పాక్ నుంచి ఈసారి ఏమొచ్చిందో తెలుసా?
జైసల్మేర్: భారత్-పాకిస్థాన్ సరిహద్దులో గాలి బుడగులు దుమారం, పావురాల లేఖల కలకలం సద్దుమణగక ముందే మరోసారి కలకలం రేగింది. పాకిస్థాన్ నుంచి వచ్చిన గద్ద(డేగ) ఈసారి కలవరపాటుకు గురిచేసింది. శిక్షణ పొందిన ఈ గద్దను రాజస్థాన్ లోని జైసల్మేర్ లో బీఎస్ ఎఫ్ అధికారులు దీన్ని పట్టుకున్నారు.
అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో అనూప్ గఢ్ వద్ద దీన్ని బంధించారు. అయితే దీని వద్ద ఎటువంటి ట్రాన్స్ మీటర్, యాంటెనాలు లభ్యం కాలేదని బీఎస్ ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఈ పక్షిని అటవీ అధికారులకు అప్పగించారు. ఈ గద్ద సౌదీ షేక్ లకు సంబంధించినదై ఉండొచ్చని బీఎస్ ఎఫ్ వర్గాలు తెలిపాయి. వీటిని పాకిస్థాన్ నుంచి సౌదీ షేక్ లు తెచ్చుకుంటారని వెల్లడించారు.
ఇదేవిధంగా అక్టోబర్ 2న పఠాన్ కోట్ సమీపంలోని బమియాల్ సెక్టార్ లోగల సింబాల్ పోస్ట్ వద్ద.. పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన పావురాన్ని బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు. ప్రధాని నరేంద్ర మోదీని హెచ్చరిస్తూ ఉర్దూలో రాసిన లేఖను పావురం కాళ్లకు కట్టివుండడాన్ని గమనించారు. గాలి బుడగలకు కట్టిన లేఖలు కూడా పాక్ నుంచి మనదేశంలోకి వచ్చిపడిన విషయం తెలిసిందే.