'బడ్ వైజర్' ఇక 'అమెరికా'.. ట్రంప్ ఖుషీ
వాషింగ్టన్: ప్రపంచ ప్రఖ్యాత బీర్ బ్రాండ్ 'బడ్ వైజర్' పేరు మార్పు సర్వత్రా చర్చనీయాంశమైంది. 'బడ్ వైజర్' తయారీదారు అన్ హ్యూసర్ సంస్థ తన బ్రాండ్ పేరును 'అమెరికా'గా మార్చుతున్నట్లు ప్రకటించడం నా ఘనతే అంటున్నారు రిపబ్లికన్ ఫ్రంట్ రన్నర్ డోనాల్డ్ ట్రంప్. 'జీవితంలో ఒక్క చుక్కైనా ఆల్కహాల్ తాగలేదు!' అని చెప్పుకునే ట్రంప్.. బీర్ పేరు మార్పు క్రెడిట్ ఎలా కొట్టేశారంటే..
అధ్యక్షపదవి కోసం పోటీపడుతోన్న డోనాల్డ్ ట్రంప్.. 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' నినాదంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బుధవారం 'ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్' కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్.. తాను అధికారం చేపడితే జరగబోయే మార్పును బడ్ వైజర్ ముందుగానే చేసి చూపించి ఉంటుందని జోక్ చేశారు. కాగా, అమెరికా పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకునేందుకే బడ్ వైజర్ పేరును అమెరికా గా మార్చామని, సమ్మర్ సీజన్ (మే 23) నుంచి కొత్త పేరున్న బీర్ టిన్నులు వినియోగదారులకు అందించబోతున్నట్లు సంస్థ ఉపాధ్యక్షుడు రిచర్డ్ మార్కస్ తెలిపారు. జూన్ 3 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీకి ఈసారి యూఎస్ ఆతిథ్యం ఇస్తుండటం, పెద్ద ఎత్తున జరగనున్న జులై 4 వేడుకలను దృష్టిలో ఉంచుకుని బ్రాండ్ పేరు మార్పునకు ఇదే సరైన సమయమని భావించినట్లు ఆయన పేర్కొన్నారు.