ఆల్ ఫ్రీ
కవర్ స్టోరీ
సెప్టెంబర్ 15 అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా...
హామీలు నిలబెట్టుకోకపోతే... ప్రజాస్వామ్యం ఎలా నిలబడుతుంది?
ఎన్నికల రుతువు వస్తే చాలు, భారత రాజకీయ వినీలాకాశం నిండా వాగ్దానాల మేఘాలు దట్టంగా అలుముకుంటాయి. వాటిలో కురిసేవి కొన్నే. అవైనా చిరుజల్లులతో సరిపెట్టడం పరిపాటి. ఇంతవరకు భారతదేశం ఎన్నో ఎన్నికలు చూసింది. మరెన్నో రాజకీయ పార్టీలు పుట్టాయి, గిట్టాయి.
అసలు ఎన్నికల కోసమే పురుడు పోసుకునే రాజకీయ పార్టీలు ఉన్న దేశంలో, అవి విడుదల చేసే మ్యానిఫెస్టోలకీ, వాటిలో ఆదరాబాదరా వండి వార్చిన వాగ్దానాలకీ ఉన్న విలువ ఏపాటిదో అర్థం చేసుకోవడం కష్టం కాదు. చాలా రాజకీయ పార్టీలకు మ్యానిఫెస్టోల తయారీ ఓ ఎన్నికల తంతు. తరువాత వాటి చిరునామా చెత్తబుట్టే. ఎక్కువ పార్టీలు; జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కూడా కావచ్చు- చాలా వరకు అవి కురిపించే వాగ్దానాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రహసనం. అధికార పార్టీల ఎన్నికల వాగ్దాన భంగం ఒక్కటే భారతంలో శాశ్వత సత్యం. ప్రజాప్రతినిధుల ఎంపిక స్వేచ్ఛని ఫ్రీబీలతో కొనుగోలు చేయడం ఒక వాస్తవం. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు ఈ సత్యమే పరిఢవిల్లుతోంది.
ఇంతకీ అధికారంలోకి వచ్చి తీరాలన్న తపనలో మన రాజకీయ పార్టీలు ఇస్తున్న వాగ్దానాలు ఎలా ఉంటున్నాయి? అవన్నీ గగన పుష్పాలను తలపింపచేస్తున్నాయి. 2014 పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేసిన నరేంద్ర మోదీ ఒక వాగ్దానం చేశారు. పార్టీ గెలిచి, ఆయన ప్రధానిగా పదవీ స్వీకారం చేస్తే ‘వంద రోజులలో’ విదేశాలలో ఉన్న యావత్తు నల్లధనాన్ని భారతదేశానికి తరలించగలమన్నదే ఆ వాగ్దానం సారాంశం. దానిని అమలు చేయడం అంత సులభం కాదని మోదీకి తెలియనిది కాదు. అయినా అక్కడితో ఆగకుండా ఆ డబ్బు రప్పించి, భారతీయుల బ్యాంకు ఖాతాలలో తలా ఒక పదిహేను లక్షల వంతున జమ చేస్తానని ప్రకటించారు.
దీనితో తాజాగా రాజస్థాన్‌కి చెందిన కన్హయ్‌లాల్ అనే పౌరుడు, తన బ్యాంకు ఖాతాలో సదరు పదిహేను లక్షలు ఎప్పుడు జమ అవుతాయో తెలియచేయవలసిందంటూ సమాచార హక్కు చట్టం కింద కోరడం కూడా జరిగిపోయింది. దీనికి సమాధానం ఏమిటి? ప్రధాని ఏమని వివరణ ఇస్తారు? ఎవరైనా ఎలా స్పందిస్తారు? ఇది చాలు, ఎన్నికల వాగ్దానాలలోని డొల్లతనం ఎలాంటిదో తెలియడానికి! ఇక ఫ్రీబీల సంగతి చెప్పేదేముంది? గడచిన ఎన్నికలలో గోరక్షణ హామీ బీజేపీ ప్రధానాస్త్రాలలో, ప్రచారాస్త్రాలలో ఒకటి. నిజానికి దేశంలో ఎక్కువ రాష్ట్రాలలో గోవధ నిషేధం చిరకాలంగా ఉంది. మరి ఇలాంటి హామీ ఇవ్వడంలో పరమార్థం ఏమిటి?
వీరంతా వాగ్దానకర్ణులే...
