ఏఎస్పీ తెలిపారు.
ప్రత్యేక బృందం పర్యవేక్షణలో..
అడ్డతీగల సీఐ ముక్తేశ్వరరావును దర్యాప్తు అధికారిగా నియమించి, ఎస్సైతో పాటు ఇద్దరి సిబ్బందిని ముంబయికి పంపించారు ఏఎస్పీ ఆస్మీ. బాపిరాజును రియోద్ పంపించిన ట్రావెల్ ఏజెంట్ ఆఫీస్ ద్వారా పాస్‌పోర్ట్ ఆధారంగా అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఎంబసీ అధికారులతో మాట్లాడి బాధితురాలిని క్షేమంగా అడ్డతీగలకు తీసుకు వచ్చారు. కుమారుడు ప్రసాద్, బంధువులు మోహన్ సమక్షంలో బాధితురాలిని అప్పగించారు. ఈ కేసులో ట్రావెల్ ఏజెంట్ లక్ష్మీతో పాటు ఆమె తమ్ముడు రాజు, సిద్ధూలపై కేసు నమోదు చేసినట్టు ఏఎస్పీ తెలిపారు.
ఏజెంట్లను నమ్మిమోసపోవద్దు..
ఏజెంట్ల మాట నమ్మి ఉపాధి కోసం దేశం వదిలివెళ్లవద్దని ఏఎస్పీ నయీం ఆస్మీ సూచించారు. వయస్సు ఎక్కువ ఉన్న వారు అక్కడికి వెళ్లి ఏం పనిచేయ లేరని తెలిపారు. ఏజెన్సీ నుంచి ఉపాధి కోసం బయట దేశాలకు వెళ్లే వారు వారి వివరాలను, ఏజెంట్ చిరునామాను స్థానిక స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. తన తల్లిని క్షేమంగా ఇండియాకు రప్పించడంలో కృషి చేసిన ఏఎస్పీ నయీం ఆస్మీ, సీఐ ముక్తేశ్వరరావును బాధితురాలి బంధువులు సన్మానించారు.