ఓలా, ఉబెర్ లకు సరికొత్త ఆదేశాలు?
న్యూఢిల్లీ : ప్రైవేట్ టాక్సీ ఆపరేటర్లు ఓలా, ఉబెర్ లకు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ సరికొత్త ఆదేశాలు జారీ చేయనుంది. ఇక నుంచి టాక్సీ మీటర్ల ద్వారానే చార్జీలు లెక్కించడం మొదలు పెట్టాలని కోరినట్టు తెలుప్తోంది. జీపీఎస్ ద్వారా లెక్కించే దూరంలో అవకతవకలు, తేడాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. ఉబెర్ , ఓలా కంపెనీలు ఛార్జీల వసూళ్ల విధానంలో ఇప్పుడు అమలు చేస్తున్న జీపీఎస్ పద్దతిని కాకుండా టాక్సీ మీటర్ల పద్ధతిని వినియోగించాలని కోరింది. టాక్సీ అగ్రిగేటర్స్ ప్రస్తుతం వాడుతున్ ఈ విధానం ద్వారా చట్టాన్ని అతిక్రమిస్తున్నారని రవాణా మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు చెప్పారు. టాక్సీ మీటర్లను వాడాలనే అంశాన్ని మోటార్ వాహనాలు చట్టం స్పష్టంగా చెబుతోందన్నారు. అయితే ఈ ఆదేశాలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
జీపీఎస్ ద్వారా దూరాన్ని కొలిచే పద్ధతిలో కొన్ని సమస్యలున్నాయని అందుకే బ్లాక్ అండ్ ఎల్లో టాక్సీ మీటర్ కార్డ్ ఉత్తమమని తాము భావిస్తున్నామని మంత్రిత్వ శాఖతెలిపింది. దీనికి సంబంధించి అనేక ఫిర్యాదులు, ఫీడ్ బ్యాక్ తమకు అందిందని తెలిపింది ఉబెర్, ఓలా సంస్థలో ఇటీవల జరిగిన సమావేశాల్లో దీన్ని తక్షణమే పరిష్కరించాల్సిందిగా చెప్పామన్నారు. అటు తమ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో వీటిని నియంత్రించేందుకు సమగ్ర మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో తెలిపారు ఆటో రిక్షాలు, ప్రయివేటు టాక్సీ తదితర కంపెనీలకు బ్లాక్ అండ్ ఎల్లో టాక్సీ మీటర్ల పరిధిలోకి తీసుకురానున్నట్టు చెప్పారు. అయితే దీనిపై ఉబెర్ వ్యాఖ్యానించడానికి తిరస్కరించగా ఓలా మీడియా ప్రశ్నలకు ఇమెయిల్ కు ఇరు సంస్థలు స్పందించడం లేదు.