దళిత ఎంపిలను రెట్టింపు చేయడమే లక్ష్యం:ఏఐసీసీ ఎస్సి సెల్
హైదరాబాద్: దళిత ఎంపీల సంఖ్యను రెట్టింపు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం అని ఏఐసీసీ ఎస్సి సెల్ చైర్మన్ కొప్పుల రాజు చెప్పారు. ప్రధాన మేనిఫెస్టోకి అనుబంధంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం సబ్ మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు. ఆర్టీఐ, లోక్‌పాల్ బిల్లులు మాదిరిగా అవినీతిని నిర్మూలించేందుకు మరో మూడు బిల్లులను ఫిబ్రవరి పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సేవలు, ఫిర్యాదుల పరిష్కారం, న్యాయ జవాబుదారీతనం అంశాలపై కూడా బిల్లులను రూపొందిస్తున్నామని వివరించారు.
కాంగ్రెస్‌లో దళితులకు ఇక నుంచి అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ఎస్సీ కమిటీలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతోన్న ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ను జాతీయ స్థాయిలోనూ తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. దళితులను నమ్మించలేకపోవడం వల్లే యూపీలో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. అప్పడు బీఎస్పీని నమ్మిన ప్రజలు ఇప్పుడు వాస్తవాన్ని గ్రహించారని, అందుకే బీఎస్పీ ఓటు బ్యాంకు తగ్గిందని చెప్పారు. మంద కృష్ణ మాదిగ రాష్ట్రంలో కొత్తగా పెట్టిన పార్టీతో కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం ఉండదన్నారు.