ముగ్గురు పోలీసుల సస్పెన్షన్
ఠాణే: కర్తవ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై సీనియర్ ఇన్స్పెక్టర్సహా ముగ్గురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ధాయ్గఢ్ స్టేషన్కు చెందిన సీనియర్ ఇన్స్పెక్టర్ అశోక్ జగ్తాప్, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్తోపాటు ఓ కానిస్టేబుల్ని గురువారం సస్పెండ్ చేశామని ఠాణే పోలీస్ కమిషనర్ తెలిపారు. ముంబ్రా-పన్వేల్ రోడ్డులోని ధాయ్గఢ్లోగల డ్యాన్స్బార్పై ముంబై పోలీసు విభాగానికి చెందిన సామాజిక భద్రతా విభాగం బుధవారం రాత్రి మెరుపుదాడి చేసి 14 మందిని అరెస్టు చేసింది. సదరు బార్లో పనిచేస్తున్న 57 మంది యువతులకు విముక్తి కలిగించింది. పోలీసులు దాడి చేసిన విషయాన్ని గమనించిన బార్ యజమాని అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. పోలీసులు అరెస్టుచేసిన వారిలో బార్ మేనేజర్ రాకేశ్శెట్టికూడా ఉన్నాడు. నిందితులందరినీ కోర్టులో హాజరుపరచగా రెండు రోజుల పోలీసు కస్టడీకి ఆదేశించింది. కాగా డ్యాన్స్బార్ కార్యకలాపాలపై ఫిర్యాదు చేసినప్పటికీ ఠాణే పోలీసులు పట్టించుకోకపోవడంతో నగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ... ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఉన్నతాధికారులు పై చర్య తీసుకున్నారు.