నవ్యాంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడానికి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన వాగ్దానాలు కూడా తక్కువేమీ కాదు. తమిళనాట ద్రవిడ పార్టీల వికృత దాతృత్వంతో పోటీపడుతూ ఆయన వాగ్దానాల కుంభవృష్టి కురిపించారు. వీటి గురించి తరువాత చర్చించుకుందాం.
‘మొన్నటి శాసనసభ ఎన్నికలలో మీ నాయకత్వంలోని అన్నాడీఎంకే పార్టీ మ్యానిఫెస్టో రూపకల్పన కోడ్‌కు అతీతంగా ఉంది, అందులో వివేచనే లేదు.’ ఇది అన్నాడీఎంకే నాయకురాలు జయలలిత మీద ఆమె ఆగర్భశత్రువు కరుణానిధి చేసిన విమర్శలా కనిపిస్తుంది. కానీ కాదు. సాక్షాత్తు కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఆగస్టు 30న జారీ చేసిన తాఖీదులో మాటలే ఇవి. అయితే ఈ ఘాటు హెచ్చరికకి కరుణానిధి ఎగిరి గంతేసే వీలు లేకపోయింది.
ఆయన చక్రాల కుర్చీకే పరిమితం కావడం ఇందుకు కారణం కాదు. ‘మ్యానిఫెస్టోల తయారీలో ఎన్నికల కమిషన్ రూపొందించిన నిబంధనావళి అంటూ ఒకటి ఉంది. ఆ సంగతి మీకు గుర్తు లేదా?’ అంటూ డీఎంకే నేతకు అంతకు ముందే కేంద్ర ఎన్నికల సంఘం అక్షింతలు వేసింది. తమిళనాడు అంటే ఫ్రీబీ (తాయిలాలకి) కళకి నిలయమని 2006 ఎన్నికల సమయంలోనే కీర్తిప్రతిష్టలు సంపాదించుకుంది. అసలు ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయ పార్టీలూ, వాటి నేతల నోటి నుంచీ వెల్లువెత్తే వాగ్దానాల పరవళ్లను, మ్యానిఫెస్టోలలో కనిపించే హామీల సునామీలను గమనిస్తే ఎవరికైనా గుండె చెరువైపోతుంది.
దేశం పేరునే మారుస్తానన్నాడు...
తమిళనాడులోనే ఎండీఎంకే అనే పార్టీ ఉంది. వైకో దీని అధినాయకుడు. సుదీర్ఘ అనుభవం కలిగిన నేత. ఆయన పార్టీ ఇచ్చిన వాగ్దానం- భారతదేశం పేరును ‘ది యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ భారత్’గా మార్చడం. ఒక చిన్న ప్రాంతీయ పార్టీ, ఎప్పుడూ ఏదో ఒక పెద్ద పార్టీకి తోకలా ఉండే పార్టీ ఇలాంటి వాగ్దానం ఇచ్చింది. దేశం పేరు మార్పు ఒక చిన్న రాజకీయ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో దర్శనమివ్వడం మన ప్రజాస్వామ్యం చేసుకున్న ప్రారబ్ధం కాక మరేమిటి?
వాగ్దానాల అమలుకు వనరులెక్కడివి?
ఈ వాగ్దానాల ధాటికి తట్టుకోలేక ఒక ఐఏఎస్ అధికారి, మరో ముగ్గురు కలసి ఎన్నికల సంఘానికి మొర పెట్టుకున్నారు. దీని ఫలితంగానే అన్నాడీఎంకే మ్యానిఫెస్టోలో హేతుబద్ధత ఏమైనా ఉందా? అని ఎన్నికల సంఘం ప్రశ్నించవలసివచ్చింది. వందల కోట్లు కుమ్మరిస్తే తప్ప నెరవేర్చడం సాధ్యం కాని ఈ వాగ్దానాల అమలుకు వనరులు ఎక్కడివో ఎందుకు చెప్పరు అని నిలదీసింది. ‘సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తాం’, ‘ ఆది ద్రవిడ, గిరిజన సంక్షేమ వసతి గృహాలకి వాషింగ్ మెషీన్లు, ఇడ్లీ కుక్కర్లు, స్టీమ్ బాయిలర్లు ఉచితంగా ఇస్తాం’, ‘సంక్రాంతి పండుగ సందర్భంగా రేషన్ కార్డులు ఉన్నవారందరికీ చేనేత, కోఆప్టెక్స్ దుస్తులు కొనుక్కోవడానికి రూ. 500 చెక్కుల రూపేణా బహూకరిస్తాం’, ‘పేద మధ్య తరగతి ప్రజలందరికీ అమ్మ బ్యాంకింగ్ కార్డులు జారీ చేస్తాం’- ఇలా ఉన్నాయి అన్నాడీఎంకే వాగ్దానాలు.
