జీఎస్టీతో ప్రయోజనాలు తక్కువే: నోమురా
ఎన్నో అంచల పన్నులతో క్లిష్టంగా మార్చేశారు...
న్యూఢిల్లీ: జీఎస్టీ ప్రస్తుత నిర్మాణ స్వరూపం ద్వారా వచ్చే ప్రయోజనాలు గతంలో ఊహించినదానికంటే చాలా తక్కువగా ఉంటాయని జపాన్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ నోమురా అభిప్రాయపడింది. పలు అంచల పన్ను రేట్ల ద్వారా జీఎస్టీ స్వరూపం చాలా క్లిష్టంగా ఉందని తన పరిశోధనా నివేదికలో పేర్కొంది. జీఎస్టీలో అన్ని రకాల వస్తువులు, సేవలను 5, 12, 18, 28 పన్ను పరిధిలోకి చేర్చిన విషయం తెలిసిందే. ఇక ఖరీదైన కార్లు, ఏరేటెడ్ డ్రింక్స్, పొగాకు ఉత్పత్తులపై అదనంగా సెస్‌లు కూడా ఉన్నాయి.
‘‘పలు అంచల పన్నుల ద్వారా జీఎస్టీని క్లిష్టంగా మార్చేశారు. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పరిమితం చేసేందుకు, రాజకీయ పరమైన అవసరాల కోసం ఇలా చేశారు’’ అని నోమురా పేర్కొంది. సులభతరమైన పన్ను వ్యవస్థను కలిగి ఉండడం ద్వారా పొందే ప్రయోజనాలను ఇది తగ్గించేస్తుందని అభిప్రాయపడింది. రానున్న సంవత్సరాల్లో మరింత అనుకూలమైన జీఎస్టీ రేటు దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. దీర్ఘకాలంలో రవాణా వ్యయాలు తగ్గడం కారణంగా జీఎస్టీ ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుందన్న ఈ సంస్థ... సమీప కాలంలో అది ఉండకపోవచ్చని అభిప్రాయపడింది.
వృద్ధి అవకాశాలకు దెబ్బ: సిమెంట్ పరిశ్రమ
జీఎస్టీలో సిమెంట్‌పై 28 శాతం పన్ను విధించడం ద్వారా సమస్యల్లో ఉన్న ఈ రంగంతోపాటు మౌలిక రంగానికి ఊతమిచ్చే అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోయిందని సిమెంట్ తయారీ దారుల సంఘం (సీఎంఏ) అభిప్రాయపడింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సిమెంట్‌పై ఇంత భారీ పన్ను మన దేశంలోనే ఉందని పేర్కొంది. ‘‘దేశంలో సిమెంట్ ధరలో 60 శాతం పన్నే. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇది 11.4 శాతంగానే ఉంది. శ్రీలంకలో 20 శాతాన్ని మించలేదు’’ అని సీఎంఏ వివరించింది. తక్కువ డిమాండ్‌తో 70 శాతం సామర్థ్యాన్నే వినియోగించుకుంటున్న ఈ రంగానికి గొడ్డలి పెట్టుగా పేర్కొంది. ‘‘50 కేజీల సిమెంట్ బ్యాగు ధర రూ.300 గా ఉంది. ఇందులో రూ.180 పన్నులు, రవాణా వ్యయమే వున్నాయి. తక్కువ మార్జిన్లు, అధిక మూలధనం అవసరమైన ఈ పరిశ్రమకు ఉపశమనం కల్పించేందుకు జీఎస్టీ ఓ అవకాశం. కానీ, ఇది చేజారిపోయింది’’ అని సీఎంఏ ప్రెసిడెంట్ శైలేంద్ర చౌక్సే అన్నారు.