భర్తే కాలయముడు
⇒ అసోంలో గాజువాక యువతి హత్య
⇒ ఆర్మీ పోలీసు కస్టడీలో నిందితుడు
⇒ కాపురానికి తీసుకెళ్లిన నెల రోజులకే ఘాతుకం
గాజువాక : తాను క్షేమంగా ఉన్నానని రాత్రి తల్లిదండ్రులకు ఫోన్ చేసిన ఆమె తెల్లవారేసరికి శవమైంది. కట్టుకున్న భర్తే కాలయముడు కావడంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. పెద్దల భరోసాతో కాపురానికి వెళ్లిన తమ కుమార్తె విగతజీవిగా మారిందని తెలిసి గుండెలవిసేలా రోదిస్తున్నారు.
మృతురాలి సమీప బంధువుల కథనం ప్రకారం... పెదగంట్యాడ మండలం పాలవలస గ్రామానికి చెందిన నీలాపు అప్పలరెడ్డి, అచ్చియ్యమ్మ దంపతులు గాజువాక బీసీ రోడ్లోని భానోజీకాలనీకి కొన్నేళ్ల క్రితం వలస వచ్చారు. తమ కుమార్తె పద్మ (23)కు సింహగిరి కాలనీకి చెందిన ఎక్స్ సర్వీస్మన్ దాసరి పైడయ్య కుమారుడు ఆర్మీ ఉద్యోగి అప్పలరెడ్డి (26)తో రెండేళ్ల క్రితం వివాహం జరిపించారు. అసోం క్యాంపులో హవాల్దార్గా పనిచేస్తున్న అప్పలరెడ్డి వివాహం అయిన వెంటనే భార్యను తనతో తీసుకువెళ్లిపోయాడు.
ప్రసవం కోసం గాజువాక వచ్చిన పద్మ నాలుగు నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. కుమారుడిని చూడటానికి అప్పలరెడ్డి రాకపోవడంతో ఆరా తీసిన పద్మకు భర్త నుంచి సరైన సమాధానం లభించలేదు. దీంతో సింహగిరి కాలనీలో ఉంటున్న అతడి తల్లిదండ్రులతో పద్మ తల్లిదండ్రులు మాట్లాడారు. అక్కడ్నుంచి కూడా సరైన స్పందన లభించకపోవడంతో గత నెలలో గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
పోలీసులతోపాటు ఇరుకుటుంబాల తరఫున పెద్ద మనుషులు కూడా జోక్యం చేసుకొని భార్యాభర్తల మధ్య గత నెల 20న రాజీ కుదిర్చారు. 24న సింహగిరి కాలనీలోని అత్తారింటికి పంపించారు. అదే రోజు బాబుకు బారసాల జరిపిన అప్పలరెడ్డి 27న తన భార్య, కుమారుడితో అసోం వెళ్లాడు. శనివారం రాత్రి పద్మ తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాగానే ఉన్నామని చెప్పింది. అంతా బాగుందని సంబరపడిన సమయంలో కుమార్తెను అల్లుడే హత్య చేసినట్టు తెలిసి ఆమె తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.
అసోంలో వారి సమీప బంధువులు ఫోన్లో తెలిపారు. నిందితుడిని ఆర్మీ పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిసింది. ఆ విషయాన్ని ఇక్కడి బంధువులకు ఆర్మీలోని ఒక ఉన్నతాధికారి ఫోన్లో చెప్పినట్టు చెబుతున్నారు. బైండింగ్ వైరును మెడకు బిగించి హత్య చేసినట్టు అక్కడ పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్టు తెలిపారు.
అప్పలరెడ్డికి ఇది రెండో వివాహం
అప్పలరెడ్డికి పద్మ రెండో భార్య. మొదటి భార్య అతడు వేధింపులు భరించలేక వదిలి వెళ్లిపోయినట్టు మృతురాలి బంధువులు చెబుతున్నారు. అతడు దగ్గర బంధువు కావడంతో పద్మను ఇచ్చి రెండో వివాహం చేశారు. అప్పలరెడ్డి సోదరి వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
అసోంలో కూడా తొలుత చిత్ర హింసలకు గురి చేసేవాడని, అతనొక శాడిస్టు అని పద్మ పలుసార్లు మొరపెట్టుకున్నట్టు చెబుతున్నారు. రాజీ కుదిర్చినప్పటికీ తొలుత కాపురానికి వెళ్లడానికి ఇష్టపడలేదని, పెద్దలు భరోసా ఇవ్వడంతో ఆమె వెళ్లిందని చెబుతున్నారు. ఆమె మృతి వార్తతో ఇక్కడ విషాదం అలుముకుంది.