ఎస్బీఐ ఏజీఎం సస్పెన్షన్
నగదు చెల్లింపుల్లో అక్రమాలే కారణం
తణుకు: పశ్చిమ గోదావరి జిల్లా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఏజీఎం) కేవీ కృష్ణారావుపై ఆర్బీఐ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు చెల్లింపుల్లో ఆర్బీఐ విధించిన నిబంధనల్ని బేఖాతరు చేయడంతోపాటు కొందరు నల్ల కుబేరులకు పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారం రోజులపాటు ఆర్బీఐ అధికారులు తణుకు ఎస్బీఐ శాఖలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
గత నెల 9, 10, 11 తేదీల్లో ఖాతాదారులకు చెల్లించిన నగదు విషయంలో నిబంధనలు పాటించలేదని తేలినట్టు సమాచారం. దీంతోపాటు పెద్ద మొత్తంలో నగదు మార్పిడి జరిగినట్టు విచారణలో తేలడంతోనే ఏజీఎం కృష్ణారావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ వ్యవహారంలో మరికొందరు అధికారులు, సిబ్బంది పాత్రపైనా ఆరా తీస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.