వారం రోజుల పాటు ‘అమృత భూమి’ చిత్రం ఉచిత ప్రదర్శన
ప్రకృతి వ్యవసాయంపై రైతులను చైతన్యవంతం చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘అమృత భూమి’. కె.బి. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కీ.శే. వంగపండు ప్రసాదరావు కథ, పాటలు అందించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కీలక పాత్రలో నటించారు. రసాయన వ్యవసాయం వల్ల భూములు నిస్సరమ అయిపోవటమే కాకుండా.. ప్రకృతి వనరులు, మనం తినే ఆహారం కూడా రసాయనాలు మయం అవుతోంది. అందుకే మనందరం - రైతులైనా, వినియోగదారులు అయినా - ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి.
ఆరోగ్యంగా జీవించాలంటే అమృతాహారం ఆవశ్యకతను గుర్తెరగాలి.. సమాజంలో ప్రతి ఒక్కరికీ ఈ సందేశాన్ని తెలిసేలా ప్రచారం చేయాలి. ఈ ఉదాత్తమైన అద్భుత సందేశాన్ని అత్యంత సృజనాత్మకంగా వెండి తెర పైకి ఎక్కించిన ఘనత ప్రముఖ స్వచ్ఛంద సేవకులు, ‘అమృతభూమి’ చిత్ర నిర్మాత పారినాయుడుకే దక్కింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ శాఖకు అనుబంధ సంస్థ రైతు సాధికార సంస్థ తోడ్పాటుతో ఈ చలన చిత్రాన్ని హృద్యంగా నిర్మించారు.
పిల్లలు, పెద్దలు, రైతులు.. అందరూ చూడదగిన ఈ చిత్రాన్ని నూజివీడుకు చెందిన వ్యాపారవేత్త, మూల్పూరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు లక్ష్మణ స్వామి నూజివీడు(కృష్ణా జిల్లా) ప్రాంత ప్రజలకు వారం రోజుల పాటు ఉచితంగా చూపించాలని సంకల్పించారు. ఇప్పుడు 7 రోజులూ .. రోజూ 4షోలకు మార్చారు. ఆగష్టు 5 నుంచి 11తేదీ వరకు రోజూ 4 ఆటలు.. మార్నింగ్ షో ఉదయం 11 గంటలకు, మాట్నీ 2 గంటలకు, ఫస్ట్ షో సాయంత్రం 6 గంటలకు, సెకండ్ షో రాత్రి 9 గంటలకు ఉచితంగా సత్యనారాయణ మినీ థియేటర్లో ప్రదర్శించనున్నారు. ఈ ఖర్చంతా లక్ష్మణ స్వామి భరిస్తున్నారు. ఈ సదవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని ప్రకృతి సేద్యం, ప్రకృతి ఆహారం తక్షణ ఆవశ్యకతను గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.