ఆర్ట్ ICON
మదిలో మెదిలే ఆలోచనలు చిత్తరువులుగా మారితే పెయింటింగ్. ఇదో కళ... ఇలాంటివే మరో అరవైమూడు కళలు. ‘సమాజాన్ని ప్రభావితం చేయగలిగి, ఉపయోగపడేదే నిజమైన కళ’ అంటారు అవనిరావ్ గండ్ర. దాన్ని ఆచరణలోనూ పెట్టి చూపుతున్నారు. యువ ఆర్టిస్టులను వెలుగులోకి తెచ్చేందుకు ‘ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ’ ప్రారంభించారు. ఇటీవలే ఆర్ట్స్ మేనేజ్మెంట్ అండ్ కల్చర్ పాలసీలో ఆర్ట్ థింక్ సౌత్ ఏసియా (ఏటీఎస్ఏ) ఫెలోషిప్‌నకు ఎంపికయ్యారు. హైదరాబాద్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి ఆర్టిస్టుగా రికార్డులకెక్కిన అవని ‘సిటీ ప్లస్’తో తన అనుభవాలు పంచుకున్నారు.
నగరంలో ప్రతిభ ఉన్న చిత్రకారులకు కొదవ లేదు. వీరందరికీ రావల్సినంత పేరు ప్రఖ్యాతులు లభించడం లేదు. అందుకు ఆర్థిక పరిస్థితులు, కమ్యూనికేషన్ నైపుణ్యం, ఆర్ట్ మేనేజ్మెంట్ లేకపోవడం వంటివి కారణాలు కావచ్చు. తమ బలంతో పాటు బలహీనతలు కూడా వీరికి తెలియాలి. అప్పుడే ప్రతి బొమ్మా అర్థవంతమవుతుంది. ఆదరణ పొందుతుంది.
ప్రోత్సాహం కావాలి..
ప్రముఖ ఆర్టిస్టుల పెయింటింగ్‌లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. వీరి కళాఖండాలు లక్షల రూపాయల్లో అమ్ముడవుతుంటాయి. అందుకే చాలా గ్యాలరీలు వారి ఆర్ట్‌ల వైపే మొగ్గుచూపుతాయి. వీరితో పాటుగా యువ ఆర్టిస్టుల పెయింటింగ్‌లకు కూడా అన్ని గ్యాలరీలు ప్రాధాన్యమిస్తే... మరెంతో మంది ఔత్సాహికులు వెలుగులోకి వస్తారు.
ఆర్ట్‌ను వ్యాపారంలా కాకుండా ఓ కళగా ప్రోత్సహిస్తే మరింత మంది కళాకారులు పుట్టుకొస్తారు. ఈ చిన్ని ప్రయత్నంలో భాగంగానే నాలుగేళ్ల క్రితం ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ పుట్టుకొచ్చింది. ఎక్కువ శాతం యువ ఆర్టిస్టుల ఎగ్జిబిషన్లు చేస్తుంటాం. సిటీతో పాటుగా ముంబై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై... ఇలా వివిధ నగరాలకు చెందిన ఆర్టిస్టుల పెయింటింగ్ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుత సమస్యలతో పాటు మంచి థీమ్‌పై పెయింటింగ్ చేసిన వారికి గ్యాలరీలో స్పేస్ ఇస్తున్నాం. ఆర్ట్ ప్రేమికుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. చాలా మంది ఆర్టిస్టులను ఒకేచోట చేర్చి వర్క్‌షాప్ కూడా నిర్వహిస్తున్నాం. పెయింటింగ్ ప్రావీణ్యం పెంచేందుకు
మార్గదర్శనం చేస్తున్నాం.
ఆనందంగా ఉంది...
స్వతహాగా ఆర్టిస్టును. ఆర్టిస్ట్ క్రియేటివిటీ నుంచి మొదలుకొని గ్యాలరీ మ్యూజియం, ఆర్ట్ రెసిడెన్సీ నడిపిస్తున్నా. చాలా మంది ఆర్టిస్టులు ఒకేచోట చేరి పని చేసుకోవడానికి ఉచితంగానే ఈ రెసిడెన్సీ నడుపుతున్నా. యువ ఆర్టిస్టులను వెలుగులోకి తేవాలన్న ధ్యేయమే ఈ రోజు నన్ను లండన్ (మే)లో జరిగే నెల రోజుల ఇంటర్న్‌షిప్‌నకు ఎంపిక చేసింది. నాతో పాటు భారత్ నుంచి నలుగురికి ఈ అవకాశం దక్కింది.
ఇది ఎంతో సంతోషాన్నిస్తోంది. ఇక...
హైదరాబాద్‌లో వండర్‌ఫుల్‌గా కళాఖండాలు గీసే ఎనిమిది మంది ఆర్టిస్టులను గుర్తించా. వీరిని అంతర్జాతీయ వేదికగా ప్రమోట్ చేయాలనుకుంటున్నా. నా లండన్ పర్యటనలో ఈ కోరిక నెరవేరుతుందనుకుంటున్నా.
వాంకె శ్రీనివాస్