ఇక విపక్ష డీఎంకే ప్రైవేటు రంగంలో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను సమర్థిస్తామని ప్రకటించింది. విదేశాలలో తమిళులు అధికంగా ఉంటే ‘అర్హులైన’ తమిళులనే అక్కడ భారత ప్రతినిధులుగా నియమిస్తామని హామీ ఇచ్చింది. కంప్యూటర్లు, లాప్‌ట్యాప్‌లు ఇస్తామని రెండు ప్రధాన ద్రవిడ పార్టీలు పోటీ పడి చెప్పినా, ‘అమ్మ’ అదనంగా రాష్ట్ర ఓటర్లందరికీ (దాదాపు రెండు కోట్లు) సెల్ఫోన్లు అనుగ్రహిస్తున్నానని వరం ఇచ్చారు.
విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లతో పాటు, నిరంతరాయంగా ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పిస్తానని చెప్పారామె. ఉపయోగించుకుంటే వైఫై కూడా ఇస్తానన్నారు. వధువులకు ఉచిత తాళిబొట్లు, ఉద్యోగినులు ద్విచక్రవాహనం కొనుగోలు చేస్తే యాభైశాతం రాయితీ కల్పించడం వంటి హామీలు కూడా ఆమె ఇచ్చారు. డీఎండీకే అనే పార్టీకి విజయకాంత్ అనే సినీనటుడు నాయకుడు. ఈయన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తానని ఎలుగెత్తి చాటాడు. అంతేనా! రాష్ట్ర వ్యాప్తంగా 5000 మంది రైతులను ఎంపిక చేసి, వారికి విదేశాలలో శిక్షణ ఇప్పిస్తానని కూడా హామీ ఇచ్చాడు.
దేశం పేరు మారుస్తానన్నఎండీఎంకే, ఇంకో అడుగు ముందుకు వేసి ఎల్టీటీఈ మీద నిషేధాన్ని ఎత్తివేస్తామని హామీ ఇచ్చేసింది. ఈ తాయిలాల పందేరం మీద ఎస్. సుబ్రహ్మణ్య బాలాజీ అనే తమిళుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యాజ్యం మీద అత్యున్నత న్యాయస్థానం తీవ్ర స్వరంతో చేసిన వ్యాఖ్య గమనార్హం. ఇదీ ఆ వ్యాఖ్య - ‘ఈ తాయిలాలు స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల వ్యవస్థ మూలాలను ధ్వంసం చేస్తాయి.’ ప్రభుత్వం కలర్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మిక్సర్ గ్రైండర్లు ఇస్తుందంటే అర్థం ఏమిటి? ప్రస్తుత చట్టాల మేరకైనా ఇదంతా ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమేనని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది.
హామీలివ్వడం పార్టీల హక్కు...
అయితే రాజకీయ పక్షాలు గుప్పించే హామీలను మోసుకొచ్చే మ్యానిఫెస్టోలను కట్టడి చేసే అవకాశం ప్రస్తుతానికి లేదు. 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 123 సెక్షన్ ప్రకారం మ్యానిఫెస్టోల ద్వారా హామీలు ఇచ్చే హక్కు రాజకీయ పార్టీలకు రాజ్యాంగ నిర్మాతలు కట్టబెట్టారు. దానిని ప్రస్తుత తరంలో చాలామంది నేతలు దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు. మ్యానిఫెస్టోల అసలు ఉద్దేశం- ఓటరుని మభ్యపెట్టడం కాదు. పార్టీల ఆలోచనా ధోరణిని ఆవిష్కరించడం. కానీ అలాంటి ఉత్తమ సంప్రదాయానికి చాలా రాజకీయ పార్టీలు ఏనాడో స్వస్తి పలికాయి.
కాబట్టి ఇప్పటికైనా ఈ ధోరణిని అదుపు చేసేందుకు నిబంధనలను రూపొందించవలసిందిగా సుప్రీంకోర్టు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. ఇది ప్రజాస్వామ్యానికి శుభ పరిణామం. కానీ ఇలాంటి హితవచనాలను సానుకూల దృష్టితో చూడగలిగిన నాయకులు ఎందరు? చాలామంది నేతల గత చరిత్రను చూసినా, గతంలో లేదా ఇప్పుడు అధికారంలో ఉండగా వారు చూపిన, చూపుతున్న అహంకారం, లీలల గురించి తలుచుకున్నా వారికి హితవచనాల పట్ల, ప్రజాస్వామ్య శ్రేయస్సు పట్ల గౌరవం ఉందని భావించడం దండగ.
