జిల్లాల పునర్విభజన పేరుతో కేసీఆర్ నాటకాలు
వరంగల్‌ను విడగొట్టాలనే
ఆలోచన రావడం దురదృష్టకరం
∙బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి
పరకాల : జిల్లాల పునర్విభజన పేరుతో సీఎం కేసీఆర్ మూడు నాలుగు నెలల నుంచి నాటకాలు ఆడుతున్నా రని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలన సౌలభ్యం కోసం జిల్లాలను ఏర్పాటు చేస్తే మంచిదేకానీ.. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు.
ట్రైసిటీగా కొనసాగుతున్న కాజీపేట, హన్మకొండ, వరంగల్ పట్టణాలను విడగొట్టాలనే ఆలోచన రావడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌కు కరీంనగర్, కరీంనగర్లో ఉన్న ఈటెల రాజేందర్‌కు హన్మకొండను అప్పగించడం కోసమే సీఎం కేసీఆర్ చారిత్రాత్మకమైన వరంగల్‌ను విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హన్మకొండ జిల్లా ఏర్పాటును బీజేపీ వ్యతిరేకిస్తుందని, అవసరమైతే ప్రజలతో కలిసి ప్రత్యక్ష పోరాటాలకు దిగుతుందన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభమైన తిరంగ యాత్ర సెప్టెంబర్ 17వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. యాత్రలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పరకాల అమరధామంకు రానున్నారని ఆయన పేర్కొన్నారు.