జబ్బుల్లోనూ మహిళలే టాప్..
మధుమేహం, ఊబకాయంలో వారే ఎక్కువ
తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్లే సమస్యలు
సిటీబ్యూరో: మారిన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వెరసి మహిళల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పురుషుల్లో ఎక్కువగా కన్పించే గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు మహిళల్లో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జీవనశైలిని మార్చుకోకపోతే భవిష్యత్తులో భారీ నష్టం తప్పదని హెచ్చరించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డయాబెటిక్స్, ఎండోక్రైనాలజీ అండ్ యాడిపాసిటీ (ఒబెసిటీ), ఆస్లర్ అకాడమీ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం హోటల్ తాజ్ డెక్కన్‌లో మధుమేహం, ఊబకాయం, ఎండోక్రైనాలజీపై సదస్సు నిర్వహించారు. దీనిని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. దేశ విదేశాలకు చెందిన సుమారు 200 మంది వైద్య నిపుణులు ఇందులో పాల్గొని ప్రసంగించారు. ప్రతి పది మందిలో ఒకరు మధుమేహం, అధిక బరువు, థైరాయిడ్, గుండె జబ్బుల్లో ఏదో ఒక దానితో బాధపడుతున్నారని తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాల్లో మధుమేహం
దేశ మధుమేహ రాజధాని హైదరాబాద్‌గా చెప్పుకునే వాళ్లం. కానీ హైదరాబాద్ కన్నా అత్యధికంగా మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో మధుమేహులు ఎక్కువ ఉన్నట్టు తేలింది. నగరంలో పదేళ్లలోపు ఏడువేల మంది చిన్నారులు మధుమేహంతో బాధపడుతుంటే, వీరిలో 3000 పైగా మంది నెలవారి ఇన్సులిన్ ఖర్చులకు నోచుకోలేని దుస్థితిలో ఉన్నారు. సజ్జలు, జొన్నలు, రాగులు, ముడి బియ్యం వంటకాలు తినడం ఉత్తమం.
- డాక్టర్ పీవీరావు, నిమ్స్ ఎండోక్రైనాలజీ విభాగం
పొట్టపై కొవ్వు ప్రమాదం
భారతీయుల్లో పొట్ట, మూత్రపిండాలు, కాలేయం, గుండె, కిడ్నీల చుట్టూ కొవ్వు పేరుకు పోతుంది. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు చాలా ప్రమాదం. పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువగా ఊబకాయం బారిన పడుతున్నారు. పరోక్షంగా ఇది గుండె, మోకాళ్లు, కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుంది. మిత ఆహారం, విధిగా వ్యాయామం చేయడం ద్వారా ఈ వ్యాధుల బారినపడకుండా కాపాడుకోవచ్చు. - డాక్టర్ శ్యామ్ కల్వలపల్లి, ఐడియా సెంటర్
ఆరోగ్య స్పృహ పెరగాలి
యూకేలో 5 శాతం మంది మధుమేహంతో బాధపడుతుంటే, భారతదేశంలో మాత్రం 15 శాతం మంది మధుమేహులు ఉన్నారు. సెలైంట్ కిల్లర్‌గా చెప్పుకునే ఈ వ్యాధి పట్ల అప్రమత్తమై ఎవరికి వారు నియంత్రణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ సంఖ్య రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంది. దీర్ఘకాలిక వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి, వారిని ఆ దిశగా చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- డాక్టర్ జెఫ్రీ స్టీఫెన్, లండన్