పండగవేళ.. పల్లె కళ..
నేటి ఆధునిక ఫ్యాషన్లు చిన్నాపెద్దను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అయితే, పరుగులు పెట్టే మోడ్రన్ ఏజ్‌లోనూ ఒక్కసారి ఆగి,ప్రకృతి సింగారాలను ఒళ్లంతా నింపుకొంటే... పల్లె సిరులను నట్టింటికి తెచ్చుకొంటే... ఆ అందం, ఆనందం ఇబ్బడి ముబ్బడి అవుతాయి.
విఘ్నాధిపతి వినాయకుని మట్టితో మూర్తిగా మలిచి, అందంగా అలంకరించి శ్రద్ధగా పూజలు జరుపుతాం.అలాగే పడతుల అలంకరణలోనూ ప్రకృతి సిరులకు స్థానం ఇస్తే పండగ పూట కళగా వెలిగిపోతారు.
చేనేత..కళనేత..
మంగళగిరి ప్రింటెడ్ కాటన్ మెటీరియల్‌తో పరికిణీని తీర్చిదిద్ది, ప్లెయిన్ షిఫాన్ ఓణీకి రాసిల్క్ బార్డర్ జత చేసి, డిజైనర్ బ్లౌజ్‌లు ధరిస్తే పల్లెకళతో వెలిగిపోతారు. వీటి మీదకు టైటా ఆభరణాలు, పొడవాటి కురులను అల్లిన జడలు ప్రత్యేక ఆకర్షణను తీసుకువస్తాయి. పోచంపల్లి, గద్వాల్, కలంకారీ, ఇక్కత్.. ఇలా మన చేనేత ఫ్యాబ్రిక్స్‌తో తయారుచేసుకున్న దుస్తులు ఎప్పటికీ కొత్తదనంతో ఆకట్టుకుంటూనే ఉంటాయి.
- భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్
ప్రాచీన కళ.. టైటా...
ఏ లోహపు ఆభరణాలకూ తీసిపోని విధంగా ప్రత్యేకతను చాటుతున్న ఈ ఆభరణాలను ఆధునిక యువతులు అమితంగా ఇష్టపడుతున్నారు. నదీ తీరంలో కొట్టుకువచ్చిన ఒండ్రుమట్టిని సేకరించి, పొడిచేసి, ఉడికించి, తగిన అచ్చులలో పోసి ఈ ఆభరణాలను తయారుచేస్తాను. వీటిని వెలిసిపోని రంగుల తో తీర్చిదిద్దుతాను. సంప్రదాయ, ఆధునిక దుస్తుల మీదకు అందంగా నప్పే ఈ ఆభరణాలలో యాంటిక్ గోల్డ్ జుంకాలు, హారాలు ప్రాచీనకళతో ఉట్టిపడుతుంటాయి. వీటి ధరలు రూ.350 నుంచి 5వేల రూపాయల వరకు ఉన్నాయి. ధరించే దుస్తుల రంగులను బట్టి ఆభరణాలను తయారు చేయవచ్చు.
- అరుణా దీపక్, టైటా ఆభరణాల నిపుణురాలు
యాంటిక్ లుక్‌తో కనువిందుచేసే ఈ ఆభరణాలు కంచి, ధర్మవరం, ఉప్పాడ.. పట్టు చీరలకు సరైన ఎంపిక.
- నిర్వహణ: నిర్మలారెడ్డి