ముగ్గురు దొంగలు... మల్లికా షెరావత్...
‘మన్మథుడు’ చూసిన వారందరికీ ఆ సీన్ గుర్తుండే ఉంటుంది. అందులో బ్రహ్మానందం ప్యారిస్‌లో ఉంటాడు. నాగార్జున, సోనాలీ బెంద్రే అక్కడకు వెళ్లినప్పుడు ‘ఇది ప్యారిస్... ఇండియాను టేప్రికార్డర్లో పెట్టి 50 సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ నొక్కితే ఎలా ఉంటుందో ప్యారిస్ అలా ఉంటుంది’ అని గొప్పలు చెబుతుంటాడు. కాని ఆ ప్యారిస్‌లోనే కళ్లు మూసి తెరిచేంతలో అతని సూట్‌కేస్ కొట్టేస్తారు. జేబులో డబ్బులు లేక నాగార్జున, సోనాలీ అవస్థలు పడతారు. ప్యారిస్ గొప్పదనం అంతటితో మురుగు కాలవలో కలిసిపోతుంది. కాని నిజ జీవితంలో కూడా ప్యారిస్‌లో దొంగల బెడద ఎక్కువగానే ఉందని ఇటీవల మల్లికా షెరావత్ మీద జరిగిన దాడితో అర్థమవుతోంది. భారతీయ వెండితెర మీద సెక్స్‌బాంబ్‌గా ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం సెలబ్రిటీ హోదాలో అమెరికా, ప్యారిస్, ఇండియాల మధ్య చక్కర్లు కొడుతున్న మల్లికా షెరావత్ మీద గత వారం దొంగల దాడి జరిగింది.
ఆమె బాయ్‌ఫ్రెండ్, ప్యారిస్‌లో రియల్టర్‌గా పలుకుపడి ఉన్న సిరిల్ ఆక్సన్ ఫాన్స్‌తో ఆమె మొన్నటి గురువారం రాత్రి తొమ్మిదిన్నరకు ఫ్లాట్‌కు చేరుకుని లోపలికెళుతుండగా హఠాత్తుగా ఊడిపడిన ముగ్గురు దొంగలు ఒక్క మాటా మాట్లాడ కుండా మొదట టియర్ గ్యాస్ చల్లి, ఆ వెంటనే ముష్టిఘాతాలు కురిపించి మాయమయ్యారు. నిజానికి వాళ్లు ఏదో ఒకటి దోచుకుని వెళ్లి ఉండవచ్చు. అయితే అలాంటి పని జరగలేదు. దాడి జరిగిన తర్వాత ఈ విషయాన్ని సోషల్ మాధ్యమం ద్వారా వివరిస్తూ మల్లిక ‘ఆ ముగ్గురినీ ఎదిరించాను. నన్ను బెదరగొట్టడం వాళ్లకు సాధ్యం కాలేదు. నేను మీరు ఊహించి నంత సుకుమారిని కాను. గట్టి స్త్రీని’ అని కామెంట్ చేసింది. పోలీసులు ఈ కేసును విచారణ చేస్తుంటే ‘ఇదేమిటీ ఇలా అయింది’ అని ప్యారిస్‌లోనే బిక్కచచ్చి కూర్చోక తన కార్యక్రమాల్లో తానుంది మల్లిక. ప్రస్తుతం ఆమె స్విట్జర్లాండ్‌లో విహారాన్ని ఆస్వాదిస్తోంది. ‘భారతదేశంలో నాకు ఊపిరాడదు. అక్కడ స్త్రీలు అణిగిమణిగి ఉండాలి. వాళ్ల ప్రతి కదలికపై అదుపు ఉంటుంది’ అని విసుక్కునే మల్లిక ముంబైలో గడిపే రోజుల కంటే బయట దేశాల్లో గడిపే రోజులే ఎక్కువ.