Ammaodi program
-
అమ్మ ఒడితో 100 శాతం సత్ఫలితాలు
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలతో ముఖ్యంగా జగనన్న అమ్మఒడి ద్వారా నూటికి నూరు శాతం సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. అమ్మ ఒడి ద్వారా ప్రాథమిక విద్యలో జాతీయ స్థాయిని మించి చేరికలు నమోదైనట్లు వెల్లడైంది. గతేడాది ప్రాథమిక విద్యలో జాతీయ స్థాయిలో స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) 100.13 ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 100.80కి చేరింది. అమ్మ ఒడి ద్వారా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ విద్యలో జీఈఆర్ పెరిగినట్లు ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. మండల, జిల్లా స్థాయిల్లో నూరు శాతం జీఈఆర్ నమోదుకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో వరుసగా నాలుగేళ్లుగా ప్రాథమిక, సెకండరీ, ఉన్నత విద్యలో జీఈఆర్ పెరుగుతూ వస్తోంది. 2020 జనవరి 9వతేదీన జగనన్న అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అమ్మ ఒడి పథకం కింద ఇప్పటి వరకు 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో రూ.19,674.34 కోట్లు జమ చేశారు. 2023–24కి సంబంధించి ఈ నెల 28న అమ్మ ఒడి నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రాథమిక విద్యలో 2018లో జాతీయ స్థాయిలో జీఈఆర్ 96.09 ఉండగా రాష్ట్రంలో 92.91 ఉంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అమ్మ ఒడితో పాటు పలు పథకాలను అమలు చేయడంతో 2019–20 నుంచి వరుసగా ప్రాథమిక విద్యలో జీఈఆర్ పెరుగుతూ 2022–23 నాటికి జాతీయ స్థాయిని మించి 100.80కి చేరింది. సెకండరీ విద్యలో 2018–19లో జీఈఆర్ 79.69 ఉండగా 2022–23 నాటికి 89.63కి చేరింది. ఉన్నత విద్యలో రాష్ట్రంలో 2018–19లో జీఈఆర్ 46.88 ఉండగా 2022–23 నాటికి 69.87 శాతానికి జీఈఆర్ పెరగడానికి ప్రధాన కారణం జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన తదితరాలు కారణమని స్పష్టం అవుతోంది. టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్ధులు చదువు మానేస్తున్నారు. ఉన్నత విద్యలో జీఈఆర్‌ను మరింత పెంచడంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం అలాంటి వారిని రెగ్యులర్ తరగతుల్లో అవే కోర్సుల్లో తిరిగి చేర్చుకునేందుకు అనుమతించింది. ఈమేరకు మిషన్, విజన్ పేరుతో ఈ ఏడాది ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్‌ను వలంటీర్ల ద్వారా అమలు చేస్తోంది. అంతేకాకుండా పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిలై తిరిగి రెగ్యులర్ తరగతుల్లో చేరిన విద్యార్ధులకు కూడా జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
4 ఆస్పత్రులు.. 6 గంటలు..
- కాన్పు కోసం వచ్చి.. వైద్యం అందక నరకయాతన - నాలుగు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా అదే నిర్లక్ష్యం సాక్షి, వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మఒడి కార్యక్రమం మొదటి రోజే ఓ గర్భిణి నరకయాతన అనుభవించింది. వైద్యులు అందుబాటులో ఉండకపోవడం.. ఉన్న చోట పట్టించుకోక ఇంకో ఆస్పత్రికి రిఫర్ చేయడం.. ఇలా ఆమెను 4 ఆస్పత్రుల చుట్టూ తిప్పారు. 6 గంటలపాటు పురిటినొప్పులతో ఆమె పడిన బాధలు వర్ణనాతీతం. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేం ద్రానికి చెందిన కొమ్ము లక్ష్మి గర్భిణి. అంతకుముందే వైద్యపరీక్షలు చేయించుకున్న ఆమెకు కడుపులో కవలలు ఉన్నట్లు వైద్యులు చెప్పారు. దీంతో లక్ష్మి రెండో కాన్పు కోసం భర్త, బంధువులతో కలసి శనివారం పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు.. లక్ష్మికి అత్యవసర వైద్యం అవసరమని వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసు కెళ్లాలని సలహా ఇచ్చారు. అక్కడ ఆస్పత్రి సూపరిం టెండెంట్ సాయంత్రం 4 గంటల వరకు వస్తారని, వెంటనే ఆపరేషన్ చేస్తామని చెప్పారు. అయితే, ఉదయం 10 గంటల నుంచి పురుటి నొప్పులతో లక్ష్మి బాధపడుతోంది. 4 గంటలు గడిచినా సూపరింటెం డెంట్ రాకపోవడం.. మిగతా వైద్యులు కూడా ఎవరూ చికిత్స అందించకపోవడంతో లక్ష్మి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. అధికంగా రక్తస్రా వం అవుతుండ టంతో వనపర్తిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి అంబులెన్స్‌లో కర్నూలుకు తరలించారు. అక్కడా ఇదే పరిస్థితి ఉండడంతో ఓ ప్రైవేట్ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. అంబులెన్స్ రాదని చెప్పిన సిబ్బంది. పరిస్థితి విషమంగా ఉండటంతో గర్భిణిని మొదట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించే సమయంలో కానీ ఆ తరువాత కర్నూలుకు తరలించే సమయంలో అం బులెన్స్ వాహనం కావాలని జిల్లా ఆస్పత్రి సిబ్బం దిని అడిగితే ఎక్కడపడితే అక్కడ రాదని.. అవస రమైతే ప్రైవేట్ వాహనాన్ని మాట్లాడుకోండని చెప్పినట్లు లక్ష్మి భర్త విజయ్ వాపోయాడు. అనంతరం ఓ ప్రైవేట్ అంబులెన్స్ వాహనాన్ని రూ.3,500 మాట్లాడుకుని కర్నూలుకు తరలించారు. వైద్యులతో మాట్లాడిన.. గర్భిణి లక్ష్మి కడుపులో ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు కాబట్టే పెబ్బేరులోని వైద్యులు ఆమెను వనపర్తి జిల్లా ఆస్పత్రికి పంపించారు. మేము ఇక్కడ ఆమెకు ఉదయం నుంచే చికిత్స అందించాం. నేను ఆస్పత్రిలో లేకపోయినా అక్కడి వైద్యులతో మాట్లాడుతూనే ఉన్నా. కడుపులో కవలలు ఉన్నారు కాబట్టి ప్రసవం అయ్యాక పిల్లలను వెంటనే ఎన్ఐసీయూలో ఉంచాలి. అందువల్ల మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాం. – భాస్కర్ ప్రభాత్, వనపర్తి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్