ఊపిరితిత్తుల కౌన్సెలింగ్
నడిస్తే ఆయాసం... ఛాతీనొప్పి..?
నా వయసు 33. పదేళ్ల నుంచి ఒక ఆస్బెస్టాస్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. మూడేళ్ల నుంచి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాను. మొదట్లో నా సమస్యను టీబీగా అనుమానించి చికిత్స తీసుకున్నాను. ఫలితం లేదు. వడివడిగా నడవలేకపోతున్నాను. పరుగెడితే పట్టలేనంత ఆయాసం, రొప్పుతో పాటు ఛాతీలో భరించలేనంత నొప్పి. మిత్రులు హైదరాబాద్కు వెళ్లి స్పెషలిస్టుకు చూపించమంటున్నారు. మీ సలహా ఏమిటి?
- బి. నరసింహారావు, వీరులపహాడ్
ఊపిరితిత్తుల వ్యాధులకూ, క్యాన్సర్కు దారితీసే కొన్ని ప్రధాన కారణాలలో ఆస్బెస్టాస్ ఒకటి. దీన్నే రాతినార అంటారు. ఆస్బెస్టాస్ గనులు లేదా పరిశ్రమల్లో పనిచేసేవారి ఆరోగ్యంపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఆస్బెస్టాస్ రాళ్లను పిండి చేస్తున్న సమయంలో కంటికి కనిపించనంతటి పరిణామంలో వాటినుంచి వెలువడే ఖనిజ ధాతువులు గాలిలో కలుస్తాయి. ఆ గాలిని పీల్చినప్పుడు అవి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి, అక్కడి కణజాలాన్ని రోగగ్రస్తం చేస్తాయి. ఊపిరితిత్తుల చుట్టూ దానికి రక్షణ కవచంలా ఉండే ఒక పలచటి పొర ఉంటుంది. దీన్నే మీసోథీలియోమా అంటారు. ఆస్బెస్టాస్ ఖనిజ ధాతువులు గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించిన తర్వాత దానికి రక్షణగా ఉండే ఈ పొరను తీవ్రంగా ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి. అది క్రమంగా మీసోథీలియోమా క్యాన్సర్కు దారితీసే అవకాశం ఉంది. దీన్ని మొదట్లోనే గుర్తిస్తే చికిత్సకు అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పటికే మీరు చాలా కాలయాపన చేశారు. ఇక ఎంతమాత్రం ఆలస్యం చేసినా మీ సమస్య మరింత జటిలం అయ్యే అవకాశం ఉంది.
కాబట్టి ముందుగా మీ సమస్యకు కారణం ఏమిటో తెలుసుకునేందుకు ఊపిరితిత్తుల నిపుణులను కలవండి. సమస్యను బట్టి చికిత్స ఉంటుంది. అయితే మీరు ఉన్న వృత్తిరీత్యా (ప్రొఫెషనల్ హజార్డ్గా) మీకు మీసోథీలియోమా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వైద్యరంగంలో వచ్చిన ఆధునిక పురోగతి కారణంగా అది మీసోథీలియోమా క్యాన్సరే అని నిర్దారణ జరిగినా... దీనికి వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ (వ్యాట్స్) ద్వారా చికిత్స చేయవచ్చు. ఇక అవసరాన్ని బట్టి కీమో, రేడియేషన్ చికిత్సలనూ వినియోగించుకోవచ్చు. ఆస్బెస్టాస్తో వచ్చే ఎంతటి జటిలమైన సమస్యకైనా ఇప్పుడు పెద్దనగరాల్లో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీలైనంత త్వరగా మీకు దగ్గరలోని పెద్ద సెంటర్లకు వెళ్లండి.