‘ఠీవీ’గా పసిడి స్మగ్లింగ్
- టీవీలో ఆరు, సెల్‌ఫోన్ బాక్సు లోపల రెండు బంగారం బిస్కెట్లు
- జెడ్డా నుంచి తీసుకొచ్చిన క్యారియర్
సాక్షి, హైదరాబాద్: ఎల్ఈడీ టీవీ, సెల్‌ఫోన్ బాక్సు ల్లో కేజీ బంగారం తీసుకువచ్చిన హైదరాబాదీని శుక్రవారం కస్టమ్స్ అధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు పట్టుకున్నారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి శుక్రవారం జెడ్డా నుంచి బహ్రెయిన్ మీదుగా వచ్చే గల్ఫ్ ఎయిర్ విమానంలో శంషాబాద్ చేరుకున్నాడు. తనతో ఎల్ఈడీ టీవీని తీసుకువచ్చాడు. ఇతడిని క్యారియర్‌గా వాడుకుంటూ జెడ్డాలో టీవీ, సెల్‌ఫోన్ బాక్స్ అప్పగించిన ప్రధాన స్మగ్లర్లు వాటిలో 8 బంగారం బిస్కెట్లను దాచారు. టీవీలో సర్క్యూట్ బోర్డుకు కింది భాగంలో ఆరు బిస్కెట్లను కార్బన్ పేపర్లో చుట్టి దాచిపెట్టారు.
అలా చేస్తే కస్టమ్స్ అధికారులు స్కానింగ్ చేసినప్పుడు అది పసిడిగా గుర్తించలేరు. అయితే ఎల్ఈడీ టీవీలో పెద్ద బిస్కెట్ల సైజులో హెవీ మెటల్స్ ఉండవని, అదీ çసర్క్యూట్ బోర్డ్ కింది భాగంలో అసలే ఉండవని భావించిన అధికారులు దాన్ని విప్పిచూడగా ఆరు బిస్కెట్లు బయటపడ్డాయి. దీంతో ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు అతడి లగేజ్‌ని తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలోనే సెల్‌ఫోన్ బాక్సు లోపలి భాగంలో సెల్‌ఫోన్ కింద ఉంచిన మరో రెండు బిస్కెట్లు దొరికాయి.
మొత్తం స్వాధీనం చేసుకున్న పసిడి విలువ మార్కెట్లో రూ.27.83 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. తనకు ఈ రెండు వస్తువుల్నీ జెడ్డా విమానాశ్రయంలో కొందరు అప్పగించారని, హైదరాబాద్ చేరిన తర్వాత తమ వారు వచ్చి తీసుకువెళ్తారని చెప్పిన నేపథ్యంలోనే వాటిని తీసుకువచ్చానని కస్టమ్స్ విచారణలో హైదరాబాదీ బయటపెట్టాడు. దీంతో అసలు సూత్రధారుల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు.