కానిస్టేబుల్ అభ్యర్థులకు వైద్యపరీక్షలు
ఆదిలాబాద్ : ఎంపికైన కానిస్టేబుళ్ల అభ్యర్థులకు రిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వైద్య పరీక్షల ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం ఆదిలాబాద్ ఏఎస్పీ పనసారెడ్డి అభ్యర్థుల వైద్యపరీక్షల ఏర్పాట్లను పరిశీలించారు. శిక్షణకేంద్రం డీఎస్పీ సీతారాములు, ఇద్దరు ఎస్సైల పర్యవేక్షణలో పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రతీరోజు 60 మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఇప్పటివరకు 418మంది అభ్యర్థులకు పరీక్షలు పూర్తయ్యాయన్నారు.
మిగతా 125 మంది అభ్యర్థులకు మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. రిమ్స్ డైరెక్టర్ అశోక్ నేతృత్వంలో వైద్యులు సహకారం అందిస్తున్నారన్నారు. సమయానుసారంగా అభ్యర్థులు రిమ్స్‌లో హాజరుకావాలన్నారు. వైద్య పరీక్షలతో పాటు అభ్యర్థుల ఉద్యోగ పరిశీలన కొనసాగుతుందన్నారు. 12 ప్రత్యేక పోలీసు బృందాలు ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల పూర్వపరాలు, విద్యాభ్యాసం, వ్యక్తిత్వం, నిజపత్రాలను పరిశీలిస్తోందన్నారు. త్వరలో శిక్షణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో శిక్షణ డీఎస్పీ సీతారాములు, ఎస్సైలు గంగాధర్, విష్ణుప్రకాశ్, పోలీస్ డాక్టర్ గంగారాం, వైద్యులున్నారు.