బాబుగారి వాగ్దానశూరత్వం...
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వంటివారి విషయంలో ఇది నిజం. రియో ఒలింపిక్స్‌లో రజతపతకం గెలుచుకు వచ్చిన సింధు సత్కార సభలో ఆయన ఏమన్నారు? మనం కూడా త్వరలో కొత్త రాజధాని అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిద్దాం అంటూ ఒక బీభత్సమైన వాగ్దానాన్ని సంధించారాయన. ఇది ఎన్నికల వాగ్దానానికి మించిన వాగ్దానం. ఒలింపిక్స్ క్రీడావేదికను ఎవరు నిర్ధారిస్తారు? ఎంతకాలం ముందు నుంచి అందుకు కసరత్తు జరుగుతుంది? ఇవి తెలియని ముఖ్యమంత్రి ఉచితంగా ఆ హామీ పడేశారు. ఒలింపిక్స్ సంగతెలా ఉన్నా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆయన ఆంధ్రప్రదేశ్‌ను బంతాడుకుంటున్నారు.
2014 శాసనసభ ఎన్నికలలో రైతు రుణాలను ‘బేషరతుగా’ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని కూడా అన్నారు. ఇవన్నీ నెరవేర్చేందుకు- అవసరమయ్యే నిధులు వందలకోట్ల రూపాయలు పైనే. సుప్రీంకోర్టు ఆదేశం కాకపోవచ్చు, అలాంటి అభిప్రాయాన్ని గౌరవించాలని భావించే ఏ నేతయినా ఇలాంటి హామీ ఇవ్వలేరు. ఇవ్వరు. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనను మించి ఈ హామీల ఖర్చు కనిపిస్తున్నదని నిపుణులు వెల్లడించిన వాస్తవం. జాబు రావాలంటే బాబు రావాలన్నది మరొక నినాదం. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతిగా రూ. 2,000 ఇస్తామన్నది మరొక హామీ.
హామీలు కురిపించడంలో నాలుకకు నరంలేని రీతిలో వ్యవహరించారు చంద్రబాబు. ఏ వర్గాన్నీ విడవకుండా వారి కోసం రకరకాల హామీలు సృష్టించారు. పదవి చేపట్టిన ఆరు మాసాలలో కాపు వర్గానికి బీసీ హోదా ఇస్తానని ఢంకా బజాయించారు. రజకులను ఎస్సీ వర్గంలో చేర్పిస్తామన్నది మరొక తాయిలం. ఆయన వందలాది హామీలను వర్షించారు. అయితే అధికారంలోకి వచ్చాక వాటిలో అమలైనవి ఎన్ని? పంజాబ్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, దక్షిణాదిన కర్ణాటక కూడా రుణ మాఫీని ప్రకటించాయి. ఎక్కడా పరిపూర్ణంగా అమలు కాలేదు.
అందరూ అందరే...
చాలా ప్రాంతీయ పార్టీలు; కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలు కూడా దాదాపు అసాధ్యమైన చాలా అంశాల మీద హామీలు ఇవ్వడం కనిపిస్తుంది. మద్యం అమ్మకాలను జాతీయం చే సి, దుకాణాలను పరిమితం చేస్తామని లోక్‌సత్తా పార్టీ ప్రకటించింది. హిందూ మహాసముద్రంలోని డిగోగార్షియా సైనిక కేంద్రం నుంచి అమెరికా అణ్వాయుధాలను ఉపసంహరించాలని కోరతామని సీపీఎం తన మ్యానిఫెస్టోలో పేర్కొన్నది. కేజ్రీవాల్ గారి ‘ఆప్’ అవినీతిని కూకటి వే ళ్లతో పెళ్లగిస్తామని హామీ ఇచ్చింది. దురదృష్టం ఏమిటంటే, ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అవినీతి కేసులలో అరెస్టవుతున్నారు.
