arrangements observe
-
సీఎం పర్యటన సజావుగా సాగాలి
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించనున్న సందర్భంగా శాంతిభద్రతలు, ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాట్లు సజావుగా చేయాలని కలెక్టర్ వి.వినయ్‌చంద్ జిల్లా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జిల్లాస్థాయి అధికారులతో సీఎం పర్యటనపై ఆయన సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జేసీ–2 డి.మార్కండేయులు, డీఆర్ఓ వెంకటసుబ్బయ్యతో కలిసి అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి తన నివాసం నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరి 2.40 గంటలకు ఒంగోలులోని ఏబీఎం కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారని వివరించారు. ఏబీఎం నుంచి 2.50 గంటలకు బస్సులో బయలుదేరి 3 గంటలకు మినీ స్టేడియంలోని ధర్మపోరాట దీక్ష సభాస్థలికి చేరుకుంటారన్నారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు తిరిగి ముఖ్యమంత్రి వెళ్లిపోతారన్నారు. అందులో భాగంగా ఏబీఎం కళాశాలలో హెలిప్యాడ్ నిర్మాణం, ప్రముఖులు వేచి ఉండే విధంగా షామియానాలు, సీటింగ్, మంచినీరు, రిఫ్రెష్మెంట్లు, ముఖ్యమంత్రి కోసం తాత్కాలిక బయోటాయిలెట్, బారికేడింగ్, ఫైర్ టెండర్ ఏర్పాట్లు సజావుగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కాన్వాయ్‌లో వైద్య నిపుణులు, రక్తనమూనాలు, వైద్య పరికరాలు, మందులు కలిగిన అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని ప్రతి వాహనంలో మంచినీరు, రిఫ్రెష్మెంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రిమ్స్ వైద్యశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో ఎక్కడా చెత్తాచెదారం లేకుండా చూడాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణంలో సాయంత్రం వీధిదీపాలు, ముఖ్యంగా ఎల్ఈడీ బల్బులు సరిగా వెలుగుతున్నాయా..లేదా..? అన్నది పరిశీలించాలని సూచించారు. సమావేశంలో ఒంగోలు ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ రాజ్యలక్ష్మి, ఎస్డీసీ నరిసింహులు, డీఆర్డీఏ, డ్వామా పీడీలు మురళి, వెంకటేశ్వర్లు, శింగయ్య, డీటీడబ్ల్యూ రాజ్యలక్ష్మి, డీటీసీ సీహెచ్‌వీకే సుబ్బారావు, రిమ్స్ డైరెక్టర్ మస్తాన్ సాహెబ్, స్టెప్ సీఈఓ రవి, ఎస్ఎస్ఏ పీఓ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏర్పాట్లు పూర్తి : మంత్రులు నారాయణ, శిద్దా సీఎం చంద్రబాబు పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మినీ స్టేడియంలోని దీక్షా స్థలి వద్దకు వచ్చిన మంత్రులు.. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై ముఖ్యమంత్రి చేస్తున్న దీక్షకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. వారి వెంట ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కొమ్మూరి రవిచంద్ర, బాలాజీ తదితరులు ఉన్నారు. -
స్వాతంత్య్ర వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్ : రాష్ట్ర స్వాతంత్య్ర దినో త్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ కె.ధనంజయరెడ్డి అధికారులకు ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో జిల్లా అధికారులతో రాష్ట్ర స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో త్వరితగతిన పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ శ్రీరాములునాయుడును ఆదేశించారు. మొక్కలు కడియం నుంచి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ కలెక్టర్‌కు వివరించారు. వీఐపీల సిటింగ్, పార్కింగ్ తదితర వాటిపై కలెక్టర్‌కు ఆయన వివరించారు. మైదానంలో పేరెడ్ వద్ద రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆర్అండ్బీ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. డయాస్ ఏర్పాట్లుకు ఏజెన్సీని గుర్తించాలని, వాటర్ ప్రూఫ్ టెంట్స్ ఉండాలన్నారు. ఎన్సీసీ కేడెట్లు 500 మంది వస్తారని, వారికి వసతి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ చెప్పగా, వారికి పెద్దపాడు, సింగుపురం రోడ్డు మార్గంలో ఒక కళాశాల ఉందని శ్రీకాకుళం తహసీల్దార్ మురళీకృష్ణ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను శకటాలలో చూపించేందుకు 12 చక్రాలు గల 12 వాహనాలు ఉండాలని ఉప రవాణా కమిషనర్‌కు ఆదేశించారు. వాహనాలను ముందుగా పరిశీలించి ఏర్పాట్లు చేయాలన్నారు. ఒకసారి ట్రైల్ కూడా వేయాలన్నారు. శానిటేషన్, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాట్లును మున్సిపల్ కమిషనర్, ఆర్డబ్ల్యూఎస్, ఎస్ఈలు చూసుకోవాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించిన జాతీయ గీతం, రాష్ట్రానికి సంబంధించిన గీతం, శ్రీకాకుళం జిల్లాకు సంబం ధించిన గీతాలు ఉండాలని డీపీఆర్వో ఎల్.రమేష్‌కు ఆదేశించారు. వచ్చే అతిథులకు, అధికారులకు వసతిపై చర్చించారు. వివిధ శాఖ అధికారులను, కమిటీలుగా నియమించాలని జాయింట్ కలెక్టర్–2 రజనీకాంతరావును ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధరబాబు, జిల్లా ఏఎస్పీ టి.పనసారెడ్డి డీఆర్వో కె.నాగేంద్రబాబు, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్ట ర్ జి.సి.కిషోర్‌కుమార్, జెడ్పీ సీఈవో బి.నగేష్, శ్రీకాకుళం, టెక్కలి ఆర్డీవోలు, తదితర అధికారులు పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు పోలవరం రాక
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఈ నెల 22న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో యంత్రాంగం బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. శనివారం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని ఎస్పీ భాస్కర్‌భూషణ్, జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి సోమవారం ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించి సంబంధిత అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో రివ్యూ సమావేశం జరపనున్నట్టు ఇంజనీరింగ్ అధికారులు చెప్పారు. ప్రాజెక్టు ఎస్ఈ వీఎస్ రమేష్‌బాబు, ఆర్డీవో ఎస్.లవన్న, పోలవరం డీఎస్పీ ఏటీవీ రవికుమార్ ఉన్నారు.