వైఎస్ఆర్సీపీ నేత దారుణ హత్య
టీడీపీ నాయకుల బరితెగింపు
ట్రాక్టరుతో ఢీకొట్టి, కత్తులతో నరికి, ఆపై బండరాయితో మోదిన వైనం
నిందితులపై కేసు నమోదు
బనగానపల్లె : కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పలుకూరు మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్, వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆపతి ప్రభాకర్ నాయుడు(41) గురువారం ఉదయం టీడీపీ నాయకుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ దాడిలో ఆయన వెంట ఉన్న గుమస్తా మధుభాస్కర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు...రామకృష్ణాపురం గ్రామానికి చెందిన ప్రభాకర్ నాయుడు గురువారం ఉదయం తన గుమస్తా మధుభాస్కర్‌తో కలసి ద్విచక్రవాహనంపై గ్రామ సమీపంలో తాను లీజుకు తీసుకున్న మైనింగ్ గనుల వద్దకు వెళ్లారు.
వాటిని చూసిన అనంతరం 10 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా ఎదురుగా ట్రాక్టర్‌పై వచ్చిన ప్రత్యర్థులు మోటర్ సైకిల్‌ను ఢీకొట్టించారు. ప్రభాకర్ నాయుడు, మధుభాస్కర్ కిందపడిపోగా ట్రాక్టర్లో ఉన్న వారు కిందకి దిగి కత్తులతో ప్రభాకర్ నాయుడిపై దాడిచేసి దారుణంగా నరికారు. ఇంకా బతికి ఉన్నాడన్న అనుమానంతో పెద్ద బండరాయిని తలపై వేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. దాడి సమయంలో మధుభాస్కర్‌ను పక్కకు ఈడ్చి వేయడంతో అతను గాయపడ్డాడు.
గత కొంతకాలంగా గ్రామంలో ఇరువర్గాల మధ్య ఉన్న వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులతోపాటు గ్రామస్తులు భావిస్తున్నారు. ప్రభాకర్ నాయుడుకు భార్య లక్ష్మీదేవితోపాటు కుమారులు ఆపతి కార్తీక్(15) ఆపతి శశాంక్(11) ఉన్నారు. మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గ్రామానికి చెందిన నగేష్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శివభాస్కర్‌రెడ్డి తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసు బలగాలతో అక్కడకి చేరుకుని ఎటువంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు.
పరామర్శ
హత్యకు గురైన ప్రభాకర్ నాయుడు కుటుంబ సభ్యులను బనగానపల్లె నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కాటసాని జ్యోతి పరామర్శించారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.