anne ferrer
-
కరోనాను జయించిన అన్నే ఫెర్రర్
బత్తలపల్లి: ఆర్డీటీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నేఫెర్రర్ కరోనాను జయించారు. వైరస్ నుంచి కోలుకున్న ఆమె గురువారం ఆర్డీటీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజుల క్రితం కరోనా సోకడంతో ఆమెను బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మెరుగైన వైద్యంతో త్వరగా కోలుకున్నారు. ఈ సందర్భంగా అన్నే ఫెర్రర్ మాట్లాడుతూ ‘మరోసారి నేను ఇంటికి వచ్చేశాను, మళ్లీ పని కొనసాగిస్తున్నాను. నేను కోలుకోవాలని, నా ఆరోగ్యం బాగుండాలని ఎన్నో సందేశాలు, ప్రార్థనలు చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. ప్రజల దీవెనలు, బత్తలపల్లి ఆసుపత్రి వైద్యుల బృందం అంకితభావంతో చేసిన సేవల వల్ల తాను త్వరగా కోలుకున్నట్లు వివరించారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలోనూ, కోవిడ్ చికిత్సా కేంద్రాలను ప్రజలకు సౌకర్యవంతంగా చేయడంలోనూ అనంతపురం అధికార యంత్రాంగం చేస్తున్న అవిశ్రాంతి కృషిని కొనియాడారు. ఆమె వెంట ఆర్డీటీ డైరెక్టర్ విశాలా ఫెర్రర్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్, వైద్యులు పాల్, రీజనల్ డైరెక్టర్ మల్లిఖార్జున, ఏటీఎల్ వేమయ్య తదితరులున్నారు. అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్‌ను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గురువారం సాయంత్రం పరామర్శించారు. కరోనా నుంచి కోలుకున్న నేపథ్యంలో ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ పాల్గొన్నారు. -
భారత జట్టులో చోటు దక్కించుకోవాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్ : భారత జట్టులో లక్ష్యంగా దూసుకెళ్లాలని ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్ అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్డీటీ ప్రధాన కార్యాలయంలో ఆర్డీటీ అకాడమీకి చెందిన భవానీ జాతీయ హాకీ అకాడమీకి ఎంపికైన సందర్భంగా అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ క్రీడల్లో రాణించాలంటే క్రీడాకారుల కృషి, పట్టుదలే ప్రధానమన్నారు. హాకీ క్రీడ కోసం విశాఖపట్టణం నుంచి అనంతపురం ఆర్డీటీ అకాడమీలో శిక్షణ తీసుకుని జాతీయస్థాయి క్యాంప్‌కు ఎంపికవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. భవానీ అనంతపురం ఆర్డీటీ అకాడమీలో 2013లో చేరిందని, ఆనాటి నుంచి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి జూనియర్, సీనియర్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ హాకీ కోఆర్డినేటర్ విజయ్‌బాబు, కోచ్ అనిల్‌కుమార్, ఉపాధ్యక్షుడు అబ్దుల్ఘనీ, బాబయ్య తదితరులు పాల్గొన్నారు. -
వరల్డ్ స్పెషల్ ఒలింపిక్స్‌కు బుద్ధిమాంద్యులు
అనంతపురం స్పోర్ట్స్: వరల్డ్ స్పెషల్ ఒలింపిక్స్‌కు ఆర్డీటీ నుంచి 13 మంది బుద్ధిమాంద్యులను పంపుతున్నట్లు ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అన్నే ఫెర్రర్ తెలిపారు. గత ఆరేళ్లుగా స్పెషల్ ఒలింపిక్స్‌లో బుద్ధిమాంద్యులు సాధిస్తున్న విజయాలపై 'బంగారు పండిస్తున్న ఆర్డీటీ స్పెషల్ ఒలింపిక్స్' అనే పుస్తకాన్ని అన్నే ఫెర్రర్ మెయిన్ క్యాంపస్‌లో బుధవారం ఆవిష్కరించారు. అమెరికాలోని లాస్ఏంజిల్స్లో ఈ నెల 25 నుంచి పది రోజుల పాటు వరల్డ్ స్పెషల్ ఒలింపిక్స్ జరుగుతాయని ఆమె తెలిపారు. 'ప్రతి ఏడాదిలాగే మా సంస్థలో శిక్షణ పొందుతున్న బుద్ధిమాంద్యులకు అవకాశం కల్పిస్తున్నాం. సకలాంగులకు ధీటుగా బుద్ధిమాంద్యులు సాధిస్తున్న విజయాలు అందరికీ స్పూర్తిని నింపుతున్నాయి. వారిని దృష్టిలో ఉంచుకునే పుస్తకాన్ని ఆవిష్కరించాం. పిల్లలతో పాటు ఆరు మంది కోచ్‌లను పంపుతున్నాం. త్వరలో జరిగే స్పెషల్ ఒలింపిక్స్‌లోనూ విజయాలు సాధిస్తారు' అని అన్నే ఫెర్రర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్డీటీ సీబీఆర్ సెక్టార్ డెరైక్టర్ దశరథ్, డిప్యూటీ డెరైక్టర్ చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు.