All Pakistan Muslim League
-
పిరికివాడిని కాదు : మాజీ అధ్యక్షుడు
కరాచీ: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ తిరిగి తన సొంత దేశం రావాలని ప్రయత్నిస్తున్నారు. జూన్ 25న దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముషార్రఫ్ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు. కానీ పాక్ సుప్రీంకోర్టు తనను ఏక్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తాను పాక్‌కు తిరిగి వచ్చినా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని ముషార్రఫ్ భావించారు. ఇటీవల పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే పాక్‌కి తిరిగి రావచ్చని షరతులతో కూడిన అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. మొదట తన ముందు హాజరైన తరువాత ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సకిబ్ నసీర్ పేర్కొన్నారు. తనను స్వదేశం రప్పించి అరెస్ట్ చేసేందుకే సుప్రీంకోర్టు ఆ సందేశం పంపిందని ముషార్రఫ్ వ్యాఖ్యానించారు. తనకు పాక్ రావాలని ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ అంశంపై మాట్లాడుతూ.. పోటీ చేసేందుకు తన పార్టీ ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ తరఫున రెండు స్థానాల్లో నామినేషన్ పత్రాలను సమర్పించానని, ఎన్నికల అధికారి వాటిని తిరిస్కరించారని తెలిపారు. తాను పిరికివాడిని కాదని ప్రపంచం మొత్తం తెలుసునని, త్వరలోనే దేశానికి తిరిగి వస్తానని ముషార్రఫ్ పేర్కొన్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ముషార్రఫ్ 2016లో దేశం విడిచి వెళ్లి రహస్యంగా దుబాయ్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. -
ముషార్రఫ్‌కి మరో ఝలక్
లండన్: పాకిస్థాన్ మాజీ సర్వసైన్యాధక్షుడు, ఆల్ పాకిస్థాన్ ముస్లిం లీగ్ వ్యవస్థాపకుడు పర్వేజ్ ముషార్రఫ్‌కి మరో పరాభవం ఎదురైంది. లండన్‌లోని ఓ యూనివర్సిటీలో ఆయన నేతృత్వంలో జరగాల్సిన ఓ చర్చా కార్యక్రమానికి అనుమతి నిరాకరించింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఛానెల్ ఈనెల 24న ముషార్రఫ్‌తో ముఖాముఖిని ఏర్పాటుచేసింది . లండన్‌లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ విద్యాలయాన్ని వేదికగా ఎంచుకుంది. తనపై పడిన అనర్హత వేటుతోపాటు ఉగ్రవాదంపై పోరు తదితర అంశాలపై ముషార్రఫ్ ప్రసంగించాల్సి ఉంది. ఇంతలో పలు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో యూనివర్సిటీ మేనేజ్మెంట్ వెనక్కి తగ్గింది. ‘‘ముషార్రఫ్‌పై నమోదైన అభియోగాల నేపథ్యంలో ఇంటర్వ్యూకు అనుమతించటం ద్వారా తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉంది. ఒక రకంగా పాకిస్థాన్‌లో జరిగిన నేరాలకు, హింసకు మరియు మిలిటరీ తిరుగుబాటులకు ఈ విద్యాలయం పరోక్షంగా మద్ధతు తెలిపినట్లే అవుతుంది. అందుకే ఆయన ఇంటర్వ్యూకు అనుమతి నిరాకరించాలి’’ అని పలు ప్రగతిశీల గ్రూపులకు చెందిన పాకిస్థాన్ నేతలు ఎస్ఓఏఎస్ కు లేఖ రాశారు. ఆయన(ముషార్రఫ్) ప్రసంగిస్తే నిరసన తెలిపేందుకు ఓ మూడు సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. తద్వారా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఆయన కార్యక్రమానికి అనుమతి నిరాకరిస్తున్నామని యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. అదే సమయంలో ఈ కార్యక్రమంలో తన బుక్‌ను ముషార్రఫ్‌తో ఆవిష్కరింపజేయాలనుకున్న ఓ రచయిత కూడా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడని సమాచారం. ఇంతకు ముందు నోబెల్ శాంతి సెంటర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ పాక్ మాజీ నియంత పాల్గొనగా, నిరసనలు వ్యక్తం కావటంతో కార్యక్రమం మద్య నుంచే ఆయన వెళ్లిపోయారు.