పార్టీ టికెట్లు అమ్ముకున్న ఆరోపణతో ‘ఆప్’ పంజాబ్ శాఖ చీఫ్‌ను ఈ మధ్యనే తొలగించారు. ‘అసలు మేం మ్యానిఫెస్టోలనే విడుదల చేయం, ఆ పేరుతో చేసే హామీలను మించి మేం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, పసలేని హామీలు ఇవ్వడం కంటే, ప్రజాభివృద్ధి మీదే మాకు గట్టి నమ్మకం’ అంటూ 2014 ఎన్నికల సమయంలో మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ ప్రకటించడం ఈ అంశానికి ఒక కొసమెరుపు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు ఉచితంగా ఇస్తానని తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలు చెప్పేశాయి. కానీ ఆ వస్తువులను విద్యార్థులకు రాయితీతో కటాక్షించగలమని ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీ చెప్పింది.
గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఇంటికి ఒక పాలిచ్చే ఆవును ఇస్తామని కూడా ఆ పార్టీ ప్రకటించింది. 65 ఏళ్లు దాటిన మధ్య తరగతి, చిన్నకారు రైతులకు పింఛను ఇస్తామని కూడా చెప్పింది. ఆ రాష్ట్రంలో మరో ప్రధాన రాజకీయ పక్షం సమాజ్‌వాదీ పార్టీ మాత్రం తాను అధికారంలోకి (2007 నాటి సంగతి) వస్తే ప్లస్ టెన్ ఉత్తీర్ణుడైన విద్యార్థికి ఒక లాప్‌ట్యాప్, టెన్త్ ఉత్తీర్ణుడైతే టాబ్లెట్ కంప్యూటర్ ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చింది. అట్టడుగున ఉన్న, ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్న వర్గాల కోసం విద్య, వైద్యం, వారి ఆహార భద్రతకు ఉపకరించే బియ్యం పథకం వంటివి ఆహ్వానించదగినవే. వాటిని ప్రవేశపెట్టిన ప్రభుత్వాలు, పార్టీలు మారి, కొత్త పార్టీలు, సర్కార్లు అధికారంలోకి వచ్చినా వాటిని కొనసాగించడం ఒక చరిత్ర.
అలాగే ఇలాంటి హామీలను, తాయిలాలను మొత్తం రాజకీయనాయకులంతా సమర్ధిస్తున్నారని కూడా చెప్పలేం. కానీ గ్రైండర్లు, లాప్‌ట్యాప్‌లు, ఫోన్లు, ఫ్యాన్లు ఉచితంగా ఇస్తామనడం అనాలోచిత చర్య. ఇవన్నీ ఓట్లు దండుకోవడానికి ఇచ్చే తాయిలాలు. ఇక పోలింగ్ నాటి ప్రలోభాలైతే... అవి సాక్షాత్తు లంచాలు. ఎన్నికల సమయంలో, పార్టీ మ్యానిఫెస్టోలలో ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేయకపోవడం, అమలు చేయకుండా సాకులు చూపడం, అసలు మరచిపోవడం అంటే ప్రజాస్వామ్యానికి ఒక పార్టీ చేసే అతి పెద్ద ద్రోహం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా ప్రకటించుకోగలిగిన భారతదేశంలో, ప్రజాస్వామ్య వ్యవ స్థను నిరంతరం సజీవంగా ఉంచగలిగిన ఎన్నికల వ్యవస్థను ఫ్రీబీల బజారులో అమ్మకానికి పెట్టడం చారిత్రక ద్రోహం.
2011 శాసనసభ ఎన్నికలలో తమిళనాడులో 70 శాతం ఓటర్లు తాము అందుకున్న తాయిలాల గురించీ, పోలింగ్ రోజున దక్కిన లంచాల గురించీ బాహాటంగా చెప్పడమే రాజకీయ పార్టీల ద్వారా, నాయకుల ద్వారా ప్రజాస్వామ్యానికి జరుగుతున్న అలాంటి ద్రోహాన్ని తిరుగులేకుండా నిర్ధారిస్తున్నది. మరి దీనిని అరికట్టే మార్గాలు లేవా? సుప్రీంకోర్టు జోక్యంతో ఎన్నికల సంఘం తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంది. మ్యానిఫెస్టోల మతలబును అదుపు చేసేందుకు ఒక నిబంధనావళిని రూపొందించమంటూ జూలై 5, 2013న సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రజాస్వామ్యం ముగుసులో ఇష్టారాజ్యంగా ప్రభుత్వాలను నిర్వహిస్తున్న పార్టీలకు కళ్లెం వేయడం అంత సులభమైతే కాదు.
