ఒలింపిక్స్ కు వెళ్తానని.. జైలుకు వెళ్లాడు!
న్యూఢిల్లీ: బాక్సింగ్ కోచ్ అనిల్ మాలిక్ తన మొబైల్ ఫోన్ లో ఉన్న పాత ఫొటోను చూస్తున్నారు. ఫొటో కింద కుడివైపు 2011, ఆగస్టు 28 తేదీ స్టాంపు ఉంది. పుణేలో 2011లో జరిగిన జాతీయ జూనియర్ బాక్సింగ్ టోర్నిలో విజేతలుగా నిలిచిన బాక్సర్ల ఫోటో అది. అందులో ఒక బాక్సర్ మెడలో బంగారు పతకం, ముఖంలో నవ్వుతో వెలిగిపోతున్నాడు. అతడి పేరు దీపక్ పహల్.
'జాతీయ పతకంతో అతడు సంతృప్తి చెందాలనుకోవడం లేదు. ఒలింపిక్స్ కు వెళ్లాలనేది అతడి లక్ష్యం. రియో ఒలింపిక్స్ లో కచ్చితంగా పాల్గొంటానని నాతో అతడు చెప్పాడు. 16 ఏళ్ల కుర్రవాడికి ఇది పెద్ద లక్ష్యమే అయినప్పటికీ అతడిపై నాకు నమ్మకం ఉంద'ని మాలిక్ చెప్పాడు. ఐదేళ్లు గడిచాయి. రియో ఒలింపిక్స్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. కానీ ఒలింపిక్స్ వెళ్తానన్న జూనియర్ బాక్సింగ్ చాంపియన్ దీపక్ పహల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు.
జితేందర్ అనే గ్యాంగ్స్టర్ పారిపోవడానికి సహకరించాడన్న ఆరోపణలతో పహల్ ను జూలై 30 హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. జితేందర్ ను ఢిల్లీలోని రోహిణి జైలు నుంచి సోనిపట్ కోర్టుకు తీసుకెళుతుండగా ఓ ముఠా పోలీసుల కళ్లలో కారం కొట్టి అతడిని తప్పించింది. పోలీసులు అరెస్ట్ చేసిన 10 మంది ముఠాలో పహల్ కూడా ఉన్నాడు. జితేందర్ పారిపోవడానికి పహాల్ రెండు కార్లు సమకూర్చాడు. అందులో ఒక కారు చోరీ చేసిందని పోలీసులు గుర్తించారు. మంచి ప్రతిభవున్న పహల్ నేరస్తుడిగా మారడం తాను ఊహించలేదని మాలిక్ పేర్కొన్నాడు.