నా కుమార్తెను అప్పగించండి
♦ నటులు విజయ్‌కుమార్, మంజుల మాజీ అల్లుడి ఫిర్యాదు
♦ కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్: తన కుమార్తెను అప్పగించం డంటూ సినీనటుడు విజయ్‌కుమార్ మాజీ అల్లుడు ఆనంద్‌రాజన్ గురువారం హైదరా బాద్‌లోని అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను చెన్నై, కోయంబత్తూర్‌లకు పంపారు. ప్రముఖ నటులు విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తె వనితకు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆనంద్ రాజన్‌తో 2007లో వివాహం జరిగింది. వీరికి జైనిక (8) అనే పాప ఉంది.
2012లో విభేదాలు రావడంతో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. తండ్రి సంరక్షణలో జైనిక ఉండాలని కోర్టు వారికి సూచించింది. కూతురిని చూసుకునే అవకాశం తల్లికి కల్పించింది. అయితే, ఆనంద్ రాజన్ అల్వాల్‌లో నివాసముం టున్నారు. కొంతకాలంగా వనిత తరచూ ఆనంద్‌రాజన్ వద్దకు వచ్చి పాపను చూసు కునేది.
వనితకు వేరే వ్యక్తితో వివాహం కావడంతో కొంత కాలంగా పాపను చూడటానికి ఇక్కడికి రాలేదు. గత నెల 18న ఆనంద్‌రాజన్ వద్దకు వచ్చిన వనిత పాపను తీసుకెళ్లింది. మళ్లీ తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా వనిత ఆచూకీ లభించకపోవడంతో ఆనంద రాజన్ అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వనితపై కిడ్నాప్, చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఆనంద్‌రెడ్డి వెల్లడించారు.