భరోసా ఇచ్చిన ‘సాక్షి ‘జనపథం’
అనాజీపూర్‌లో పేపర్ చూసి జనం ఖుషీ
దౌల్తాబాద్: మండలంలోని అనాజీపూర్ గ్రామంలో ఈ నెల 9న ‘సాక్షి‘ ఆధ్వర్యంలో నిర్వహించిన జనపథం కార్యక్రమంతో పింఛన్ లబ్ధిదారులకు భరోసా కల్గింది. స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, అధికారుల సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో వృద్ధులు, విత ంతువులు, వికలాంగులు వారివారి అ నుమానాలను నివృత్తి చేసుకోవడంతో ఆసరాపై ఉన్న ఆందోళన తొలగింది. బుధవారం గ్రామంలో ఈ కార్యక్రమంపైనే చర్చలు సాగాయి. ఆసరాపై ఎమ్మెల్యే, అధికారులు ఇచ్చిన భరోసాను ‘సాక్షి’ దినపత్రికలో చూసి పలువురు ఖుషీ అయ్యారు.
చదువురాని పలువురు వృద్ధులు, వికలాంగులు స్థానిక యువకులతో పేపర్‌ను చదివించుకొని ఆసక్తిగా విన్నారు. కొందరు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్లు పంచుతున్నారేమోనని పంచాయతీ కార్యాలయం వైపు తొంగిచూస్తూ కనిపించారు. ఒకటి రెండు రోజుల్లో పింఛన్ల పంపిణీ జరుగుతుందని వెల్లడవ్వడంతో బంధువుల ఇళ్ళకు వెళ్ళిన లబ్ధిదారులను తిరిగి రప్పించేందుకు పలువురు సమాచారం అందించారు.