తాయిలాలు పంచడంలో, తూతూ మంత్రంగా మ్యానిఫెస్టోలు విడుదల చేయడంలో అన్ని పార్టీలదీ ప్రత్యేక చరిత్రే. సొంత ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యం ఇచ్చిన స్వేచ్ఛను రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేస్తున్న మాట నిజం. మరో ఐదేళ్లో పదేళ్లో అధికారంలో ఉండడానికి ప్రజాస్వామ్యం వంటి మహోన్నత వ్యవస్థను కలుషితం చేయడం అంటే, రినైజాన్స్ కాలం నాటి పెయింటింగ్‌ను చలి కాచుకోవడానికి తగలబెట్టడం వంటిదే. చాలామంది రాజకీయ నేతలు చేస్తున్న పని ఇదే.
- డాక్టర్ గోపరాజు నారాయణరావు
ఫ్రీబీలతో నేతల దగా
ప్రజాస్వామ్యాన్ని ఘోరంగా దగా చేస్తున్న ఫ్రీబీ ఫేం నేతలని చట్టం ఏమీ చేయలేదా? హామీలు ఇచ్చి, ఫ్రీబీలు పంచి అధికారం దక్కించుకున్న నాయకులు, ఎన్నికైన తరువాత హామీలను విస్మరిస్తే వెనక్కి పిలిచే అవకాశం (స్విట్జర్లాండ్ తరహాలో) భారతదేశంలో ఉందా? ఎంతమాత్రం లేదు. ఫ్రీబీలు చాటుమాటు వ్యవహారం. వీటికి కేరాఫ్ ఉండదు. కోట్ల రూపాయలు వదిలేసి పోయిన సంగతులు పత్రికలలో చదివాం. ఇక మ్యానిఫెస్టోలు చట్టబద్ధం. కానీ 1952 నాటి తొలి ఎన్నికల నుంచి మ్యానిఫెస్టోలు తమ అవతారాలను వేగంగా మార్చుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు పార్టీ సిద్ధాంతాలను వివరించడం మ్యానిఫెస్టోల ప్రధాన లక్ష్యం కాదు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఓటర్లకు ఎలాంటి వరాలు లభిస్తాయో చెప్పడానికే వాటిని ఉపయోగించుకుంటున్నారు. అయినా వీటికి చట్టబద్ధత ఉంది కాబట్టి సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకోలేకపోతున్నది. కానీ 5-7-2013 నాటి తీర్పులో ఫ్రీబీలను మాత్రం తప్పు పట్టింది. ఇవి ఎన్నికల స్ఫూర్తిని దెబ్బతీస్తాయని ఎన్నికల కమిషన్ కూడా నిర్ద్వంద్వంగా అంగీకరించింది.
వీటి నిరోధానికి అవసరమైన చర్యల గురించి ఆలోచిస్తామని విన్నవించింది. అయితే, ఇవి ఒక వ్యక్తికి ఆపాదించలేం. అలాగే ఒక పార్టీని వెనక్కి పిలవడం అంటే, మళ్లీ ఎన్నికలకు సిద్ధం కావడమే. అలాంటి నిబంధనలు భారతదేశంలో లేవు. నిజానికి ఓటర్లను ప్రలోభ పెట్టరాదన్నది మొదటి నుంచి ఉన్న ఎన్నికల నిబంధన. ఓటర్లను బెదిరించి ఓటు వేయించడం, పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకోవడం, పోలింగ్ కేంద్రాలకు వారు రావడానికి వాహన సౌకర్యం కల్పించడం సైతం నిబంధనావళి ఉల్లంఘన కిందకే వస్తాయి. కానీ ఈ ఎన్నికల నేరాలు ఇప్పుడు చాలా చిన్నవిగా కనిపించే స్థాయికి చేరిపోయాయి. అభ్యర్థులను హత్య చేయడం, కోట్ల రూపాయలు పెట్టి ఫ్రీబీలు పంచడం, ఉద్విగ్న అంశాలను తెర మీదకు తేవడం ఇప్పుడు తరచూ జరుగుతోంది. ఏమైనా ఫ్రీబీల సంగతి సత్వరమే తేల్చాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించడం స్వాగతించదగినదే. కానీ దీని విజయం మన నేతల చిత్తశుద్ధి మీద కూడా ఆధారపడి ఉంది. ప్రజాస్వామ్యం మాఫియాల పరం కాకుండా చూసుకోవడం ప్రజల బాధ్యత కూడా.