ఏ నిమిషానికి ఏమి జరుగునో..?
భోగాపురం: ఎయిర్పోర్టు సర్వేపై ఏ క్షణానికి ఏమవుతుందో? ఏమోనని భోగాపురం మండల ప్రజల్లో సందిగ్థం మొదలైంది. మంగళవారం కవులవాడ రెవెన్యూలో సమ్మతి తెలపని జిరాయితీ భూముల్లో చేస్తున్న సర్వేను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో తహసీల్దారు లక్ష్మారెడ్డి, ఎస్ఐ దీనబంధులు గ్రామానికి చేరుకుని వారికి నయానో, భయాన్నో సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు.
అయినా వారు వినిపించుకోలేదు. కోర్టులో ఉన్న భూమికి ఏవిధంగా సర్వే నిర్వహిస్తారని అడ్డుకోవడంతో వారికి అధికారులు ఒక రోజు సమయం ఇచ్చారు. బుధవారం అంతా కలిసి మాట్లాడుకుని సర్వేకి సహకరిస్తారో లేదో చెప్పండి, సర్వేకి సహకరిస్తే అందరికీ మంచిది. లేదని అడ్డుకుంటే అడ్డుకున్నవారిపై కేసులు నమోదు చేసైనా పని చేసుకుపోతామని అధికారులు హెచ్చరించారు. అయితే మంగళవారం మధ్యాహ్నం సీఐ వైకుంఠరావు, ఎస్ఐ దీనబంధులతో తహసీల్దారు కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాసమూర్తి, తహసీల్దారు లక్ష్మారెడ్డిలు సమావేశమయ్యారు.
ఏం మాట్లాడారో తెలియదు కానీ బుధవారం ఉదయమే మండల కేంద్రానికి అదనపు బలగాలు(సీఆర్పీ, పోలీసు సిబ్బంది) వ్యాను ద్వారా చేరుకున్నాయి. అయితే ఉదయం నుంచి భారీ వర్షం కురవడంతో సర్వే సాగకపోవడంతో వారంతా మండల కేంద్రంలోనే ఉండి వెనుకముఖం పట్టారు. అధికారులు ఇచ్చిన ఒక్కరోజు గడువు గురువారంతో ముగియనుండడంతో కవులవాడ రెవెన్యూపరిధిలో గురువారం ఏవిధమైన పరిస్థితి నెలకొంటుందోనని ప్రజల్లో అనుమానంతో ఉన్నారు.