వారికి వ్యతిరేకంగా ఆధారాల్లేవ్!!
జైపూర్: అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసులో సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్, ఆరెస్సెస్ సీనియర్ నేత ఇంద్రేష్ కుమార్ సహా నలుగురు నిందితులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) క్లీన్చిట్ ఇచ్చింది. 2007లో జరిగిన అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసులో దర్యాప్తును ముగిస్తున్నట్టు నివేదికను జైపూర్‌లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. నలుగురు నిందితులకు వ్యతిరేకంగా తగినంతగా ఆధారాలు సేకరించలేకపోయామని, అందుకే వారికి వ్యతిరేకంగా కేసును మూసివేస్తున్నామని ఎన్ఐఏ తెలిపింది.
సాధ్వీ, ఇంద్రేష్‌కుమార్ సహా నిందితులు ప్రిన్స్, రాజేంద్రకు వ్యతిరేకంగా కేసును మూసివేస్తూ ఎన్ఐఏ నివేదిక సమర్పించిందని, ఈ నివేదికను అంగీకరించాలా? వద్దా? అనేది ఏప్రిల్ 17న ప్రత్యేక కోర్టు నిర్ణయించనుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశ్వినీ శర్మ తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సందీప్ దంగే, సురేశ్ నాయర్, రాంచద్ర కల్సంగ్రా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారిని అరెస్టు చేయడంలో ఎన్ఐఏ అశక్తత వ్యక్తం చేయడంతో ఈ కేసు విచారిస్తున్న జడ్జి దినేశ్ గుప్తా ఎన్ఐఏ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 2007 అక్టోబర్‌లో ప్రముఖ సుఫీ దర్గా అయిన అజ్మీర్‌లో జరిగిన పేలుడులో ముగ్గురు మృతిచెందగా, 17 మంది గాయపడ్డారు.