‘తెలంగాణ’తో కొత్త సవాళ్లు: ఐబీ చీఫ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశంలోని భద్రతా సంస్థలకు కొత్త సవాళ్లను విసిరిందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డెరైక్టర్ ఆసిఫ్ ఇబ్రహీం చెప్పారు. గురువారం ఉదయం ఢిల్లీలో రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ఈ సదస్సును ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ప్రతి ఉద్యమాలకు ఆజ్యం పోసిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితి ఇటు రాష్ట్ర స్థాయిలో అటు జాతీయ స్థాయిలో భద్రతా సంస్థలకు, నిఘా విభాగాలకు కొత్త సవాళ్లు విసిరిందన్నారు.
అయితే ఆయన రాష్ట్రంలో కొనసాగుతున్న ఉద్యమాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాఖ్యలు చేశారా? లేక దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమాలను దృష్టిలో ఉంచుకునా? అనే సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర విభజనపై కేంద్రం ఏర్పాటుచేసిన మంత్రుల బృందం (జీవోఎం) తన కసరత్తును వేగవంతం చేసిన నేపథ్యంలో ఐబీ చీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉగ్రవాదం, మావోయిస్టులు, మత హింస... ఇలా వివిధ అంశాల్లో నిఘా విభాగాలకు ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లను ఇబ్రహీం ప్రస్తావించారు. ఈ సదస్సులో పాల్గొన్న డీజీపీలు, ఐజీపీలు తమ అంతర్గత చర్చల్లో ఐబీ చీఫ్ వ్యాఖ్యలతో ఏకీభవించారని అధికార వర్గాలు చెప్పాయి.