విశాఖ ఫస్ట్ చాయిస్ లేదంటే విజయనగరమే సేఫ్
విజయనగరం కంటోన్మెంట్ : సార్! మా పిల్లలు వైజాగ్లో చదువుతున్నారు. మా బంధువులంతా విశాఖవాసులే! నాకు అక్కడికి బదిలీ అయ్యేలా ఓ మాట చెప్పండి!!....ఉన్నతాధికారికి ఓ అధికారి వేడుకోలు. లేదయ్యా! నీకు అక్కడ ప్లేస్ లేదు. అక్కడి పోస్టుకు ఆల్రెడీ ఒకాయన ఎంపీగారితో చెప్పిం చారు. నర్సీపట్నం ఖాళీగా ఉంది, వెళ్లిపోతావా?... ఉన్నతాధికారి సమాధానం అమ్మో వద్దు సార్! అయితే వైజాగ్ ఇవ్వండి! లేదంటే ఇక్కడే ఉండిపోతా! అంటూ అధికారి రిక్వస్ట్... ఇప్పుడు జిల్లాలో ఏ కార్యాలయానికి వెళ్లినా ఇవే డైలాగులు విని పిస్తున్నాయి.
బదిలీలకు ప్రభుత్వం ఇచ్చిన గడువు దగ్గర పడుతుండడంతో ఎవరికి వారు తమకు కావలసిన స్థానాలను వెతుక్కుంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి విశాఖ సిటీ మీదే ఉంది. పిల్లలు చదువుకుం టున్నారని కొందరు, బంధువులంతా అక్కడే ఉన్నారని మరికొందరు, సొంత ఇల్లు ఉంది అక్కడికి పంపండని ఇంకొందరు ఉన్నతాధికారులను వేడుకొంటున్నారు. వీలైతే రాజకీయ నేతలతో సిఫారసులు చేయించుకుంటున్నారు.
విశాఖే ఎందుకు..?
ఇంతవరకూ జిల్లా ఉన్నతాధికారులే విశాఖను కోరుకుంటున్నారని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు కింద క్యాడర్ అధికారులు కూడా విశాఖ వెళ్లేందుకు యత్నిస్తున్నారు. అక్కడ ఉన్నత విద్య, వైద్య సదుపాయాలు, రవాణా సదుపాయాలు అధికంగా ఉండడంతో విశాఖ సిటీపై అందరూ మోజు చూపుతున్నారు. విశాఖకు వెళ్లే ఛాన్స్ లేకపోతే విజయనగరమే సేఫ్ అని భావిస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి విశాఖపట్నంకేవలం 50కిలోమీటర్ల దూరంలో ఉండడంతో షటిల్ సర్వీస్ చేసేందుకు అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఉన్నతాధికారుల నుం చి కిందిస్థాయి ఉద్యోగుల వరకూ ఈ రెండింటిలో ఏదో ఒక దానికిలో ఉండాలని ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసి దాదాపు నెల రోజు లవుతోంది. ఇంకా బదిలీలకు 12రోజులే గడువుండడంతో ఇటు జిల్లా యం త్రాంగం కసరత్తు ముమ్మరం చే సింది.
ఇప్పటికే మూడేళ్ల పాటు పనిచేసిన వారి జా బితా, సక్రమంగా పనిచేయని వారి జాబితాలు వేర్వేరుగా సిద్ధం చేసినట్టు తెలిసిం ది. ఇటీవలవరకూ బదిలీలపై పైరవీలు, ప్రచారాలు జోరుగా సాగినా ప్రస్తుతం ఎవరూ బయటపడడంలేదు. జోరుగా సాగుతున్న ఆధార్ అనుసంధాన ప్రక్రియలో తలమునకలై ఉండడం ఒక కారణం కాగా, మరో పక్క అమ్మవారి పండగ దగ్గరపడుతుండడంతో ఆ ఏర్పాట్లపై సమీక్షలు, సమావేశాలూ జరుగుతుండడంతో బదిలీలపై లోలోపల ప్రయత్నాలు సాగుతున్నాయి. జిల్లాలోని కొందరు అధికారులకు బదిలీలు తప్పవన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఏజేసీ నాగేశ్వరరావు, డీఆర్వో హేమసుందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ హెచ్వి ప్రసాదరావుతో పాటు పలువురు జిల్లా అధికారులకు బదిలీలు జరుగుతాయని భావిస్తున్నారు. మరికొందరు వారే స్వయంగా బదిలీలకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
పైరవీలే దిక్కు...
అయితే జిల్లా స్థాయి అధికారులకు బదిలీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ లేకపోవడంతో పైరవీలే దిక్కు అన్నట్టు ప్రచారం సాగుతోంది. జిల్లా అధికారులకు కూడా కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరుతూ వినతిపత్రాలు అందించామనీ, ముఖ్యమంత్రితో ఈ విషయమై మాట్లాడామనీ కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. అయితే ఉన్నతాధికారులకు కౌన్సెలింగ్ ప్రక్రియ అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
జిల్లాలో ఉండేందుకు యత్నాలు
కోరుకున్న చోటు దొరకనప్పుడు చాలా దూరం వెళ్లి ప్రయాసకు గురయ్యే బదులు అధికారులు, ప్రజా ప్రతినిధులు పరిచయమున్న ఈ జిల్లాలో ఉండేలా చాలా మం ది యత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు పైరవీలు సాగిస్తున్నారు. ఇప్పటికే పలువురు జిల్లా అధికారులు సెలవు పెట్టి మరీ హైదరాబాద్ వెళ్లినట్టు భోగట్టా! వారిలో కొంత మంది తిరిగి వచ్చి విధుల్లో చేరిపోయారు కూడా! ఈ విషయమై వారి వద్ద ప్రస్తావిస్తే నవ్వే సమాధానంగా వస్తోంది.