ఉక్కుపాదం
నర్సీపట్నం: గంజాయి సాగు, రవాణాదారులపై సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. మన్యంలో దీని నిర్మూలనకు 60 రోజుల యాక్షన్‌ప్లాన్‌తో ముందుకెళుతోంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పీడీ చట్టం ప్రయోగించి గంజాయి వ్యాపారంతో సంపాదించిన ఆస్తులను శుక్రవారం అధికారులు జప్తు చేశారు. 1985లో ఈ చట్టం అమల్లోకి వచ్చినా ఇప్పటి వరకు ఆస్తులు జప్తు చేసిన సంఘటనలు రాష్ట్రంలో ఎక్కడా లేవు. తరచూ పట్టుబడుతున్న 50 మందిని గుర్తించారు. త్వరలో వీరిపైనా ఈ చట్టం ప్రయోగిస్తున్నారు. ఏఏ ప్రాంతాల్లో గంజాయి సాగవుతున్నదీ? ఇందుకు బాధ్యులెవరు? వెనుక ఎవరు ఉన్నారు..ఆర్థికంగా ఎవరు సపోర్టు ఇస్తున్నారు? ఇలా మూలాల్లోకి వెళ్లి అడ్డుకట్ట వేయాలని అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. నర్సీపట్నం ఏఎస్పీ ఐశ్వర్యరస్తోగి శుక్రవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
రాష్ట్రంలో మొదటి సారిగా నర్సీపట్నం సబ్ డివిజన్లో ఎన్డీపీఎస్ చట్టాన్ని ప్రయోగించి ఆస్తులను జప్తు చేశామన్నారు. ఇందుకు ఆస్తుల జప్తునకు కొత్తకోట సీఐ కోటేశ్వరరావు విశేష కృషి చేశారన్నారు. నాలుగు ఐదు గంజాయి కేసుల్లో అరెస్టు అయిన వ్యాపారుల ఆస్తుల వివరాలను సేకరిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే కొత్తకోట సర్కిల్ పరిధిలో రత్నంపేటకు చెందిన వూడి బాబ్జి , సీలేరుకు చెందిన గిసంగి ప్రేమ్బహుదూర్ల ఆస్తులను జప్తు చేశామన్నారు. వూడి బాబ్జి పదేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తూ పలు కేసుల్లో అరెస్టు అయ్యాడన్నారు.
ప్రస్తుతం బాబ్జి సెంట్రల్ జైల్లో ఉన్నాడన్నారు. ఇతనికి సంబంధించి అనకాపల్లి కెఎన్ఆర్ పేటలో ఉన్న రెండు అంతస్తుల ఇల్లు, 34.28 గ్రాముల బంగారం అభరణాలు, రూ.40 వేలు నగదు, బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేశామన్నారు. నేపాల్‌కు చెందిన గిసంగి ప్రేమ్ బహుదూర్ సీలేరులో స్థిర నివాసం ఏర్పర్చుకుని వ్యాపారం సాగిస్తున్నాడు. ఇతనిపై కూడా పలు కేసులు ఉన్నాయన్నారు. బహుదూర్‌కు చెందిన రావికమతం మండల కేంద్రంలో ఉన్న 50 సెంట్ల స్థలం, స్వీప్ట్డిజైర్ కారు జప్తు చేశామన్నారు. 50 సెంట్ల స్థ«లం విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందన్నారు. గంజాయి స్మగ్లర్ల ఆస్తుల జప్తుకు మొదటి అడుగు వేశామన్నారు. భవిష్యత్తులో మరింత మంది గంజాయి స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేస్తామన్నారు. మనీలాండరింగ్, ఎన్డీపీఎస్ కింద నమోదైన కేసులను మినిస్ట్రీస్ ఆప్ ఫైనాన్స్ కాంపిటెంట్ అధారిటీ(చెన్నై)వారు ఆస్తులకు సంబంధించిన రికార్డులు, డాక్యుమెంట్లను పరిశీలించి అక్రమ ఆస్తులుగా నిర్ధారణ అయితే జప్తు చేసి ప్రభుత్వానికి జమచేస్తారన్నారు.
ఈ ప్రక్రియ శ్రమతో కూడినదైనప్పటికీ గంజాయి నిర్మూలనే లక్ష్యంగా వీరి ఇద్దరి ఆస్తులకు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించి మినిస్ట్రీస్ ఆఫ్ ఫైనాన్స్ కాంపిటెంట్ అధారిటీకి నివేదించామన్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు అయిన వారికి ఏడాది, కొత్తగా అమల్లోకి వచ్చిన పిట్ ఎన్డీపీఎస్ చట్టం ద్వారా అరెస్టు అయితే రెండేళ్లు బెయిల్ రాదన్నారు. సబ్ డివిజన్ పరిధిలో 2016లో 160, 2017లో 97 గంజాయి కేసులు నమోదయ్యాయన్నారు. వీరిలోఐదుగురిపై పీడీ యాక్డు కింద కేసు నమోదుకు కసరత్తు చేస్తున్నామన్నారు. మన్యంలో సుమారు 10 వేల ఎకరాల్లో గంజాయి తోటలు ఉన్నాయన్నారు. గత నెల రోజుల్లో 600 ఎకరాల్లో పంటను «ధ్వంసం చేశామన్నారు. గంజాయి సమూల నిర్మూలనకు పోలీసు, ఎక్సైజ్ శాఖలు సమిష్టిగా కృషి చేస్తున్నాయన్నారు. రెండు మూడేళ్లలో గంజాయి నిర్మూలన జరుగుతుందని ఏఎస్పీ ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.